ఆ జిల్లాలో టీడీపీకి ఎదురుగాలి.. ఒక్క సీటూ కష్టమే
రానున్న ఎన్నికలు టీడీపీ నాయకులకు సవాల్ విసురుతున్నాయనడంలో సందేహం లేదంటున్నారు విశ్లేషకులు. అలాంటిది బలంగా ఉన్న జిల్లాలను మినహాయిస్తే.. పార్టీ కొంత బలహీనంగా ఉన్న జిల్లాలపై దృష్టిసారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షం బలంగా ఉన్న జిల్లాలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారిం చినా.. అవి సత్ఫలితాలు ఇవ్వడం లేదు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో పార్టీ పరిస్థితి ఘోరంగా తయారైందనే చర్చ జో రందుకుంది. గతంలో మూడు సీట్లు గెలవగా ఇప్పుడు అందులో రెండు సీట్లు కూడా గెలవలేని స్థితికి పడిపోయిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
పనిచేయని మంత్రుల బలం...
అధికార పార్టీ గెలిచిన సీట్లలోనే ఇలా ఉంటే ఇక మిగిలిన నియోజకవర్గాల్లోనూ నానాటికీ దిగజారిపోతోందని ద్విత్రీయ శ్రేణి నాయకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇద్దరు మంత్రులు ఉన్నా.. పార్టీ పరిస్థితి మాత్రం గాడి తప్పిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నెల్లూరు జిల్లాలో టీడీపీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. నాయకుల మధ్య సమన్వయలోపంతో పాటు అంతర్గ విభేదాలు పార్టీని దెబ్బతీస్తున్నాయని నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మున్సిపల్ మంత్రి నారాయణ, వ్యవసాయ శాఖమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.. జిల్లాలపై అంతగా పట్టు సాధించలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ముగ్గురిలో ఇద్దరు గెలవరా..?
వీరు ఎమ్మెల్సీలుగా ఎన్నికవడంతో పార్టీ నేతల మధ్య సమన్వయం కుదర్చలేక పోతున్నారని తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ మరింత బలహీనంగా మారుతోందని చెబుతున్నారు. 2014లో గెలిచిన ముగ్గురి ఎమ్మెల్యేల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచే పరిస్థితి లేదని, మూడో ఎమ్మెల్యే పరిస్థితి ఇప్పుడు చెప్పలేమంటున్నారు నాయకులు. కొవ్వూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు మళ్లీ బరిలోకి దిగితే భారీ ఓట్ల తేడాతో ఓడిపోవడం ఖాయం అని టీడీపీ నాయకులే చెబుతున్నారు.
బెంగళూరులోనే బిజీగా..
వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రామకృష్ణ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని ఆయన అనుచరులు చెబుతున్నా.. అనవసర ఆవేశమే ఆయన కొంపముంచుతుందే భయం నెలకొంది. ఉదయగిరిలో మళ్లీ ఎమ్మెల్యే పోటీ చేసే అవకాశం చంద్రబాబు ఇవ్వరని కానీ.. తమ ఎమ్మెల్యేనే పోటీకి దూరంగా ఉంటారని బంధు,మిత్రులు, అనుచరులు చెబుతున్నారు. ఉదయగిరి ఎమ్మెల్యే రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో ఎక్కువగా బెంగుళూరులో ఉంటూ పార్టీని భూస్థాపితం చేశారనే విమర్శలు కూడా ఉన్నాయి.
ముఖ్యమంత్రి మదిలో ఏముంది..?
పోలంరెడ్డి.. కొవ్వూరులో అదృష్టం కలసి వచ్చి మాజీమంత్రుల సహకారంతో చావుతప్పి కన్నులొట్టబడ్డ చందంగా ఓటమి నుంచి తప్పించుకున్నారు. ఈ మూడు నియోజకవర్గాలకు చెందిన పూర్తి సమాచారం సీఎం చంద్రబాబు తెప్పించుకున్నారట. వెంకటగిరి నియోజకవర్గం గురించి ఇంకా ఆయన ఏ నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. ఎమ్మెల్యే రామకృష్ణ నియోజకవర్గంలో వ్యతిరేకత ఉన్నా మళ్లీ ఆయన గెలుస్తానని చెబుతున్నారు. తాత్కాలికంగా తనపై ఉన్న వ్యతిరేకతను ఏదో విధంగా సరిచేసుకుంటానని ఆయన చెబుతున్నారు. మూడు నియోజకవర్గాల్లోనేగాక మిగిలిన నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని తేలినట్టు సమాచారం.
గ్రూపు రాజకీయాలే ముప్పు తేస్తున్నాయి...
జిల్లాలో టీడీపీ మూడు సిట్టింగ్ సీట్లు కోల్పోవడం ఓ మైనస్ అయితే మిగిలిన 7 సీట్లలో ఒక్కటి కూడా గ్యారెంటీ గెలుస్తుందన్న పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో ఆనం, సోమిరెడ్డి, బీద, నారాయణ ఇలా గ్రూపు రాజకీయాలు ఒక మైనస్ అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత మిగిలిన నియోజకవర్గాల్లోనూ పార్టీ పుంజుకోకపోవడం, ప్రజల్లో గెలవని వారికి మంత్రి పదవులు ఇవ్వడంతో వారు జిల్లాను పట్టించుకోకపోవడంతో నెల్లూరు జిల్లాలో టీడీపీ గత ఎన్నికలకు ఇప్పటకీ ఏ మాత్రం పుంజుకోలేదు.