కీలకమైన నియోజకవర్గంలో టీడీపీ జెండా పీకేసినట్లే…?
ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ పార్టీకి జీవనాడి వంటి గుంటూరు జిల్లాలోని ఓ నియోజకవర్గంలో పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయే పరిస్థితిలో [more]
ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ పార్టీకి జీవనాడి వంటి గుంటూరు జిల్లాలోని ఓ నియోజకవర్గంలో పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయే పరిస్థితిలో [more]
ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ పార్టీకి జీవనాడి వంటి గుంటూరు జిల్లాలోని ఓ నియోజకవర్గంలో పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయే పరిస్థితిలో ఉందని చెప్పుకొంటున్నారు. పార్టీ అధి నేత చంద్రబాబు ఎంతో కీలకంగా భావించే ఎస్సీ నియోజకవర్గం ప్రత్తిపాడుపై టీడీపీలోని కొందరు సీనియర్ నాయకులు చర్చిస్తున్నారు. “బాబుగారు పట్టించుకోరు.. ఇక్కడ జెండా ఎగిరే పరిస్థితి కనిపించడం లేదే! సరైన నాయకుడు కూడా కరువయ్యారే!“ అని ఈ చర్చల్లో తమ్ముళ్లు తలబాదుకుంటున్నారు. విషయంలో కి వెళ్తే.. ప్రత్తిపాడు నియోజకవర్గం నిజానికి పార్టీకి పెట్టని కోట.
వరస విజయాలతో….
నియోజకవర్గం పునర్ విభజనకు ముందు మాకినేని పెదరత్తయ్య టీడీపీని బలంగా ఇక్కడ నాటారు. వరుస విజయాలతో ఆయన సైకిల్ జోరు పెంచారు. తర్వాత 2009కి ముందు జరిగిన పునర్విభజనలో దీనిని ఎస్సీ నియోజకవర్గంగా మార్చారు. పార్టీ ఆవిర్భావం నుంచి 2004 వరకు ఏ ఎన్నికల్లోనూ ఇక్కడ టీడీపీ ఓడిపోలేదు. ఆ ఎన్నికల్లోనే తొలిసారి ఇక్కడ రావి వెంకటరమణ కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. ఇక, అప్పటి నుంచి టీడీపీ గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ టికెట్‌పై మేకతోటి సుచరిత అప్పట్లో విజయం దక్కించుకున్నారు. ఆ తర్వాత 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన సుచరిత వరుసగా రెండోసారి విజయం సాధించారు. ఇక, 2014లో టీడీపీ విజయం సాధించింది. చంద్రబాబు వ్యూహాత్మక నాయకుడనే ప్రచారం ఊపందుకోవడంతో ఇక్కడి ప్రజలు సైకిల్ పక్షాన నిలిచారు. రావెల కిశోర్‌బాబు విజయం సాధించారు.
రావెల వెళ్లిపోవడంతో…..
అయితే, ఆయన పార్టీలో పదవులు అనుభవించి ఎన్నికలకు కొద్ది కాలం ముందు బీజేపీ కండువా కప్పుకొన్నారు. దీంతో టీడీపీకి పెద్దదెబ్బే తగిలింది. ఈ నేపథ్యంలో 2019లో అనూహ్యంగా నియోజకవర్గానికి సంబంధం లేని మరో ఎస్సీ నాయకుడు, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను తీసుకువచ్చి .. చంద్రబాబు టికెట్ ఇచ్చారు వాస్తవానికి ప్రత్తిపాడులోనే కేడర్‌ను బలోపేతం చేసుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ, బాబు అలా చేయలేదు. డొక్కా తనకు తాడికొండ కావాలని పట్టుబట్టినా చంద్రబాబు బలవంతంగా ప్రత్తిపాడు సీటు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఓడిన డొక్కా తనకు ఎంపీ జయదేవ్ వర్గం పనిచేయలేదని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లినా పట్టించుకోలేదు.
డొక్కా కూడా వెళ్లిపోవడంతో….
ఇక 2019 ఎన్నికల్లో జగన్ సునామీతో డొక్కా మాణిక్య వరప్రసాద్ మట్టికరిచారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఆయనకు ఇచ్చిన ఎమ్మెల్సీ సీటు వదులుకుని మరీ వైసీపీలోకి వెళ్లిపోయారు. ఇటీవల పరిణామాల నేపథ్యంలో డొక్కా వైసీపీ పంచన చేరిపోయారు. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీ గా గెలచిారు. ఈ క్రమంలోనే ప్రత్తిపాడులో పట్టున్న మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ, మేకతోటి సుచరిత, డొక్కా లాంటి నేతలు అంతా ఇప్పుడు వైసీపీలోనే ఉన్నారు. దీంతో ఇప్పుడు ఇక్కడ టీడీపీ జెండా పట్టుకునే నేతే లేరు. ఈ పరిణామాలతో ప్రత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందనే వాదన బలంగా వినిపిస్తోంది. 2014లో రావెల, 2019 డొక్కాలను చంద్రబాబు నమ్మినా.. ఇద్దరూ బాబును వదిలి వెళ్లిపోయారు.
తిరిగి మాకినేనికే….
ఫలితంగా స్థానికంగా టీడీపీకి అసలు కేడరే లేకుండా పోయింది. చివరకు చంద్రబాబు దిక్కులేక అవుట్ డేటెడ్ లీడర్ అయిన మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్యనే ప్రత్తిపాడు పార్టీ పరిస్థితి చూడమని ఆదేశించారు. కీలకమైన ఎస్సీ నియోజకవర్గం కావడం, సుచరిత హోం మంత్రి కావడంతో .. ఇక్కడ పార్టీని కాపాడుకునే ప్రయత్నం కానీ, ప్రభుత్వానికి దీటుగా గళం వినిపించే నాయకుడు కానీ లేకపోవడం.. బాబు ఈ విషయాలను అస్సలు పట్టించుకోకపోవడం వంటి పరిణామాలతో ఈ నియోజకవర్గంలో టీడీపీ జెండా పీకేశారా? అనే చర్చ సాగుతుండడం గమనార్హం.