ఎంపీల్లో ఎందుకీ నైరాశ్యం…?
ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీకి కొత్త సమస్య వచ్చి పడింది. టీడీపీ పార్లమెంటు సభ్యుల్లో సగం మంది ఈసారి పార్లమెంటుకు పోటీ చేయమని, ఎమ్మెల్యేగా బరిలో ఉంటామని [more]
ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీకి కొత్త సమస్య వచ్చి పడింది. టీడీపీ పార్లమెంటు సభ్యుల్లో సగం మంది ఈసారి పార్లమెంటుకు పోటీ చేయమని, ఎమ్మెల్యేగా బరిలో ఉంటామని [more]
ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీకి కొత్త సమస్య వచ్చి పడింది. టీడీపీ పార్లమెంటు సభ్యుల్లో సగం మంది ఈసారి పార్లమెంటుకు పోటీ చేయమని, ఎమ్మెల్యేగా బరిలో ఉంటామని చెబుతున్నారు. రోజుకొకరు ఇదే కోరికను అధినేత ముందు పెడుతుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తలపోటులా ఈ వ్యవహారం మారింది. అసెంబ్లీ టిక్కెట్ల కోసం పలువురు ఎంపీలు పార్టీ మారేందుకు కూడా సిద్ధమవుతుండటంతో టీడీపీ ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే ఇద్దరు ఎంపీలు పార్టీ మారగా.. మరికొందరు కూడా అసెంబ్లీ టిక్కెట్లు కావాలని అధినేతకు అర్జీలు పెట్టుకుంటున్నారు. అయితే, తాత్కాలికంగా చూద్దాం అని చెబుతూ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. కానీ, ఎంపీలకు అసెంబ్లీ టిక్కెట్లు ఇవ్వడం చాలావరకు కుదరని పని. ఎంపీలు అడుగుతున్న సీట్లలో చాలా సీట్లలో ఇప్పటికే టీడీపీకి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఇప్పుడే ఏదీ తేల్చకుండా వాయిదా వేస్తున్నారు ముఖ్యమంత్రి.
అధినేత వద్దకు డిమాండ్లు…
టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా గెలిచిన అవంతి శ్రీనివాసరావు గత ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నారు. కుదరక ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఈసారి ఆయన భీమిలి అసెంబ్లీ టిక్కెట్ ఆశించారు. ఇప్పటికే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావు ఉన్నారు. ఇక అమలాపురం ఎంపీ రవీంద్రబాబు కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో ఏదైనా ఒక అసెంబ్లీ స్థానం నుంచి బరిలో ఉండాలనుకుంటున్నారు. వీరిద్దరికీ అధినేత నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇక, తాజాగా ఎంపీ తోట నరసింహం కూడా తాను పోటీకి దూరంగా ఉంటానని, తన బదులు తన భార్యకు జగ్గంపేట అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వాలని అధినేతను కోరారు. ఇప్పటికే ఆ సీటులో ఫిరాయింపు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సిట్టింగ్ గా ఉన్నారు. హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహననాయుడు, కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, విజయనగరం ఎంపీ అశోకగజపతి రాజు తదితరులు కూడా ఈసారి అసెంబ్లీ బరిలోనే ఉండాలనుకుంటున్నారు. ఇక, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి అయితే ఎంపీ పదవిపై విరక్తి వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. ఆయన కార్పొరేటర్ గా పోటీ చేస్తానని ప్రకటించారు.
ఎంపీగా సాధించేదేంటి..?
టీడీపీ ఎంపీలు ఎమ్మెల్యేలుగా బరిలో దిగేందుకు మొగ్గు చూపడం వెనుక ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయంటున్నారు. ఇందులో ప్రధానమైనది రాష్ట్ర మంత్రి పదవి. ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి దక్కించుకోవచ్చని చాలా మంది సిట్టింగ్ ఎంపీలు ప్లాన్ చేస్తున్నారు. ఇక, ఎంపీగా పనిచేసినా పెద్దగా సాధించేది ఏమీ లేకపోగా అనవసర శ్రమ అనుకుంటున్నట్లు కనిపిస్తున్నారు చాలా మంది ఎంపీలు. ఎంపీలుగా ఉంటే స్థానికంగా బలమైన నేతలుగా ఎదగలేకపోవడం, అభివృద్ధి పనులూ పెద్దగా సాధించుకోలేకపోవడం వల్ల పార్లమెంటుకు పోటీ చేసేందుకు ఆసక్తి చూపించడం లేదట. ఇక, బీజేపీతో తెగదెంపుల తర్వాత టీడీపీ ఎంపీలు పూర్తిగా నిరసనలకే పరిమితమయ్యారు. ప్లకార్డులు, నినాదాలతో నిరసన తెలపడం కంటే సాధించింది ఏమీ లేదు. ఒకవేళ మళ్లీ నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని పలువురు టీడీపీ ఎంపీలు భావిస్తున్నారు. ఈ బాధలు అన్నింటి కన్నా ఎమ్మెల్యేగా పోటీ చేయడమే మేలనుకుంటున్నారు. మరి, అధినేత చంద్రబాబు.. ఎంపీల్లో ఎంతమందికి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇస్తారో చూడాలి.