గడప దాటేట్లు లేరే…? ఎలా..?
ఏపీ రాజధాని అమరాతి కొలువైన జిల్లా గుంటూరులో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి? రాబోయే రోజుల్లో పార్టీ పుంజుకుంటుందా? వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ దూకుడు [more]
ఏపీ రాజధాని అమరాతి కొలువైన జిల్లా గుంటూరులో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి? రాబోయే రోజుల్లో పార్టీ పుంజుకుంటుందా? వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ దూకుడు [more]
ఏపీ రాజధాని అమరాతి కొలువైన జిల్లా గుంటూరులో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి? రాబోయే రోజుల్లో పార్టీ పుంజుకుంటుందా? వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ దూకుడు ప్రదర్శించి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటుందా? ఇప్పుడు అందరినీ తొలిచేస్తున్న ప్రధాన ప్రశ్న. జిల్లాలో టీడీపీకి మహామహులు అనదగిన నాయకులు ఉన్నారు. అయితే, తాజాగా జరిగిన ఎన్నికల్లో జగన్ సునామీ ముందు వీరంతా చతికిల పడ్డారు. రాయపాటి సాంబశివరావు, యరపతినేని శ్రీనివాసరావు, జీవీ ఆంజనేయులు, కోడెల శివప్రసాదరావు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, కొమ్మాలపాటి శ్రీధర్ వంటి వారు ఉన్నా కూడా పార్టీని నిలబెట్టలేక పోయారు. వీరిలో ఏ ఒక్కరు విజయం సాధించలేకపోయారు.
ఇద్దరే గెలవడంతో….
వరుస విజయాలు సాధించిన నాయకులు కూడా మూడోసారి విజయం దగ్గరకు వచ్చేసరికి మాత్రం కుప్పకూలారు. ఇక, పొన్నూరు నుంచి ఐదుసార్లు విజయం సాధించిన ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కూడా ఓటమిపాలయ్యారు. కేవలం రెండు నియజకవర్గాల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. రేపల్లెలలో అనగాని సత్య ప్రసాద్, గుంటూరు వెస్ట్‌లో మద్దాలి గిరిధర్‌లు మాత్రమే జగన్ సునామీని తట్టుకుని నిలబడ్డారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పార్టీ పరిస్థితి ఏంటి? అనే విషయంపై తమ్ముళ్లు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇదిలావుంటే, తాను విజయం సాధించిన తర్వాత నేరుగా ఢిల్లీకి వెళ్లిన అనగాని.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ కావడం మరింత చర్చకు దారితీసింది.
బయటకు రాకపోవడంతో….
అనగాని ఇక, పార్టీ మారిపోతారనే పుకార్లు షికారు చేశాయి. అయితే, తాను పార్టీ మారడం లేదని చెప్పుకొచ్చారు. అయిన ప్పటికీ.. ఇప్పటి వరకు ప్రజల్లోకి వచ్చింది లేదు. ఇక, ఓడిపోయిన నాయకులు ఇప్పటి వరకు గడప దాటి బయటకు రాలేదు. రాయపాటి ఏకంగా రాజకీయాల నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నారు మరోపక్క, కోడెల శివప్రసాద రావు.. తన కుమారుడు, కుమార్తెలపై నమోదైన కేసులతోనే తల్లడిల్లుతున్నారు. చివరకు తెలుగుదేశం పార్టీ కూడా వీళ్లకు సపోర్ట్ చేయడం లేదు. ఇక, యరపతినేని కూడా గనుల కుంభకో ణానికి సంబంధించి భయపడుతున్నారనే వార్తలు వస్తున్నాయి. జగన్ ప్రభుత్వం యరపతినేని టార్గెట్ చేసుకునేందుకు రెడీ అయిందనే వార్తలు కూడా వస్తున్నాయి.
భయంతోనేనా…?
ఇక రాయపాటి వయస్సు పైబడడంతో ఆయన రాజకీయాలకు దూరం కానున్నారు. ఆలపాటి రాజా లాంటి వాళ్లు ఎన్నికలకు దూరం అవ్వొచ్చని అంటున్నారు. ఇక మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కూడా బీజేపీలోకి వెళతారన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీని ఎవరు ముందుకు తీసుకు వెళ్తారనే విషయం ఇప్పటికీ తేలలేదు. త్వరలోనే జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా చూపించాలని నిర్ణయించుకున్నా.. దీనికి తగిన విధంగా పార్టీలో నేతలు సమాయత్తం కాకపోవడం గమనార్హం. అంతేకాదు, అధికారంలో ఉన్నప్పుడు జగన్‌పై విరుచుకుపడిన యరపతినేని వంటి వారు సైతం ఇప్పుడు చాలా వరకు సైలెంట్ అయిపోయారు. ఏం మాట్లాడితే.. ఏం జరుగుతుందో? తనపై కేసులను తిరగదోడతారో..నని వారు భయంతో అల్లాడుతున్నారు. ఈ క్రమంలో పార్టీ మనుగడ ఏమేరకు సాగుతుందో చూడాలి.