ఇక్కడ సైకిల్ ను మూలన పడేయాల్సిందేనా? రిపేర్ చేసినా?
గత ఏడాది ఎన్నికలకు ముందు ఎటు చూసినా.. పచ్చ కండువాల హడావుడి.. అభివృద్ది నినాదాలు, చంద్రబాబు పాలనలో మెరుపులపై ప్రకటనలతో నాయకులు కనిపించిన జిల్లా ఏదైనా ఉంటే [more]
గత ఏడాది ఎన్నికలకు ముందు ఎటు చూసినా.. పచ్చ కండువాల హడావుడి.. అభివృద్ది నినాదాలు, చంద్రబాబు పాలనలో మెరుపులపై ప్రకటనలతో నాయకులు కనిపించిన జిల్లా ఏదైనా ఉంటే [more]
గత ఏడాది ఎన్నికలకు ముందు ఎటు చూసినా.. పచ్చ కండువాల హడావుడి.. అభివృద్ది నినాదాలు, చంద్రబాబు పాలనలో మెరుపులపై ప్రకటనలతో నాయకులు కనిపించిన జిల్లా ఏదైనా ఉంటే అది ప్రకాశం జిల్లానే. కీలకమైన నాయకులు ఇక్కడ పార్టీకి ఉన్నారు. కరణం బలరాం నుంచి జిల్లా ఇంచార్జ్, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వరకు, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు నుంచి గొట్టిపాటి రవికుమార్, పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు.. వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వచ్చిన పోతుల రామారావు, ముతముల అశోక్ రెడ్డి ఇలా చాలా మంది నాయకులు ఇక్కడ టీడీపీ తరపున నానా హడావిడి చేశారు. దీంతో ఇక్కడ గత ఏడాది ఎన్నికలకు ముందు వరకు టీడీపీకి తిరుగులేదనే ప్రచారం జరిగింది. అయితే, గత ఏడాది ఎన్నికల్లో పార్టీ పరిస్థితి తిరగబడింది.
ఎవరికి వారే…
కీలకమైన నాయకులు అందరూ గెలుపు గుర్రం ఎక్కలేక పోయారు. అయితే, చీరాల నుంచి కరణం బలరామకృష్ణమూర్తి, కొండపి నుంచి డోలా బాలవీరాంజనేయస్వామి, అద్దంకి నుంచి రవి, పరుచూరు నుంచి ఏలూరి సాంబశివరావు విజయం సాధించారు. అయితే, మిగిలిన కీలక నాయకులు మాత్రం పరాజయం పాలయ్యారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న దామచర్ల జనార్న్ సైతం ఓడిపోయారు. అయితే, గెలిచిన వారిలోనూ కరణం వైసీపీకి జైకొట్టారు. డోలా ఉన్నప్పటికీ.. నియోజకవర్గంలో పెద్దగా హవా ప్రదర్శించలేక పోతున్నారు. కొండపిలో స్వామి ఎప్పుడూ కొందరి చేతుల్లో డమ్మీగానే ఉంటుంటారు. గెలిచిన వారే ఇలా ఉంటే.. ఇక, ఓడిపోయిన వారి గురించి చెప్పుకొనేది ఏముంటుంది. దీంతో కేవలం ఏడాది తిరిగే సరికి.. పార్టీ పరిస్థితి ప్రకాశంలో తలకిందులైందని అంటున్నారు.
కొందరు అడ్రస్ లేకుండా…
అయితే, ఇంత నిస్పృహ పరిస్థితిలో కూడా దర్శిలో మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు, పరుచూరులో ఏలూరి సాంబశివరావు మాత్రం ఒకింత పట్టించుకుంటున్నారనే వాదన వినిపిస్తోంది. నియోజకవర్గంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండడంతోపాటు.. లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు నిత్యావసరాలు పంచుతున్నారు. అదే సమయంలో పార్టీ తరఫున ఏదైనా కార్యక్రమాలు చేయాలన్నా కూడా వీరు ముందుంటున్నారు. మిగిలిన వారంతా కూడా మౌనం పాటిస్తున్నారు. ఇక, కనిగిరిలో మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఒకింత ఫర్వాలేదని అనుకున్నా.. ఎర్రగొండపాలెంలో బుడాల అజితారావు మాత్రం పూర్తిగా చేతులు ఎత్తేశారు. 2014 ఎన్నికల్లో ఓడిన ఆమె తిరిగి 2019 ఎన్నికల్లో పోటీ చేసే వరకు నియోజకవర్గంలోకి దిగలేదు. మొన్న ఎన్నికల్లో ఓడాక మళ్లీ అడ్రస్ లేకుండా పోయారు.
కొందరు పార్టీ మారి…
ఇక గిద్దలూరు, మార్కాపురంలో పార్టీని పట్టించుకునే వారే లేరు. ఇక కందుకూరులో పోతుల రామారావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే పట్టించుకోలేదు.. నాన్ లోకల్ అయిన ఆయన అక్కడ ఉంటారని.. ఆ నియోజకవర్గంలో టీడీపీని పట్టించుకుంటారని ఆశించడం అత్యాశే అవుతుంది. ఇక జూపూడి, మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు లాంటి వాళ్లు ఇప్పటికే పార్టీ మారిపోయారు. చీరాలలో కరణం పార్టీ మారిపోవడంతో అక్కడ పార్టీ బాధ్యుడిగా ఉన్న యెడం బాలాజీ చాలా వీక్ క్యాండెట్ అని పార్టీ వాళ్లే చెపుతున్నారు. ఈ మొత్తం పరిణామాలను గమనిస్తున్నవారు.. ప్రకాశంలో సైకిల్ మూలన బడిందనే వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం. మరి దీనికి పార్టీ అధినేత చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.