జనసేనతో పొత్తు అసలుకే ఎసరు తెస్తుందా?
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ ఉనికికోసం పాట్లు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2019 ఎన్నికల సమయంలో తీవ్రంగా దెబ్బతిన్న పార్టీని గాడిలో పెట్టేందుకు చంద్రబాబు [more]
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ ఉనికికోసం పాట్లు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2019 ఎన్నికల సమయంలో తీవ్రంగా దెబ్బతిన్న పార్టీని గాడిలో పెట్టేందుకు చంద్రబాబు [more]
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ ఉనికికోసం పాట్లు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2019 ఎన్నికల సమయంలో తీవ్రంగా దెబ్బతిన్న పార్టీని గాడిలో పెట్టేందుకు చంద్రబాబు ప్రయాసపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో పట్టు సాధించాలని అనుకున్నారు. అయితే.. అది సాధ్యం కాలేదు. ఈ క్రమంలోనే సరికొత్త ఫార్ములా ఒకటి తెరమీదికి వచ్చింది. బీజేపీతో జట్టుకట్టి.. రంగంలోకి దిగిన జనసేనకు బీజేపీ వల్ల ఎలాంటి ఫలితం దక్కలేదు. అయితే.. జనసేన ఒంటరిగా బరిలో నిలిచిన చోట గెలుపు గుర్రం ఎక్కినా ఎక్కకపోయినా.. ఓట్లు మాత్రం బాగానే రాబట్టింది.
ఒంటరిగా పోటీ చేసిన చోట….
ఈ క్రమంలో టీడీపీ ఒంటరిగా పోటీ చేసిన చోట ఆ పార్టీ కూడా బాగానే ఓట్లు సాధించింది అంటే.. ప్రభుత్వ ఓట్లు.. ఇక్కడ చీలిపోయాయనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఇక, ఈ క్రమంలోనే టీడీపీ సీనియర్లు.. ఒక సరికొత్త వాదనను తెరమీదికి తెస్తున్నారు. జనసేనతో కలిసి ముందుకు సాగితే.. టీడీపీ ఉనికి నిలబడుతుందనేది వారి వాదన. అదే సమయంలో జనసేనకు కీలకమైన నియోజక వర్గాలు వదిలి పెట్టాలని కూడా వీరు సూచిస్తుండడం గమనార్హం. అలా అయితేనే జనసేన కూడా పార్టీతో మనస్ఫూర్తిగా కలిసి వస్తుందని టీడీపీలో కొందరు కాపు నేతలు, సీనియర్లు చంద్రబాబుకు సూచించినట్టు తెలిసింది.
పార్టీ దెబ్బతింటుందా?
అయితే ఈ పరిణామంతో పార్టీ దెబ్బతింటుందనే జంకు కూడా కొందరిలో కనిపిస్తోంది. దీనిపై జనసేనకు చెందిన కొందరు నేతలతో టీడీపీ నేతలు ప్రాథమికంగా చర్చిస్తున్నారు కూడా..! వచ్చే ఎన్నికల్లో వైసీపీని అధికారం నుంచి గద్దె దింపాలంటే ఖచ్చితంగా మన రెండు పార్టీలు పొత్తులతోనే ముందుకు సాగాలని విజయవాడకు చెందిన జనసేన కీలక నేత టీడీపీ ముఖ్య నేతలతో జరిగిన చర్చల్లో అన్నారు. ఈ క్రమంలోనే ఆయన విజయవాడలో తూర్పు సీటు తమకు ఇస్తే బాగుంటుందని కూడా చెప్పారట. అయితే ఇది జరిగే పనికాదు… విజయవాడ తూర్పు నియోజకవర్గంలో టీడీపీకి బలం ఉంది. కానీ.. ఇప్పుడు ఇలాంటి చోట జనసేన పోటీ చేయాలని కోరుతోంది.
కొన్ని స్థానాల్లో……
పైగా అక్కడ టీడీపీకి సీనియర్ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఉన్నారు. రేపు కనుక టీడీపీ.. జనసేనతో పొత్తు పెట్టుకుంటే.. ఇలాంటి సీట్లను జనసేనకు వదిలేయాలి. టీడీపీకి బలమున్న సీట్లనే రెండు పార్టీలో కోరితే ఆ పొత్తు ఎంత వరకు కలిసొస్తుందో ? చెప్పలేం. జనసేన ఎక్కడ కోరుకుంటే.. అక్కడ టికెట్లు కేటాయించాలి. కనీసం 30-50 స్థానాల్లో జనసేన కోరితే.. ఖచ్చితంగా ఇవ్వగలగాలి. అవికూడా టీడీపీకి పట్టున్న చోట కోరినా కాదనే పరిస్థితి ఉండదు.
ఇలాంటి ఫార్ములా….
ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇలాంటి ఫార్ములా అవలంబిస్తే.. టీడీపీకి ఆయువు పట్టు వంటి నియోజకవర్గాల్లో జనసేన బలపడడం ఖాయంగా కనిపిస్తుండగా.. టీడీపీ మాత్రం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అప్పుడు మరి కొంత మంది పార్టీ నేతలు కూడా పార్టీని వీడే అవకాశం ఉంది. ఇది పార్టీకి ఎలా మేలు చేస్తుందో పార్టీ మేధావులు సెలవివ్వాల్సిన అవసరం ఉంది. కానీ, వారు మాత్రం టీడీపీ నెగ్గాలంటే.. ఖచ్చితంగా జనసేనతో ముందుకు సాగి.. దానిని మచ్చిక చేసుకోవాలనే ప్రతిపాదనను తెరమీదికి తెస్తున్నారు. మరి దీనిని చంద్రబాబు పాటిస్తారో లేదో చూడాలి.