పార్టీ కోసమా..? ప్రజల కోసమా..?
రాజకీయాల్లో టైమింగ్ చాలా ముఖ్యం. నాయకులు తొందరపడి ముందే కూసినా దెబ్బతింటారు. అలాగని సరైన సమయంలో స్పందించకుండా తీవ్రంగా జాప్యం చేసినా ఆలస్యం అమృతం విషం అన్నట్లు [more]
రాజకీయాల్లో టైమింగ్ చాలా ముఖ్యం. నాయకులు తొందరపడి ముందే కూసినా దెబ్బతింటారు. అలాగని సరైన సమయంలో స్పందించకుండా తీవ్రంగా జాప్యం చేసినా ఆలస్యం అమృతం విషం అన్నట్లు [more]
రాజకీయాల్లో టైమింగ్ చాలా ముఖ్యం. నాయకులు తొందరపడి ముందే కూసినా దెబ్బతింటారు. అలాగని సరైన సమయంలో స్పందించకుండా తీవ్రంగా జాప్యం చేసినా ఆలస్యం అమృతం విషం అన్నట్లు నిర్ణయాలు వికటిస్తాయి. తాజాగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర సకాలంలో తీసుకుంటున్న నిర్ణయమేనా? లేక టీడీపీ హడావిడి పడుతోందా? అన్న చర్చ మొదలైంది. పార్టీ కోసమా? ప్రజల కోసమా? అన్నవిమర్శలూ తలెత్తుతున్నాయి.
సరైన తరుణమేనా..?
ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తుతూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజా చైతన్య యాత్రల పేరిట ప్రజల్లోకి వెళ్లేందుకు సంకల్పించింది. దీని ఫలితం సంగతి పక్కనపెడితే అసలు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లేందుకు అనువైన వాతావరణం ఉందా? అనే సందేహాలున్నాయి. ఇందులోని రాజకీయ కోణాలు ప్రస్తావనకు వస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల దెబ్బతో ఒకవైపు పార్టీ పూర్తిగా నిస్తేజమై పోయి ఉంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు తరుముకు వస్తున్నాయి. పార్టీ శ్రేణులను సంఘటిత పరిచి ఎన్నికలకు సమాయత్తం చేయాలి. వైసీపీని దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధం చేయాలి. ఇది పార్టీ పరంగా టీడీపీకి అత్యంత అవసరమైన లక్ష్యం. వైసీపీపై ప్రజల్లో అక్కడక్కడ కనిపిస్తున్న వ్యతిరేకతను పెంచి పెద్దది చేసేలా ప్రచారం నిర్వహించి ప్రభుత్వ వ్యతిరేకతకు వేదికను కల్పించాలి. తద్వారా రాజకీయంగా బలపడాలి. ఇది టీడీపికి రెండో లక్ష్యం. చైతన్య యాత్రలను స్థూలంగా చూస్తే ఈ రెండు కోణాలు కనిపిస్తాయి. అయితే అందుకు అనువైన సమయం ఆసన్నమైందా? అన్నదే రాజకీయంగా ఎదురయ్యే ప్రశ్న.
తొందరలో తడబాటు…
వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చి ఇంకా ఏడాది పూర్తి కాలేదు. పూర్తిగా పరిపాలనపై పట్టు సాధించకుండానే అనేక వివాదాస్పద నిర్ణయాల్లో కూరుకునిపోయిన మాట వాస్తవమే. అయితే విధానపరమైన నిర్ణయాలను ఏడాదిలోపుగానే పూర్తి చేసి, మిగిలిన పదవీకాలంలో వాటిని అమల్లోకి తీసుకురావడం ప్రాధాన్యంగా పెట్టుకోవాలనేది ముఖ్యమంత్రి జగన్ వైఖరిగా ఆ పార్టీ పెద్దలు చెబుతున్నారు. పరిపాలన పరంగా చూస్తే ఇది ఉపయోగకరమైన ధోరణిగానే కనిపిస్తుంది. కానీ తొందరగా అజెండా పూర్తి చేయాలనే హడావిడిలో తడబాట్లు కనిపిస్తున్నాయి. దీనివల్ల అనేకసార్లు ప్రతిపక్షానికి రాజకీయ విమర్శలకు అవకాశం కలుగుతోంది. అనేక సందర్భాల్లో సాధ్యాసాధ్యాలు , లాభనష్టాలు బేరీజు వేసుకోకుండా ప్రకటనలు చేయడం కూడా ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీస్తోంది. ఏదేమైనా సర్కారు ఇంకా బాలారిష్టాలను ఎదుర్కొంటోంది. పక్కాగా ఒక పద్ధతి ప్రకారం పనిచేసుకుని పోయేందుకు ఇంకొంత సమయం పట్టవచ్చు. ఈలోపుగానే ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. రాజకీయంగా వచ్చే ఆయుధాలను ఏ పార్టీ వదులుకోదు. ఈ తొమ్మిది నెలల కాలంలో అయిదారు అంశాలు తీవ్రమైన ప్రభావం కలిగినవిగా భావించి టీడీపీ ప్రజాచైతన్య యాత్రకు శ్రీకారం చుట్టింది.
సంక్షేమమే ఫస్టు…
వైసీపీ సర్కారుకు సంక్షేమమే మొదటి ప్రాధాన్యం. ఇందులో మరోమాటకు తావు లేదు. పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న నవరత్నాలు, పాదయాత్రలో ఇచ్చిన హామీలకు అత్యధిక ప్రాధాన్యం కల్పిస్తోంది. మౌలిక వసతుల ప్రాజెక్టులను సైతం పునస్సమీక్ష పేరిట పక్కనపెట్టి సంక్షేమ పథకాలకు నిధులను సర్దుబాటు చేశారు. ముఖ్యంగా అమ్మ ఒడి పథకానికి ఆరువేల కోట్ల రూపాయలు సమకూర్చడానికి వివిధ శాఖల నుంచి నిధుల సమీకరణ పెద్ద ఎత్తున సాగింది. ప్రజలకు నేరుగా వ్యక్తిగత లబ్ధి చేకూర్చే సంక్షేమ పథకాలే ఈ ప్రభుత్వ ఫ్లాగ్ షిప్ కార్యక్రమాలుగా వైసీపీ భావిస్తోంది. వీటిపై నేరుగా దాడి చేసేందుకు ప్రతిపక్షాలకు పెద్దగా ముడిసరుకు లేదు. స్కీముల అమలులో కొన్ని లోపాలున్నప్పటికీ సంక్షేమం వద్దని ఏ పార్టీ చెప్పలేదు కాబట్టి వాటి జోలికి వెళ్లడం లేదు. రేషన్ కార్డుల తొలగింపు, పింఛన్ల క్రమబద్ధీకరణ వంటివి సరైన పద్ధతిలో చేస్తే ప్రజలకు ఉపయోగకరమే. ప్రభుత్వ ఖజానాకు కూడా మంచిది. రాజకీయంగా విమర్శలు వచ్చినప్పటికీ అర్హులకే అసలైన లబ్ధి చేకూరాలనే విషయంలో కఠినంగా ఉండటమే మేలు.
మద్యం పై నిఘా….
ఇసుక పాలసీలో మార్పులు, మద్యనియంత్రణ చర్యలు , రాజధానులు ఈ మూడు అంశాల్లో వైసీపీ సర్కారు కుదుపునకు గురవుతోంది. ఇసుక పై కొత్త విధానం అమల్లోకి తెచ్చినప్పటికీ ఇంకా కొరత వెన్నాడుతున్నట్లు క్షేత్రస్థాయిలో వైసీపీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. ముఖ్యంగా భవన నిర్మాణ రంగం ఇంకా పుంజుకోలేదు. లక్షలాదిమంది జీవనోపాధిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా దీని ప్రభావం పడుతోంది. మద్యం విక్రయాల సమయాలు క్రమబద్ధీకరించడం, రేట్లు పెంచడం సరైన చర్యగానే తొలుత భావించారు. అయితే బార్లలో, షాపుల్లో విక్రయించే మద్యం రేట్లు వేర్వేరుగా ఉండటంతో కొన్ని చోట్ల షాపుల మద్యం బార్లకు తరలిపోతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడక్కడా బెల్టు షాపులకు కూడా ఆస్కారం ఏర్పడుతోందని చెబుతున్నారు. పైపెచ్చు గిరిజన ప్రాంతాల్లో నాటుసారా మళ్లీ విజృంభించేందుకు అవకాశాలు కలుగుతున్నాయంటున్నారు. వీటిని ప్రభుత్వం వెంటనే పరిశీలించి నిఘా పెంచాలి. మద్యం సొమ్ము రుచి మరిగితే అక్రమార్కులు చెలరేగిపోవడమే కాదు, ప్రభుత్వానికే సవాల్ విసురుతారు. ఇది ప్రభుత్వంతోపాటు పార్టీలు కూడా గమనించాల్సిన అంశం. ఎందుకంటే గ్రామగ్రామాన విస్తరించిన కార్యకర్తలు పార్టీలకు ఉంటారు. రాజకీయ పార్టీలు విధానపరమైన అంశాల్లో లోపాలను పట్టుకుంటే ప్రజలకు ప్రయోజనం సమకూరుతుంది. ప్రతిపక్షంగా టీడీపీ ప్రజల్లోకి వెళ్లడం తప్పుకాదు. అది రాజకీయ అవసరమే కాదు, అధ్యయనానికి కూడా తోడ్పడుతుంది. అయితే పూర్తిగా రాజకీయాలకే పరిమితం కాకుండా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసేందుకు, ప్రజల్లో నిజమైన చైతన్యం రగిలేందుకు తమ పర్యటనలు, ప్రచారాన్ని వినియోగించుకుంటే సహజంగానే పార్టీకి కూడా మేలు చేకూరుతుంది.
-ఎడిటోరియల్ డెస్క్