దొందూ దొందేనా…?
దేశభద్రత, రక్షణ, విదేశాంగ విషయాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఒకే విధానం అమల్లో ఉంటుంది. సంబంధాల్లో కొద్దిపాటి తేడాలు, ప్రకటనల్లో వైవిధ్యం మినహా పాలసీ మార్పులు [more]
దేశభద్రత, రక్షణ, విదేశాంగ విషయాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఒకే విధానం అమల్లో ఉంటుంది. సంబంధాల్లో కొద్దిపాటి తేడాలు, ప్రకటనల్లో వైవిధ్యం మినహా పాలసీ మార్పులు [more]
దేశభద్రత, రక్షణ, విదేశాంగ విషయాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఒకే విధానం అమల్లో ఉంటుంది. సంబంధాల్లో కొద్దిపాటి తేడాలు, ప్రకటనల్లో వైవిధ్యం మినహా పాలసీ మార్పులు పెద్దగా ఉండవు. అమెరికా, పాకిస్తాన్, రష్యాలతో నాలుగైదు దశాబ్దాలుగా మన సంబంధాలను చూస్తే ఈవిషయం తేటతెల్లమవుతుంది. దాయాది పాకిస్తాన్ కు మన పొడగిట్టదు. అలాగే మనకూ ఆ దేశం అంటే పడదు. అమెరికాతో రాసుకు పూసుకుని తిరగడం మామూలై పోయింది. రష్యా బలహీనపడినప్పటికీ ఆంతరంగిక మిత్ర దేశంగా దాని స్థానం చెక్కు చెదరదు. కానీ ఎటొచ్చీ చైనాతోనే వచ్చి పడుతోంది చిక్కు. 1950 వ దశకంలో హిందీ,చీనీ భాయి భాయి, పంచశీల అంటూ కాంగ్రెసు చైనాను హత్తుకునేందుకు పాకులాడింది. తాజాగా నరేంద్రమోడీ నేతృత్వంలో బీజేపీ సైతం చైనాకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. 18 సార్లు చైనా అధ్యక్షునితో భారత ప్రధాని భేటీ కావడమంటే మాటలు కాదు. అయినా అప్పటి నెహ్రూ లభించిన ఫలితమే నరేంద్రమోడీకి సైతం దాదాపు దక్కిందనే చెప్పాలి. యుద్దమేఘాలు కమ్ముకుంటున్న వేళ బీజేపీ, కాంగ్రెసుల రాజకీయ పోరాటం మాత్రం ఆసక్తి రేపుతోంది. అనేక అనుమానాలను లేవనెత్తుతోంది. రెండు పార్టీల ద్వంద్వ ప్రమాణాలను తాజా వివాదం బయటపెడుతోంది.
రాజీవ్ ఫౌండేషన్…
కాంగ్రెసు పార్టీ బీజేపీల్లో చైనా సంస్థలు, కంపెనీల కు సంబంధించిన విరాళాలు దుమారం రేపుతున్నాయి. ఒకవైపు యుద్ధవాతావరణం అలుముకుంది. అంతా కలిసి కేంద్రం తీసుకునే నిర్ణయానికి మద్దతు ఇస్తామని పార్టీలు ప్రకటించాయి. మరోవైపు 15 సంవత్సరాల క్రితం నాడు రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు చైనాకు చెందిన అధికార సంస్థలు, రాయబార కార్యాలయాలు విరాళాలిచ్చాయంటూ బీజేపీ నాయకులు దుమ్మెత్తిపోయడం మొదలు పెట్టారు. చైనా చొరబాట్లతో 20 మంది సైనికులను కోల్పోయిన నేపథ్యంలో కేంద్రం ఇబ్బంది పడుతోంది. రాజకీయంగా ఆత్మరక్షణలో పడింది. ఈ పరిస్థితులను ఆసరాగా చేసుకుంటూ కాంగ్రెస్ దాడిని ఉధృతం చేసింది. మన్ కీ బాత్ లో దేశ రక్షణ గురించి ప్రధాని ఎందుకు మాట్లాడరంటూ రాహుల్ గాంధీ రాగాలాపన మొదలు పెట్టారు. సోనియా, ప్రియాంక సైతం గతంలో ఎన్నడూ లేని విధంగా చైనా విషయంలో బీజేపీపై విరుచుకుపడుతున్నారు. ప్రత్యేకించి ప్రధానిని టార్గెట్ చేస్తున్నారు. దీనికి ప్రతివ్యూహంగా రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు చైనా నుంచి విరాళాలొచ్చాయంటూ భారతీయ జనతాపార్టీ నాయకులు దాడి మొదలు పెట్టారు. దేశ సరిహద్దుల వద్ద ఉన్న పరిస్థితులకు, చైనా దురాక్రమణకు, మన సైనికుల మరణానికి రాజీవ్ గాంధీ ఫౌండేషన్ విరాళాలకు సంబంధమే లేదు. అయినా రాజకీయాల్లో అన్నీ చెల్లుబాటవుతాయి. అందుకే ఇదో పెద్ద చర్చగా దేశంలో నడుస్తోంది.
పీఎం కేర్స్ …
ప్రధానమంత్రి కరోనా నేపథ్యంలో ప్రజలను ఆదుకోవడానికి వివిధ సంస్థలు, వ్యక్తుల నుంచి సాయం కోరుతూ ప్రారంభించింది పీఎం కేర్స్. దీనిని కూడా రాజకీయ వివాదంగా మార్చివేసింది కాంగ్రెసు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ విరాళాల గురించి బీజేపీ ప్రశ్నలు లేవనెత్తింది. దానికి సరైన సమాధానం ఇవ్వడంలో కాంగ్రెసు పెద్దగా ఆసక్తి చూపలేదు. బదులుగా చైనా కంపెనీల నుంచి పీఎం కేర్స్ కు డబ్బులు వస్తున్నాయంటూ ప్రత్యారోపణ మొదలు పెట్టింది. నిజానికీ పీఎం కేర్స్ అధికారికమైన ఖాతా. చైనాకు చెందిన భాగస్వామ్య కంపెనీలు భారత్ లో లక్షల కోట్ల రూపాయల్లో వ్యాపారం చేస్తున్నాయి. ప్రజల నుంచి లాభాలు దండుకుంటున్నాయి. అందువల్ల పీఎం కేర్స్ కు విరాళమివ్వడం అక్రమమని చెప్పలేం. అయినా కాంగ్రెసు భూతద్దంలో చూపడానికే ప్రయత్నిస్తోంది. నిజానికి బీజేపీ కూడా ఇక్కడ ద్వంద్వ ప్రమాణాలనే అనుసరిస్తోందని చెప్పాలి. చైనా వస్తువులను , సేవలను బహిష్కరించడంటూ పిలుపునిస్తూనే అవే సంస్థల దాతృత్వాన్ని మాత్రం స్వాగతిస్తోంది. ఈ రెండు పార్టీల్లోనూ చిత్తశుద్ధి లేమికి ఇదో పెద్ద నిదర్శనం.
మరుగున పెట్టే ఎత్తుగడేనా..?
చైనా విషయంలో రెండు పార్టీలకు మచ్చలున్నాయి. గురివెంద సామెతనే తలపిస్తున్నాయి. చెప్పే నీతులకు, చేసే పనులకు మధ్య అంతరం స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. రాజీవ్ ఫౌండేషన్ అక్రమాలకు పాల్పడితే, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునే అధికారం ప్రస్తుత ప్రభుత్వానికి ఉంటుంది. విదేశీ విరాళాల నిబంధనలను అతిక్రమిస్తే కేసులు నమోదు చేయవచ్చు. చట్టపరంగా శిక్షలు విధించవచ్చు. కానీ ఆ విషయం జోలికి కేంద్రం వెళ్లడం లేదు. చైనాపై తాము బలహీనంగా స్పందిస్తున్నామన్న ఆరోపణల నుంచి తప్పించుకోవడానికే కాంగ్రెసును టార్గెట్ చేస్తున్నారు. అలాగే కాంగ్రెసు పార్టీ సైతం సంయమనం పాటించాల్సిన సందర్బాల్లో అసందర్భ అంశాలపై గురి పెట్టి నరేంద్ర మోడీని అపఖ్యాతి పాలు చేయాలని చూస్తోంది. రెండు పార్టీలు సరిహద్దుల్లో వాస్తవిక పరిస్థితులు ప్రజల దృష్టిలోకి రాకుండా చేస్తున్నాయి. రాజకీయ అంశాలను భావోద్వేగ అంశాలు, రక్షణ అంశాలతో కలగాపులగం చేసేస్తున్నాయి.
-ఎడిటోరియల్ డెస్క్