వారసులు టోటల్ గా విఫలం.. రీజనేంటి..?
రాజకీయాల్లో వారసులకు కొదవలేదు. పైగా ఏపీలో ఈ సంఖ్య భారీగానే ఉంది. ఎక్కడికక్కడ నాయకులు తమ వారసులను రంగంలోకి దింపారు. గత ఎన్నికల్లో అయితే టీడీపీ నుంచి [more]
రాజకీయాల్లో వారసులకు కొదవలేదు. పైగా ఏపీలో ఈ సంఖ్య భారీగానే ఉంది. ఎక్కడికక్కడ నాయకులు తమ వారసులను రంగంలోకి దింపారు. గత ఎన్నికల్లో అయితే టీడీపీ నుంచి [more]
రాజకీయాల్లో వారసులకు కొదవలేదు. పైగా ఏపీలో ఈ సంఖ్య భారీగానే ఉంది. ఎక్కడికక్కడ నాయకులు తమ వారసులను రంగంలోకి దింపారు. గత ఎన్నికల్లో అయితే టీడీపీ నుంచి చాలా మంది వారసులు బరిలోకి దిగారు. వీరిలో గెలిచినవారిని లెక్కిస్తే.. ఒక్క ఆదిరెడ్డి భవాని.. టీడీపీ నుంచి విజయం సాధిస్తే.. మిగిలిన వారెవరూ కనిపించడం లేదు. దీంతో అసలు వారసుల ఫ్యూచర్ ఏంటి ? అనే చర్చ తెరమీదికి వస్తోంది. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు సీనియర్ నేతల వారసులు సైకిల్ పరుగులు పెట్టిస్తారని అనుకున్నారు చంద్రబాబు. కానీ, అనూహ్యంగా వీరంతా కూడా చతికిల పడ్డారు.
ముందు వరసలో…….
ప్రధానంగా ఈ వరసలో పరిటాల శ్రీరాం ముందుంటారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయనపై చాలానే ఆశలు ఉన్నాయి. పరిటాల ఫ్యామిలీ అసలు సిసలు రాజకీయ వారసుడు అని భారీ అంచనాలు ఉన్నా ఆయన ఓడిపోయారు. పోనీ..గెలుపు ఓటములు సహజమే అని సరిపెట్టుకున్నా.. తర్వాత కూడా ఆయన పుంజుకున్నది ఎక్కడా కనిపించలేదు. ఇక, కర్నూలు జిల్లా కర్నూలు నియోజకవర్గం నుంచి టీజీ భరత్ పోటీ చేశారు. టీజీ వెంకటేష్ కుమారుడిగా రంగంలోకి దిగిన ఆయన కూడా ఓడిపోయారు. ప్రస్తుతం కర్నూలు సిటీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నా.. ఆయన పుంజుకునే పరస్థితి ఎక్కడా కనిపించడం లేదు.
సింపతీని కూడా…..
చిత్తూరు జిల్లాలో గాలి ముద్దుకృష్ణమ నాయుడు కుమారుడు గాలి భాను ప్రకాశ్ నాయుడు కూడా ఇదే తరహాలో ఉన్నారు. తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన తండ్రి మరణంతో వచ్చిన సింపతీని సైతం తాను రాబట్టుకోలేక పోయారు. కుటుంబ కలహాల కారణంగా భాను రాజకీయంగా ఇబ్బందులు పడుతున్నారన్నది వాస్తవం. అనంతపురం జిల్లాకు చెందిన జేసీ బ్రదర్స్ కుమారులు.. పవన్, అస్మిత్ ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. బయటకు వస్తే.. వివాదం.. లేకపోతే.. సైలెంట్ అనే పరిస్థితే వీరిలో కనిపిస్తోంది. ప్రజల్లోకి వెళ్లలేక పోతున్నారు. కేసుల భయం వెంటాడుతోంది. కర్నూలు జిల్లాలో భూమా అఖిల ప్రియ మంత్రిగా పని చేసినా టీడీపీ క్యాడర్ పై పట్టును సాధించలేకపోయారనేది వాస్తవం. రాజకీయ అనుభవ లేమి, అటు భర్త భార్గవ్ దూకుడు ఆమెకు మైనస్ అయ్యింది.
అంతటా నైరాశ్యం…..
ఇక, కర్నూలుజిల్లా పత్తికొండ కు చెందిన కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాంబాబు సైతం ఎదురీత ధోరణిలోనే ఉన్నారు. ఆయనపై హత్య కేసు నమోదవడం.. నియోజకవర్గంలో వైసీపీ గెలుపు గుర్రం ఎక్కడంతో రాజకీయంగా తీవ్ర గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నియోజకవర్గంలో గౌతు శిరీష గత ఏడాది ఎన్నికలకు ముందు హడావుడి చేసినా.. సొంత నియోజకవర్గంపై పట్టు సాధించలేకపోయారు. ఇటీవల టీడీపీ పదవుల్లోనూ బాబు ఆమెకు ప్రయార్టీ ఇవ్వకపోవడంతో ఆమె గుస్సాగా ఉన్నారు.
ఓటమి పాలయి…
విజయనగరం జిల్లాకు చెందిన అశోక గజపతి రాజు కుమార్తె అదితి గజపతిరాజు కూడా కేడర్‌తో మమేకం కాలేకపోతున్నారు. నియోజకవర్గంలో మాత్రం ఆమె చురుకుగా ఉండడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. మాజీ మంత్రి కిమిడి మృణాళిని కుమారుడు నాగార్జునకు ఇటీవల టీడీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా పగ్గాలు అప్పగించారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత.. ఆయనకు మంచి పదవే దక్కినా.. ఫ్యూచర్ మాత్రం ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఇక, విశాఖ జిల్లాలో సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ ఎక్కడున్నారో కూడా చెప్పలేని పరిస్థితి. అసలు ఎన్నికల్లో పోటీ చేయకుండానే విజయ్ తీరుపై సొంత కుటుంబ సభ్యులే విబేధిస్తోన్న పరిస్థితి.
మరో మూడున్నరేళ్లలో…..
అదే సమయంలో గుంటూరుకుచెందిన రాయపాటి సాంబశివరావుకుమారుడు రంగారావు, కోడెల శివప్రసాద్ కుమారుడు శివరామకృష్ణలు కూడా ఎదురీదుతున్నారు. టీడీపీలో పట్టు సాధించే క్రమంలో వీరికి ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి. ఏదేమైనా.. టీడీపీలో వారసుల భవితవ్యం దారుణంగా ఉందనేది వాస్తవం. మరో మూడున్నరేళ్లలో రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నదరిమిలా వారు ఎలా పుంజుకుంటారో ? లేదో ? వీరిలో ఎంతమంది ప్రజాక్షేత్రంలో మంచి మార్కులు వేయించుకుంటారో ? చూడాలి.