కంచుకోట మరోసారి తెలుగుదేశం పార్టీదే..?
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోటల్లా ఉన్న నియోజకవర్గాల్లో అనంతపురం జిల్లా పెనుకొండ ముందుంటుంది. తెలుగుదేశం పార్టీకి తిరుగులేదనే రాజకీయ పరిస్థితులు ఉన్న ఈ [more]
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోటల్లా ఉన్న నియోజకవర్గాల్లో అనంతపురం జిల్లా పెనుకొండ ముందుంటుంది. తెలుగుదేశం పార్టీకి తిరుగులేదనే రాజకీయ పరిస్థితులు ఉన్న ఈ [more]
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోటల్లా ఉన్న నియోజకవర్గాల్లో అనంతపురం జిల్లా పెనుకొండ ముందుంటుంది. తెలుగుదేశం పార్టీకి తిరుగులేదనే రాజకీయ పరిస్థితులు ఉన్న ఈ నియోజకవర్గంలో ఈసారి కచ్చితంగా తమ జెండా ఎగరేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది. ఇక తెలుగుదేశం పార్టీ మరోసారి తమదే విజయమని ధీమాగా ఉంది. గత ఎన్నికల కంటే కూడా మెజారిటీ పెరుగుతుందని ఆ పార్టీ లెక్కలు వేసుకుంటోంది. అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితులు, పోలింగ్ సరళ చూస్తే ఈసారి పెనుకొండలో హోరాహోరీ పోరు జరిగినట్లు కనిపిస్తోంది. రెండు పార్టీల అభ్యర్థులూ ఈసారి ఎన్నికల చెమటోడ్చారు. దీంతో తెలుగుదేశం పార్టీకి పట్టున్న నియోజకవర్గమే అయినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఆశలు పెరిగాయి.
కియా మోటర్స్ రాకతో…
పెనుకొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ముందునుంచి మంచి పట్టుంది. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఈ నియోజకవర్గంలో మూడు ఉప ఎన్నికలతో కలిసి మొత్తం 11 సార్లు ఎన్నిక జరగగా తెలుగుదేశం పార్టీ ఏకంగా తొమ్మిది సార్లు విజయం సాధించింది. ముఖ్యంగా 1994లో దివంగత నేత పరిటాల రవి ఇక్కడ రాజకీయ రంగప్రవేశం చేశాక పార్టీకి పెనుకొండ పెట్టని కోటలా మారింది. ఆయన నాలుగుసార్లు ఇక్కడి నుంచి విజయం సాధించారు. గత ఎంపీగా పనిచేసిన బీ.కే.పార్ధసారథి గత రెండు ఎన్నికల్లోనూ పెనుకొండ నుంచి విజయం సాధించి మరోసారి పోటీ చేశారు. ఈసారి ఆయన హ్యాట్రిక్ పై కన్నేశారు. సహజంగానే టీడీపీకి ఇక్కడ బలం ఉండటంతో పాటు ఈసారి కియా మోటర్స్ పెనుకొండలోనే స్థాపించడం, నియోజకవర్గానికి సాగు నీరు అందడం వంటి కారణాలతో ఈసారి కూడా తనకు తిరుగులేదనుకుంటున్నారు. గత ఎన్నికల కంటే మెజారిటీ పెరుగుతుందని నమ్మకంగా ఉన్నారు.
గట్టి పోటీ ఇస్తున్న శంకరనారాయణ
ఎంపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్పతో సయోధ్య లేకపోవడం, ఎప్పుడూ టీడీపీకి అండగా ఉండే ఓ సామాజకవర్గ ఓటర్లు ఈసారి వైసీపీకి అనుకూలంగా మారడం, కియా మోటర్స్ వల్ల కొందరే లబ్ధి పొందడం వంటి అంశాలు ఆయనకు మైనస్ గా మారాయి. కాగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున మరోసారి శంకరనారాయణ పోటీ చేశారు. గత ఎన్నికల్లో ఆయన పార్ధసారథి చేతిలో 17 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అయినా ఐదేళ్లు ప్రజల్లో ఉన్నారనే పేరుండటం, గత ఎన్నికల్లో ఓడిపోయారనే సానుభూతి కలిసి వచ్చే అవకాశం ఉండటంతో ఈసారి తాను విజయం సాధిస్తానని ఆయన ధీమాగా ఉన్నారు. కానీ, స్థానికేతరుడు కావడం, ఆర్థికంగా బలంగా లేకపోవడం, అందరినీ కలుపుకొని వెళ్లలేకపోవడం ఆయనకు మైనస్ గా మారింది. ఇక్కడ, గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న కురబ, వాల్మీకి సామాజకవర్గ ఓటర్లు ఈసారి వైసీపీ వైపు మొగ్గు చూపారనే అంచనాలు ఉన్నాయి. మొత్తంగా పెనుకొండలో తెలుగుదేశం పార్టీకే ఎక్కువ విజయావకాశాలు కనిపిస్తున్నా మెజారిటీ మాత్రం బాగా తగ్గే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి.