బలం ఉన్నా… టీడీపీని వెంటాడుతున్న బలహీనత
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీ టీడీపీకి ఎక్కడా లేని బలం విశాఖలో ఉంది. విశాఖ నగరంలోని నాలుగు నియోజకవర్గాల్లోనూ టీడీపీ నాయకులే గత ఏడాది జరిగిన ఎన్నికల్లో [more]
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీ టీడీపీకి ఎక్కడా లేని బలం విశాఖలో ఉంది. విశాఖ నగరంలోని నాలుగు నియోజకవర్గాల్లోనూ టీడీపీ నాయకులే గత ఏడాది జరిగిన ఎన్నికల్లో [more]
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీ టీడీపీకి ఎక్కడా లేని బలం విశాఖలో ఉంది. విశాఖ నగరంలోని నాలుగు నియోజకవర్గాల్లోనూ టీడీపీ నాయకులే గత ఏడాది జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. పైగా వారంతా కూడా పార్టీలోనే ఉన్నారు. అంతేకాదు, ఆ నలుగురు కూడా ఢక్కాముక్కీలు తిన్న నాయకులే. ఎలాంటి పరిస్థితినైనా ఎదిరించి తమకు అనుకూలంగా మలుచుకోగల ధీరులే. ముఖ్యంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయ ఉద్ధండుడిగా పేరు తెచ్చుకున్నారు. మరి అలాంటి జిల్లాలో ముఖ్యం గా విశాఖ నగర కార్పొరేషన్లో కీలకమైన మేయర్ పదవి ఎవరికి దక్కుతుంది ? గత ఏడాది ఇక్కడ నాలుగు స్థానాల్లోనూ టీడీపీ విజయదుందుభి మోగించింది. ఆ నాయకులు ఇప్పటికీ పార్టీలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని. ఎవరి నియోజకవర్గాల్లో వారు తామేంటో నిరూపించుకోవాలని కసితో ఉన్నారు.
ఒకరంటే ఒకరికి?
త్వరలో జరగనున్న జీవీఎంసీ ఎన్నికలలో మేయర్ పదవి తెలుగుదేశానిదేనని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నా పరిస్థితులు ఈ సారి అంత సానుకూలంగా అయితే లేవు. జీవీఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల సందర్భంగా టీడీపీ అర్బన్, రూరల్ సమన్వయకమిటీ సమావేశం జరిగింది. వార్డుల్లో కార్యకర్తల అభిప్రాయం మేరకే కార్పొరేషన్ ఎంపిక ఉంటుందని సమావేశం నిర్ణయించింది. నగరంలో నలుగురు ఎమ్మెల్యేలు, ఇన్చార్జులు సమిష్టి కృషితో నిర్ణయం తీసుకుని అభ్యర్థులను గెలిపించేలా కృషి చేయాలని తీర్మానాలు చేస్తున్నా.. వీళ్లల్లో ఒకరంటే మరొకరికి గిట్టదు. గెలవాలని తీర్మానాలు చేస్తున్నా ఈ బాధ్యతను ఎవరు తీసుకుంటారు ? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. ఇటీవల చంద్రబాబును పోలీసులు విశాఖలో అడుగు పెట్టకుండా తిప్పిపంపిన ఉదంతంపై ఏ ఒక్కరూ ఇప్పటి వరకు నోరు విప్పలేదు.
లోలోపల వైసీపీ సహకరిస్తూ…
ఈ నేపథ్యంలో ఇప్పుడు దూకుడుగా ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయగలరా ? అనేది చూడాలి. అదేసమయంలో నాయకులు ఎమ్మెల్యేలు అందరూ టీడీపీలోనే ఉన్నప్పటికీ ఊగిసలాట ధోరణిలోనే రాజకీయాలు చేస్తున్నారు. ఏ ఒక్కరూ ముందుకు వచ్చి పార్టీని నడిపిస్తామని, ఇక్కడి బాధ్యతను భుజానికెత్తుకుంటామని చెప్పే నాయకులు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో గెలుచుకోవాలనే కోరిక ఉన్నప్పటికీ గెలుపు దిశగా మాత్రం అడుగులు పడడం లేదు. పైకి మాత్రం డాంబికాలు పోతున్నా.. లోలోన లోపాయికారీగా అధికార పార్టీకి సహకరిస్తున్న తమ్ముళ్లు కూడా ఉన్నారనేది నిర్వివాదాంశం. ఈ నేపథ్యంలోనే వైసీపీ నుంచి ఇక్కడ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఏకంగా విజయసాయిరెడ్డి వ్యూహ ప్రతివ్యూహాలు చేస్తున్నారు.
వైసీపీ బలం పెంచుకుంటూ….
గత ఎన్నికల్లోనే నార్త్ నియోజకవర్గంలో మాజీ మంత్రి గంటా చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా గెలిచారు. ఈ సారి అక్కడ వైసీపీ సమన్వయకర్త కెకె.రాజు దూసుకుపోతున్నారు. సౌత్‌లో వుడా చైర్మన్‌గా ఉన్న ద్రోణంరాజు శ్రీనివాస్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఈ సారి అక్కడ టీడీపీకి అంత సలువు కాదు. పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల్లో టీడీపీ ఒకింత బలంగానే ఉంది. ఇక పెందుర్తి, గాజువాకలో జనసేన ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. ఇక పార్టీ ఘోరమైన ఓటమితో భవిష్యత్తు ఉండదని భావిస్తోన్న టీడీపీ నాయకులు వైసీపీలో చేరిపోతున్నారు. నిన్న మొన్నటి వరకు నగర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే రెహమాన్ వైసీపీ కండువా కప్పుకున్నారు. గాజువాకలో మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ సైతం పార్టీలో ఉండాలా ? వెళ్లాలా ? అన్న ఊగిసలాటలో ఉన్నారు. మరి ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో టీడీపీ గత అసెంబ్లీ ఎన్నికల నాటి పట్టు నిలుపుకుంటుందో ? లేదో ? చూడాలి.