లాక్ డౌన్ .. ప్రభుత్వాలకు కాదు…?
కరోనా కట్టడికి తీవ్రంగా కృషి చేస్తున్న తెలుగు రాష్ట్రాలు కొన్ని వ్యవస్థాపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వాలు ఇచ్చే ఆదేశాలు దిగువస్థాయికి చేరడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. మొత్తం వ్యవస్థ [more]
కరోనా కట్టడికి తీవ్రంగా కృషి చేస్తున్న తెలుగు రాష్ట్రాలు కొన్ని వ్యవస్థాపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వాలు ఇచ్చే ఆదేశాలు దిగువస్థాయికి చేరడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. మొత్తం వ్యవస్థ [more]
కరోనా కట్టడికి తీవ్రంగా కృషి చేస్తున్న తెలుగు రాష్ట్రాలు కొన్ని వ్యవస్థాపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వాలు ఇచ్చే ఆదేశాలు దిగువస్థాయికి చేరడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. మొత్తం వ్యవస్థ పోలీసు యంత్రాంగం మీదనే ఆధారపడుతున్నట్లు కనిపిస్తోంది. ఒక శాఖ మీదనే ఒత్తిడి మొత్తం పెట్టి మిగిలిన ప్రభుత్వ సిబ్బంది, విభాగాలు నిద్రాణమైపోతున్నాయి. ఇటువంటి క్లిష్ట సమయంలో చాలా డిపార్టుమెంట్లు నిర్లిప్తంగా ఉండటం ప్రభుత్వాలకు చెడ్డపేరు తెచ్చిపెడుతుంది. ప్రజలు బయటకు రాకుండా ఉండాలంటే వారి కనీస అవసరాలు తీర్చాలి. నిర్దిష్ట వేళల్లో బయటకు అనుమతిస్తామని చెప్పడంతో ఆ సమయాల్లో జాతరలా ప్రజలు బయటికి వచ్చేస్తున్నారు. లాక్ డౌన్ మౌలిక లక్ష్యం దెబ్బతింటోంది. దీనివల్ల కరోనా వ్యాప్తి తీవ్రత ఎక్కువయ్యే ప్రమాదం పెరుగుతోంది. లాక్ డౌన్ ప్రజలకు మాత్రమే ప్రకటించి, ప్రభుత్వ సిబ్బందికి రక్షణ ఏర్పాట్లు కలిపించి వారి సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకుని ఉంటే బాగుండేది.ఇప్పుడు ప్రజలతో పాటు ప్రభుత్వోద్యోగులు సైతం అన్నిరకాల సేవలకు, వస్తువులకు ఎగబడి తోపులాటకు దిగాల్సిన స్థితి ఉత్పన్నమవుతోంది.
అంతంతమాత్రమే…
లాక్ డౌన్ వంటి సందర్భాల్లో నిత్యావసరాలే ప్రధాన సమస్య. ఇది అందరికీ తెలిసిన అంశమే. వరదలు, ప్రకృతి విపత్తులు సంభవించిన సందర్బాల్లో ప్రజలు కొంతమేరకు వేరేప్రాంతాలకు కదలి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఇల్లు కదలకూడదు. దీనికి స్వయంక్రమశిక్షణ చాలా అవసరం. దాంతోపాటు తమకేం కాదనే ఒక భరోసా కావాలి. ఆహారం అనేది కనీస ప్రాథమిక అవసరం. సంపాదనకు బంద్ పెట్టినా, మిగిలిన వసతులను తాత్కాలికంగా పక్కన పెట్టినా ఫర్వాలేదు. తిండి విషయంలో మాత్రం ప్రజలు తమకేమీ ఇబ్బంది లేదని భావించినప్పుడే కొంత స్థిమితంగా ఉండగలుగుతారు. ఆ ధీమా కల్పించలేకపోతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలంతా రోడ్డెక్కి రేపు ఏమయిపోతుందోననే అనుమానంతో ఇబ్బడిముబ్బడిగా సరుకులు కొంటున్నారు. సరఫరా తక్కువ ఉండే వస్తువుల అమ్మకాలు మరింతగా పెరిగిపోతున్నాయి. అవసరానికి మించి కొనుగోళ్లు చేస్తున్నారు. ప్రజల్లో లోపించిన క్రమశిక్షణ కారణంగా నిత్యావసరాల్లో కొన్ని వస్తువులు అందుబాటులో లేకుండా పోతున్నాయి.
వాలంటీర్ వర్క్…
లాక్ డౌన్ వంటి విపత్కర పరిస్థితుల్లో సమర్థంగా వినియోగించుకోవాల్సిన వ్యవస్థ వాలంటీర్లదే. ఏ కుటుంబంలో ఎంతమంది నివసిస్తున్నారనే లెక్కలు మొదలు వారి ఆర్థిక, ఆరోగ్య పరిస్థితి వరకూ సమాచారం వాలంటీర్ల వద్ద సిద్ధం గా ఉంది. ఇంటింటికీ నిత్యావసరాలు అందేలా చూసే బాధ్యతను వాలంటీర్లకు అప్పగించవచ్చు. ఒకవేళ అది కష్టసాధ్యమని భావిస్తే కరోనా కార్డుల వంటివి పంపిణీ చేస్తే కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి తగు మొత్తంలోనే అమ్మకాలు జరిపేలా మార్కెట్లను నియంత్రించవచ్చు. తద్వారా కృత్రిమ కొరతను నిరోధించవచ్చు. అందరికీ అన్నీ సమకూరతాయి. కొరతను సైతం అందరూ కలిపి పంచుకోగలుగుతారు. ప్రజలను కొన్ని గంటలపాటు ఇళ్లకే పరిమితం చేయడం మరికొన్ని గంటలపాటు విచ్చలవిడిగా వదిలేయడమనే ఆనవాయితీ ప్రజారోగ్యానికి ప్రమాదంగా మారింది. ప్రభుత్వం దీనిపై ద్రుష్టి పెట్టాలి. లేకపోతే ప్రజలు సమూహాలుగా మార్కెట్లపై పడి కొనుగోళ్లు చేస్తూనే ఉంటారు. దీంతో మంచి ఉద్దేశం మంటగలిసిపోతుంది.
కేంద్రం సీరియస్…
ఏడెనిమిది లక్షల కోట్ల రూపాయల వరకూ ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లినా భరించేందుకు సిద్దమై కేంద్రం భారత స్తంభనకు నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ సహా కొన్ని చోట్ల కనిపిస్తున్న ఉదాసీనత కేంద్రాన్ని ఇరకాటంలోకి నెట్టివేసింది. ముఖ్యంగా వలస కూలీలు ఎక్కడి కక్కడ వేలల్లో రోడ్లపైకి వచ్చేస్తున్నారు. వారి గురించి ముందస్తుగా సమగ్ర ప్రణాళిక లేకుండానే లాక్ డౌన్ ప్రకటించారు. ఇప్పుడదే పెను ఉపద్రవంగా మారబోతోంది. అందుకే రాష్ట్రాలకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర సరిహద్దులతోపాటు, జిల్లాల సరిహద్దులను సైతం మూసివేయాలని సూచించింది. రోజువారీ కూలీలు, వలస కార్మికులకు వసతి, భోజన సదుపాయాలను ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని నిర్దేశించింది. స్థానిక ప్రభుత్వాలు నిత్యావసరాలపై ప్రత్యేక కార్యాచరణకు ఇప్పటికైనా పూనుకోవాలి. దాంతో పాటు మొబైల్ వైద్య కేంద్రాలను ఏర్పాటు చేసి నగరాల్లో పర్యటించేలా చూడాలి. అప్పుడే రోగులను గుర్తించడం వీలవుతుంది. ప్రభుత్వంలోని వివిధ విభాగాలు పరస్పర సమన్వయంతో ఇందుకు సహకరించుకోవాలి. ప్రజలతోపాటు ప్రభుత్వ సిబ్బంది సైతం నిద్రాణంలోకి వెళ్లిపోతే మొదటికే మోసం వస్తుంది. నిఘా కరవు అవుతుంది. లోపాలను గమనించి పట్టుకునేవాళ్లు ఉండరు. అందువల్ల లాక్ డౌన్ ప్రజలకే తప్ప..ప్రభుత్వానికి కాదన్న విషయం గుర్తించాలి.
-ఎడిటోరియల్ డెస్క్