పుంజుకునేదెలా…?
గుంటూరు జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం బాపట్ల. టీడీపీ ఆవిర్భావం తర్వాత కేవలం మూడు సార్లు మాత్రమే ఇక్కడ విజయం సాధించింది. 1985, 1994, 1999 ఎన్నికల్లో గెలుపు [more]
గుంటూరు జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం బాపట్ల. టీడీపీ ఆవిర్భావం తర్వాత కేవలం మూడు సార్లు మాత్రమే ఇక్కడ విజయం సాధించింది. 1985, 1994, 1999 ఎన్నికల్లో గెలుపు [more]
గుంటూరు జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం బాపట్ల. టీడీపీ ఆవిర్భావం తర్వాత కేవలం మూడు సార్లు మాత్రమే ఇక్కడ విజయం సాధించింది. 1985, 1994, 1999 ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కిన టీడీపీ తర్వాత వరుస ఓటములు చవిచూస్తోంది. గడిచిన రెండు ఎన్నికల్లోనూ మరింత పట్టు కోల్పోయింది. వైఎస్ హవా ఎక్కువగా ఉన్న సమయంలో ఇక్కడ కాంగ్రెస్ భారీగా పుంజుకుంది. ఇక, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున వెంకటరెడ్డి విజయం సాధించగా.. తర్వాత రాష్ట్ర విభజన ఎఫెక్ట్, జగన్ ప్రభావంతో ఇక్కడ వరుసగా వైసీపీ విజయం సాధించింది. వైసీపీ తరపున కోన రఘుపతి వరుసగా గెలుపు గుర్రం ఎక్కారు. తాజా ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించి, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవిని కైవసం చేసుకున్నారు.
నాలుగు సార్లు నుంచి…..
కాగా, టీడీపీ పరిస్థితి ఏంటి? అనే విషయం ఆసక్తిగా మారింది. అసలు నాలుగు సార్లు ఇక్కడ టీడీపీ జెండాయే ఎగరడం లేదు. దీంతో పార్టీ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. అన్నం వెంకట సతీష్ ఇక్కడ పార్టీకి అండగా ఉండేవారు. 2014లో టీడీపీ టికెట్ దక్కించుకున్నప్పటికీ.. ఆయన పరాజయం పాలయ్యారు. పార్టీ అధికారంలోకి రావడంతో అన్నంకు చంద్రబాబు ఎమ్మెల్సీ పోస్టు ఇచ్చారు. జిల్లా టీడీపీలో కాపు సామాజికవర్గ పరంగా యాక్టివ్‌గా ఉండడంతో అన్నంకు లక్ కలిసి వచ్చింది.
నిత్యం ప్రజల్లోనే…..
ఆ తర్వాత కాలంలో ఇక్కడ మరో నేత పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. వేగేశ్న ఫౌండేషన్ పేరుతో ప్రజల కు చేరువయ్యారు. టీడీపీ కార్యక్రమాలతో పాటు తన సొంత అజెండాతో ప్రజల సమస్యలపై దృష్టి పెట్టారు. ప్రభుత్వ పథకాలను ప్రజ కి తీసుకు వెళ్లారు. ఇంటింటికి టీడీపీ, పాదయాత్రల పేరుతో నిత్యం ప్రజల్లోనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో తనకు టికెట్ ఇచ్చేలా అధిష్టానంపై అన్ని రూపాల్లోనూ ఒత్తిడి తెచ్చారు. అయితే, పార్టీలోని ఓ కీలక నాయకుడి ప్రభావంతో అన్నం సతీషే ఈ దఫా కూడా టికెట్ తెచ్చుకున్నారు. జిల్లాలో కాపులకు ఒక సీటు ఇవ్వాలన్న సమీకరణల నేపథ్యంలో మరోసారి సతీష్‌కే సీటు దక్కింది.
ఆయన కూడా దూరమయి….
దీంతో వేగేశ్న నరేంద్రవర్మ టీడీపీలో ఉంటూనే కార్యక్రమాలకు దూరమయ్యారు. ఈ ప్రభావం భారీగానే పార్టీపై పడింది. అయితే పార్టీ రెండో సారి అధికారంలోకి వస్తే.. మీకు ప్రాధాన్యం ఇస్తామని నరేంద్ర వర్మకు బాబు హామీ ఇచ్చారని అంటున్నారు. కానీ, రెండో సారి పార్టీ అధికారంలోకి రాకపోగా.. బాపట్లలో టికెట్ సంపాయించుకున్న అన్నం సతీష్ ఘోరంగా ఓడిపోయారు. అదే సమయంలో పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ వీడిన సతీష్ చంద్రబాబు, లోకేష్‌పై తీవ్ర విమర్శలు కూడా చేశారు.
తనను గుర్తించలేదని…?
దీంతో ఇప్పుడు బాపట్లలో పార్టీకి అండదండ ఎవరూ లేకుండా పోయారు. పోనీ వేగేశ్న నరేంద్ర వర్మ.. పార్టీ కార్యక్రమాలు చూద్దామని అనుకున్నా.. తనకు టికెట్ ఇవ్వలేదని, తాను కష్టపడి పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకు వెళ్లినా గుర్తించలేదని ఆయన ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో బాపట్లలో ఇప్పుడు టీడీపీ దిక్కులేకుండా పోయింది. ఇటీవల కాలంలో చంద్రబాబు ఆందోళనలకు పిలుపు ఇస్తున్నా.. ఇక్కడ ఎవరూ పట్టించుకోవడం లేదు. నరేంద్రవర్మ అడపాదడపా పార్టీ తరపున పిలుపు ఇస్తోన్న ఆందోళనలు నిర్వహిస్తున్నా ఇంత కష్టపడినా మరోసారి తనకు నిరాశ తప్పదన్న సందేహాలు కూడా ఆయన్ను వెంటాడుతున్నాయి. దీంతో బాపట్లలో ఎవరినో ఒకరిని పార్టీ ఇంచార్జ్‌గా నియమించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.