సీమ పోయింది.. కోస్తా కోత పెడుతోంది
తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇపుడు చాలా దారుణంగా ఉంది. మళ్లీ అధికారంలోకి వస్తాం, నాలుగవ సారి కూడా ముఖ్యమంత్రి అయి చంద్రబాబు సినిమా చూపిస్తారని ఆ పార్టీ [more]
తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇపుడు చాలా దారుణంగా ఉంది. మళ్లీ అధికారంలోకి వస్తాం, నాలుగవ సారి కూడా ముఖ్యమంత్రి అయి చంద్రబాబు సినిమా చూపిస్తారని ఆ పార్టీ [more]
తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇపుడు చాలా దారుణంగా ఉంది. మళ్లీ అధికారంలోకి వస్తాం, నాలుగవ సారి కూడా ముఖ్యమంత్రి అయి చంద్రబాబు సినిమా చూపిస్తారని ఆ పార్టీ అధికార ప్రతినిధి బుద్ధా వెంకన్న అన్నంత సులువుగా ఏపీలో పరిస్థితి లేదు. టీడీపీ ఆశలు పెట్టుకున్న చోట చిల్లు పడుతోంది. వైసీపీ కంచుకోట మాత్రం చెక్కుచెదరడం లేదు. ఈ ప్రాంతీయ సమీకరణలు టీడీపీని కంగారు పెడుతున్నాయి. అదే సమయంలో సామాజిక సమీకరణలు కూడా ఆ పార్టీకి అంతుచిక్కడంలేదు. ఎపుడు ఎన్నికలు జరిగినా అధికారం మాదే అని జబ్బలు చరుస్తున్న టీడీపీకి తమ్ముళ్ళు ఒక్కొక్కరుగా పార్టీని వీడిపోతూండడం కలవరపెడుతోంది. పోయిన చోట వెతుక్కుందామంటే అక్కడ శూన్యమే కనిపిస్తోంది తప్ప ఫలితం దక్కడంలేదు.
సీమ ధీమా లేదుగా…
తెలుగుదేశం పార్టీని 1982లో ఎన్టీఆర్ పెట్టినపుడు ఉమ్మడి ఏపీలో తెలంగాణా, కోస్తా, రాయలసీమ అన్న తేడా లేకుండా అంతా మద్దతు ఇచ్చారు. ఇక రాయలసీమ దత్తపుత్రుడు అని అన్నగారికి పేరు. ఆయన కరవు ప్రాంతాలను ప్రముఖ సినీనటుడిగా జోలే పట్టి ఆదుకున్నారు. దానికి తోడు పౌరుషవంతమైన పాత్రలకు రామారావు పెట్టింది పేరు. ఆ పాత్రలంటే సీమ జనం ఇష్టపడతారు. అలా ఆయన వారికి దేవుడు అయ్యారు. అందుకే సీమ రెడ్లను సైతం పక్కన పెట్టి మరీ ఎన్టీఆర్ ఉన్నంతవరకూ టీడీపీకి సీమ మద్దతుగా నిలిచింది. 1989లో టీడీపీ ఓటమిపాలు అయినా పునాదులు బలంగా ఉండి మళ్లీ 1994లో సీమను వూడ్చిపెట్టేసింది టీడీపీ. చంద్రబాబు జమానాలో ఆ ధీమా లేకుండా పోయింది. ఆయన 1995లో గద్దెనెక్కిన తరువాత సీమలో సైకిల్ పార్టీకి తూట్లు పడడం మెల్లమెల్లగా మొదలైంది.
కోస్తాలోనూ కన్నమే…
ఇక 1999 ఎన్నికల్లో చంద్రబాబు బీజేపీ మద్దతుతో బొటాబొటీగా గెలిచారు. అపుడు కూడా సీమ మద్దతు కంటే కోస్తా బలమే ఎక్కువ. ఇక 2004, 2009 ఎన్నికల్లో రెండు మార్లు టీడీపీ పరాజయం కావడం వెనక అటు సీమ, ఇటు తెలంగాణా ముఖ్యపాత్ర పోషించాయి. 2014 ఎన్నికలో మోడీ గాలిలో బాబు గెలిచినా కూడా సీమలో టీడీపీ హవా చూపించలేకపోయింది. వైసీపీకి జగన్ కి సీమ అండగా నిలబడింది. కోస్తా బలంతోనే బాబు మూడవసారి సీఎం అయ్యారు. ఇక 2019 ఎన్నికల్లో సీమతో పాటు కోస్తా కూడా దెబ్బకొట్టడంతో బాబు ఘోరంగా ఓడిపోయారు. ఇపుడు చూస్తే సీమలో జగన్ బలం అలాగే ఉంది. కోస్తాలో ఆయన పట్టుపెంచుకుంటున్నారు. దానికి తోడు, బీజేపీ కూడా కోస్తా మీదనే కన్నేసి టీడీపీ ప్రాంతీయ, సామాజిక సమీకరణలను చెల్లాచెదురు చేస్తోంది. ఈ పరిణామాలతో బీజేపీ ఏ మాత్రం పుంజుకున్నా ఆ దెబ్బ టీడీపీ మీదనే గట్టిగా పడుతుంది. సీమను పక్కన ఉంచుకున్న వైసీపీకి కోస్తాలో ఏ మాత్రం బలం కలిసినా మరోమారు అధికారం దక్కే అవకాశాలు ఉంటాయి. ఈ ఆలోచనలతోనే పసుపు శిబిరం ఇపుడు వణికిపోతోంది.