కిందా మీదా పడుతున్నారే
వైఎస్ రాజశేఖర్ రెడ్డి తిరుగులేని నాయకుడు. మూడు పదుల వయసులో పీసీసీ ప్రెసిడెంట్ గా ఉమ్మడి ఏపీలో పనిచేసిన నేత. ముప్పయ్యేళ్ళ పాటు అధికార పదవులు లేకపోయినా [more]
వైఎస్ రాజశేఖర్ రెడ్డి తిరుగులేని నాయకుడు. మూడు పదుల వయసులో పీసీసీ ప్రెసిడెంట్ గా ఉమ్మడి ఏపీలో పనిచేసిన నేత. ముప్పయ్యేళ్ళ పాటు అధికార పదవులు లేకపోయినా [more]
వైఎస్ రాజశేఖర్ రెడ్డి తిరుగులేని నాయకుడు. మూడు పదుల వయసులో పీసీసీ ప్రెసిడెంట్ గా ఉమ్మడి ఏపీలో పనిచేసిన నేత. ముప్పయ్యేళ్ళ పాటు అధికార పదవులు లేకపోయినా జనంలో ఎదిగి నిలిచినవాడు. కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి పదవి అంటే హై కమాండ్ దయా ధర్మం. జనంతో పనిలేకుండా ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడితే చాలు. అటువంటి కాంగ్రెస్ లో సీఎం అయి తనదైన ముద్ర వేసిన మహానేత. ఏపీ రాజకీయాలనే కాదు, ఓ దశలో దేశ రాజకీయాలను సైతం ప్రభావితం చేసిన వైఎస్సార్ ముఖ్యమంత్రిగా చేసిన పనులు చిరస్థాయిలో నిలిచిపోయాయి. దశాబ్దాల పాటు రాష్ట్రాలను ఏలిన వారు సైతం చేయలేని పనులకు కేవలం అయిదేళ్ళ కాలంలో చేసి చూపించిన మొనగాడు వైఎస్సార్. ఆయన రాజకీయ వారసుడు జగన్.
వైఎసార్ పేరిట జనంలోకి…..
తను చేసిన పనులకు వైఎస్సార్ కి ప్రతిఫలం ఆయన బతికుండగా రాలేదు. దానికి ఉదాహరణ 2009 ఎన్నికలు. అన్ని పధకాలు అమలు చేసినా కూడా వైఎస్సార్ కి జనం పాస్ మార్కులే ఇచ్చారు. ఆ ఎన్నికల్లో 152 సీట్లను మాత్రమే కాంగ్రెస్ కి ఇచ్చి అర కొర మెజారిటీతో అధికారంలో కూర్చోబెట్టారు. అయితే వైఎసార్ చనిపోయాక వారసుడిగా జగన్ ఎంట్రీ ఇచ్చిన తరువాత మాత్రం వైఎస్సార్ దేవుడైపోయాడు. ఆయన పేరు మీద జగన్, ఆయన అభ్యర్ధులు పోటీకి దిగితే రికార్డ్ స్థాయి మెజారిటీలు దక్కించుకున్నారు. 2014 ఎన్నికల్లోనూ వైసీపీకి కేవలం అయిదున్నర లక్షల ఓట్లు మాత్రమే తగ్గాయి. అంటే వైఎస్సార్ జన నేతగా ఎంతలా నిలిచిపోయారో అర్ధమవుతుంది. ఇక వైఎస్సార్ పేరు మీద పుట్టిన వైసీపీ బంపర్ మెజారిటీతో 2019 ఎన్నికల్లో విజయ ఢంకా మోగించింది. ఇది జాతి మొత్తం ఆశ్చర్యంతో చూసేలా చేసిన ప్రజా తీర్పు. వైఎస్సార్ రాజకీయ శత్రువులు సైతం ఇంతటి చరిష్మా రాజశేఖర్ రెడ్డికి ఉందా అని నోళ్ళు వెళ్లబెట్టేంతగా ఆ ప్రభంజనం వీచింది.
రాజన్న జోరే వేరు…..
ఇక తండ్రి పేరు మీద పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన జగన్ కి అదే తండ్రితో పోలిక ఇపుడు కొత్త చిక్కులు తెస్తోంది. వైఎస్సార్ నాటి రోజులు వేరు. ఆయన అనుభవం వేరు. అప్పట్లో ఢిల్లీలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉండేది. వైఎస్సార్ కి కేంద్ర నిధుల కొరత లేకుండా ఉండేది. మరో వైపు ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ ఆదాయం కూడా కలవడం వల్ల వైఎస్సార్ తాను తలచిందే తడవుగా హామీలు నెరవేర్చేవారు. ఆయనకు నిధుల లేమి అసలు సమస్య కానే కాదు, నమ్మిన బంటుల్లాంటి అనుభవం కలిగిన మంత్రులు అదనపు బలంగా ఉండేవారు.
జగన్ కి మైనస్సే ….
అదే జగన్ విషయం తీసుకుంటే అన్నీ మైనస్సులే. ముఖ్యంగా విభజన ఏపీకి జగన్ సీఎం అయ్యారు. నిధులే ఇపుడు అతి పెద్ద సమస్య. హైదరాబాద్ లాంటి సిటీ లేకపోవడం వల్ల ఖాళీ ఖజానా వెక్కిరిస్తోంది. ఇక కేంద్రంలో బీజేపీ ఉంది. ఆ పార్టీ సాయంపై ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మరో వైపు జగన్ కి పెద్దగా పాలనానుభవం లేదు. యువకుడు, ఉత్సాహవంతుడు కావడంతో అన్నింటినీ ఒకేసారి చేయాలనుకుంటున్నారు. హామీలన్నీ తీర్చాలన్న తపన కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. ఏపీ ఆర్ధిక పరిస్థితి తెలిసో తెలియకో ఇచ్చిన హామీలు ఇపుడు గుదిబండగా మారుతున్నాయి. జనం మాత్రం వైఎస్సార్ పాలన కావాలంటున్నారు. దానికి జగన్ కూడా రెడీనే, అయితే నిధులు లేకపోవడం వల్లనే జగన్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ ప్రజలకు అవి అనవసరం, రాజన్న బిడ్డ తండ్రిలా కాదు అని ఒక్కసారి అనేస్తే మాత్రం జగన్ మళ్ళీ ఆ పాపులారిటీ సాధించడం కష్టమే. అందుకే జగన్ కిందా మీదా పడుతున్నారు. చూడాలి మరి.