వైసీపీ కంచుకోటలో టీడీపీ పుంజుకుందా..?
కడప జిల్లాలోని రైల్వే కోడురు నియోజకవర్గం ప్రకృతి ప్రసాద ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ భూగర్భ ఖనిజాలకు కొదవలేదు. ఇక ఉద్యాన పంటలకు పెట్టింది పేరు. అభివృద్ధికి అవకాశం [more]
కడప జిల్లాలోని రైల్వే కోడురు నియోజకవర్గం ప్రకృతి ప్రసాద ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ భూగర్భ ఖనిజాలకు కొదవలేదు. ఇక ఉద్యాన పంటలకు పెట్టింది పేరు. అభివృద్ధికి అవకాశం [more]
కడప జిల్లాలోని రైల్వే కోడురు నియోజకవర్గం ప్రకృతి ప్రసాద ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ భూగర్భ ఖనిజాలకు కొదవలేదు. ఇక ఉద్యాన పంటలకు పెట్టింది పేరు. అభివృద్ధికి అవకాశం ఉన్న మంచి ప్రాంతం. అయితే ఏళ్లుగా వెనకబాటే వేధిస్తోంది. గ్రామాల మాట పక్కన పెడితే నియోజకవర్గ కేంద్రంలోనే అనేక సమస్యలు సవాళ్లు విసురుతున్నాయి. అనేక ప్రాంతాల్లో తాగునీరు సమస్య తాండవిస్తోంది. రోడ్లు లేవు. చినుకు పడితే చిత్తడే అన్నట్లుగా రోడ్లు బావురుమంటున్నాయి. నియోజకవర్గం ఏర్పడి దశాబ్దాలు దాటిన అభివృద్ధి జాడ మాత్రం ఈ నియోజకవర్గంలో ఏమాత్రం కానరావడం లేదన్నది ఈ ప్రాంత ప్రజల ఆవేదన..
ఐదుసార్లు గెలిచిన టీడీపీ
ఇక రాజకీయాల విషయానికి వస్తే ఈ నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా వర్ధిల్లింది. కడప జిల్లాలోనే టీడీపీకి మంచి పట్టు ఉన్న ప్రాంతం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అంటే 1983 నుంచి 1999 వరకు వరుసగా ఆ పార్టీ ఈ స్థానం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యే సీటును గెలుచుకుంది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఈ నియోజవర్గంపై దృష్టి పెట్టడంతో 2004లో కాంగ్రెస్ ఈ సీటు గెలుచుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పసుపు జెండా ఎగరలేదు. గత వైభవాన్ని పునరుద్దరించాలని టీడీపీ నేతలు యత్నిస్తున్నా..సఫలికృతం కావడం లేదు. అయితే 2014 ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో టీడీపీ అభ్యర్థి వెంకటసుబ్బయ్య వైసీపీ అభ్యర్థి కొరుముట్ల శ్రీనివాసులు చేతిలో ఓడిపోయారు. వాస్తవానికి గత ఎన్నికల్లో ఈ స్థానం గెలుస్తదన్న ధీమా టీడీపీకి పుష్కలంగా ఉంది. కాని చివరికి బెడిసికొట్టింది.
టిక్కెట్ మళ్లీ ఆయనకే…
అయితే ఈసారి ఎలాగైనా టీడీపీ పాతుకుపోవాలని గట్టి పట్టుదలతో ఉంది. అందుకోసం చంద్రబాబు కూడా ఈ నియోజకవర్గంపై దృష్టి సారించినట్లు సమాచారం. దీనికితోడు వైసీపీ నుంచి గెలిచిన కొరుముట్ల శ్రీనివాసులు ప్రతిపక్షంలో ఉన్నందున పెద్దగా అభివృద్ధి చేయలేకపోయారు. అధికారంలో ఉన్న టీడీపీ తన నియోజకవర్గానికి కనీస నిధులు ఇవ్వలేదని ఆయన చెబుతున్నారు. జగన్‌కు విశ్వాసపాత్రుడిగా ముద్రపడిన ఆయనకే ఈసారి కూడా వైసీపీ నుంచి టికెట్ లభించనుంది.
టిక్కెట్ విషయంలో బేదాభిప్రాయాలు
ఇక టీడీపీ విషయానికి వస్తే నియోజకవర్గం ఇన్చార్జిగా కొనసాగుతున్న విశ్వనాథనాయుడికి, మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు మధ్య అభ్యర్థి విషయంలో బేధాభిప్రాయాలున్నాయి. విశ్వనాథనాయుడు చిత్తూరు ఎంపీ శివప్రసాద్ మేనల్లుడు నరసింహ ప్రసాద్‌కు టికెట్ దక్కేలా పావులు కదుపుతున్నట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు మాత్రం మాజీ ఎమ్మెల్యే కోడలు అన్నపూర్ణమ్మకు టికెట్ ఇప్పించుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఇద్దరూ చెరో దారిలో ఉన్నారు. అయితే ఇద్దరు సమన్వయంతో వ్యవహరిస్తే మాత్రం టీడీపీకి విజయావకాశాలు మెండుగా ఉంటాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో వైసీపీ గట్టెక్కగా ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని టీడీపీ గట్టి పట్టుదలతో ఉంది.
జనసేన సైతం…
ఇక కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని తన ఖాతాలో వేసుకోవాలని జనసేన కూడా ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే ఆ పార్టీ నుంచి పలువురు కాపు సామాజిక వర్గ నేతలు టికెట్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. అయితే అభ్యర్థి ఖరారుతోనే ఈ పార్టీ విజయవకాశాలు ఉంటాయన్నది మాత్రం నిర్వివాదాంశమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.