తెలంగాణ స్పీకర్ ఎవరు..?
తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చి 15 రోజులు గడిచింది. తెలంగాణతో పాటు ఫలితాలు వచ్చిన మిగతా నాలుగు రాష్ట్రాలోల మంత్రివర్గ కూర్పు కూడా కొలిక్కి వచ్చింది. పైగా [more]
తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చి 15 రోజులు గడిచింది. తెలంగాణతో పాటు ఫలితాలు వచ్చిన మిగతా నాలుగు రాష్ట్రాలోల మంత్రివర్గ కూర్పు కూడా కొలిక్కి వచ్చింది. పైగా [more]
తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చి 15 రోజులు గడిచింది. తెలంగాణతో పాటు ఫలితాలు వచ్చిన మిగతా నాలుగు రాష్ట్రాలోల మంత్రివర్గ కూర్పు కూడా కొలిక్కి వచ్చింది. పైగా ఏ విషయాన్ని తొందరగా తేల్చుకోలేని కాంగ్రెస్ కూడా ఆ పార్టీ గెలిచిన రాష్ట్రాల్లో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే, తిరుగులేని మెజారిటీతో తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ మాత్రం ఇంకా మంత్రివర్గం ఏర్పాటు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ వంటి పదవులు ఎవరికి అనేది ఇంకా ఫైనల్ చేయలేదు. కేవలం మహమూద్ అలీ మాత్రమే కేసీఆర్ తో పాటు ప్రమాణస్వీకారం చేయగా ఆయనకు హోంమంత్రి పదవి దక్కింది. ఇంతలో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయడం, వివిధ రాష్ట్రాల పర్యటనకు వెళ్లడంతో మంత్రివర్గం, స్పీకర్ ఎంపిక ఆగిపోయింది. దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ పెరిగిపోతోంది.
ఈటెల పేరు బలంగా వినిపిస్తున్నా…
మంత్రివర్గం సంగతి అటుంచితే స్పీకర్ ఎంపిక ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. స్పీకర్ పదవి ఫలానా వారికే అంటూ రోజుకొక కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఇంతలో స్పీకర్ గా పనిచేసిన వారు మళ్లీ గెలవరనే సెంటిమెంట్ ఒకటి ఉండటంతో… స్పీకర్ గా పనిచేసేందుకు ఎమ్మెల్యేలు ఎవరూ పెద్దగా ఆసక్తిగా చూపించడం లేదని తెలుస్తోంది. సీనియర్ ఎమ్మెల్యేలంతా మంత్రి పదవులపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇక, భవిష్యత్ రాజకీయాల ధృష్ట్యా కేసీఆర్ కి అత్యంత నమ్మకస్తుడిని, కేటీఆర్ తోనూ మంచి సంబంధాలు ఉన్న సీనియర్ ఎమ్మెల్యేని స్పీకర్ గా నియమించే అవకాశ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కేసీఆర్ నమ్మకస్థుడిగా ఉన్న సీనియర్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను ఈసారి స్పీకర్ గా నియమిస్తారనే ప్రచారమూ జరుగుతోంది.
వారిద్దరూ మంత్రివర్గంలోకేనా..?
టీఆర్ఎస్ నుంచి ఆరుసార్లు విజయం సాధించిన ఈటెల రాజేందర్ పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించారు. 2014కి ముందు టీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా వ్యవహరించారు. ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ వాయిస్ ను బలంగా వినిపించారు. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కీలకమైన ఆర్థిక శాఖను కేసీఆర్ ఆయనకు కట్టబెట్టారు. అయితే, ఈసారి ఆయనను స్పీకర్ గా నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక స్పీకర్ రేసులో ఇంతకుముందు డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన పద్మా దేవేందర్ రెడ్డిని కూడా నియమించే అవకాశం ఉందంటున్నారు. అయితే, మహిళా కోటాలో ఆమెకు మంత్రి పదవి ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనేది మరో వాదన.
ఎస్టీ లేదా ఎస్సీ సామాజికవర్గానికి ఇస్తారా..?
ఇక, ఏకంగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న రెడ్యా నాయక్ పేరు కూడా స్పీకర్ పదవికి వినిపిస్తోంది. అయితే, ఆయనను కూడా ఈసారి కచ్చితంగా ఎస్టీ కోటాలో మంత్రివర్గంలోకి తీసుకోనున్నారని తెలుస్తోంది. ఇక ఉత్తర తెలంగాణకు చెందిన ఓ ఎస్సీ సామాజవర్గానికి చెందిన ఎమ్మెల్యేకి కూడా స్పీకర్ పదవి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. కానీ, ఆయన కూడా సుదీర్ఘకాలంగా అందని ద్రాక్షలా ఉన్న మంత్రి పదవిపైనే కన్నేశారు. దీంతో అసలు స్పీకర్ ఎవరనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. మంత్రివర్గం ఏర్పాటుపై క్లారిటీ వచ్చాకే స్పీకర్ ఎవరనేది తేలే అవకాశం ఉంది. అయితే, స్పీకర్ పదవిపై రోజుకొక పేరు తెరపైకి వస్తుండటంతో ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది.