దాచేస్తున్నారు.. అయినా దోచేస్తున్నారు…?
దేశంలో ప్రజలకు , ప్రభుత్వానికి మధ్య టామ్ అండ్ జెర్రీ గేమ్ నడుస్తోంది. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ప్రజలు పెద్దగా విశ్వసించడం లేదు. వారు అందించే [more]
దేశంలో ప్రజలకు , ప్రభుత్వానికి మధ్య టామ్ అండ్ జెర్రీ గేమ్ నడుస్తోంది. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ప్రజలు పెద్దగా విశ్వసించడం లేదు. వారు అందించే [more]
దేశంలో ప్రజలకు , ప్రభుత్వానికి మధ్య టామ్ అండ్ జెర్రీ గేమ్ నడుస్తోంది. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ప్రజలు పెద్దగా విశ్వసించడం లేదు. వారు అందించే సాయం పూర్తిగా తమకు దక్కుతుందనీ భావించడం లేదు. పేద వర్గాల సంగతి పక్కన పెడితే మధ్యతరగతి ప్రజలు తమ ఏర్పాట్లు తాము చేసుకుంటున్నారు. గడచిన ఏడాది కాలంగా నగదు చెలామణి విపరీతంగా పెరిగినట్లు రిజర్వ్ బ్యాంకు అధ్యయనం వెల్లడిస్తోంది. బ్యాంకుల నుంచి తీసి మరీ ప్రజలు సొమ్మును ఇళ్లల్లో దాచుకుంటున్నారు. అదే సమయంలో ఆన్ లైన్ క్రయవిక్రయాలూ పెరిగాయి. ప్రజలు ఎంత జాగ్రత్తలు పాటిస్తున్నా, ప్రభుత్వాలు మాత్రం తమ వంతు పన్నుల రూపంలో యథేచ్ఛగా వడ్డనలు కొనసాగిస్తున్నాయి. అయితే విచిత్రమైన విషయం ఏమిటంటే కొనుగోళ్లకు కాకుండా ప్రజలు నగదును ముందు జాగ్రత్త గా ఇళ్లల్లో పెద్దమొత్తాల్లో ఉంచుకోవడం విశేషం. లాక్ డౌన్ లు, బ్యాంకుల పనివేళల్లో మార్పులు, వైద్యానికి ఆసుపత్రులు క్యాష్ డిమాండ్ చేయడం వంటి రకరకాల కారణాలతో క్యాష్ నిల్వలు ఇళ్లల్లో పెరుగుతున్నాయి. అయినప్పటికీ చాలా జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నారు. చెల్లింపులు ఆన్ లైన్ లో చేస్తూ తమ వద్ద ఉన్న డబ్బును భద్రంగా చూసుకుంటున్నారు. ప్రభుత్వ పన్నుల ఆదాయానికి ఢోకా ఉండటం లేదు.
ప్రజల జాగ్రత్త…
ఇంతటి తీవ్రమైన పరిస్థితిలో భారత్ ఎలా తట్టుకుంటోందనేది ప్రపంచ దేశాలకు అర్థం కావడం లేదు. ప్రపంచంలోని పెద్ద ఆర్థిక వ్యవస్థలన్నీ తలకిందులై పోయాయి. అక్కడ ప్రజలకు ప్రభుత్వాలే నేరుగా డబ్బులు చెల్లిస్తున్నా ఇంకా కుదుట పడలేదు. భారత్ లో ప్రభుత్వం నుంచి ప్రజలకు అందిన సాయం తూతూ మంత్రమే. అయినా దేశంలో అరాచక పరిస్థితులు ఏర్పడలేదు. దీనికి ప్రజల గొప్పతనమే కారణం. అమెరికా వంటి దేశంలో సబ్ ప్రైమ్ సంక్షోభం వంటివి ఏర్పడినప్పుడూ , ప్రపంచంలో ఆర్థిక మందగమనం వచ్చినప్పుడు సైతం భారత్ తనను తాను సంభాళించుకోగలిగింది. ప్రజల్లో ఉండే పొదుపు, ఇంకా పాశ్చాత్య దేశాల తరహాలో అప్పు చేసి పప్పు కూడు తరహా కన్స్యూమరిజం పెరగకపోవడమే ఇందుకు కారణం. ఆర్థిక వ్యవస్థను పెంచాలి. పన్నులు రాబట్టుకోవాలనే యావలో ప్రభుత్వమే ఒక రకంగా ప్రజలను తప్పుదారి పట్టించేందుకు చూస్తోంది. కన్స్యూమరిజం పెంచేందుకు తనవంతు ప్రయత్నిస్తోంది. కానీ ప్రజల్లో మధ్యతరగతి వర్గాలు కుటుంబాలు కుప్పకూలిపోకుండా తీసుకుంటున్న ముందస్తు పొదుపుతో విపత్కర సమయాల్లో బయటపడుతున్నారు.
ప్రభుత్వ దోపిడీ…
ప్రభుత్వాలను పోషించే ప్రజలు ఈ పరిస్థితుల్లోనూ ప్రభుత్వ ఖజానాను నింపుతున్నారు. పొదుపు సొమ్ముతో కుటుంబాలను గడుపుకుంటున్నా పన్నుల భారం మాత్రం తగ్గలేదు. నెలవారీ జీఎస్టీ పన్నుల వసూళ్లు దేశవ్యాప్తంగా లక్ష కోట్ల రూపాయలు యథావిధిగా వసూలు అవుతున్నాయి. ఇందులో ఎటువంటి మినహాయింపులు లేకుండా , మొహమాటాలకు పోకుండా ప్రభుత్వాలు ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. అదే విధంగా అధిక పన్నుల ద్వారాపెట్రోలియం ఉత్పత్తుల అమ్మకాల రూపంలోనూ, మద్యం అమ్మకాల రూపంలోనూ నెలవారీ మరో లక్ష కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాలకు చేరుతున్నాయి. నిన్నామొన్నటివరకూ వాక్సిన్ల వంటి అత్యవసర విషయాలపైనా కేంద్రం, రాష్ట్రాలు తగవులాడుకున్నాయి. ప్రజల పన్నులతో తిరిగి వారికి సేవలందించేందుకే కొట్టాడుకున్నాయి. అమెరికా వంటి పెట్టుబడి దారీ దేశంలోనూ ఈ రకమైన దురవస్థ లేదు. ప్రజల మీద ఆధారపడి బతుకుతున్న ప్రభుత్వ యంత్రాంగాలు తామేదో ధర్మానికి చేస్తున్నామనే భ్రమలో ఉండటము, తమ దయాదాక్షిణ్యాలపైనే ప్రజలు ఆధారపడ్డారనుకోవడం విచిత్రం.
గంపలాభం చిల్లు తీస్తే…
2016లో నోట్ల రద్దు తర్వాత ప్రజల ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. ప్రభుత్వ ఆర్థిక నిర్ణయాల పట్ల విశ్వాసం కోల్పోయారు. బ్లాక్ మనీ బయటికి వస్తుంది. ఆన్ లైన్ చెల్లింపులు పెరిగి, డిజిటల్ ఎకానమీ పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ రివర్స్ గేర్ లో సాగుతోంది. 2016లో నోట్ల రద్దు సమయానికి దాదాపు 20 లక్షల కోట్ల రూపాయల మేరకు నగదు చెలామణిలో ఉంది. కానీ తాజా అంచనాల ప్రకారం ఇది 30 లక్షల కోట్ల రూపాయల దరిదాపులకు చేరుకుంది. మొత్తం దేశ స్థూల జాతీయోత్పత్తిలో నగదు చెలామణి రికార్డు స్థాయిలో పదిహేను శాతం వరకూ విస్తరించింది. నోట్ల రద్దు సమయానికి ఇది 12 శాతం మాత్రమే ఉండేది. ఆన్ లైన్ చెల్లింపులు 50శాతం మేరకు పెరిగినప్పటికీ ప్రజలు డబ్బు నిల్వలను కూడా పెంచుకుంటున్నారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల తమకు ఇబ్బంది రాకుండా చేసుకునేందుకే ముందుజాగ్రత్తగానే ఇలా చేస్తున్నారని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. బ్లాక్ మనీ తగ్గిపోతుంది. ఇక దేశం మొత్తం డిజిటల్ ఎకానమీ విస్తరిస్తుందని ప్రభుత్వం పెట్టుకున్న భ్రమలు పటాపంచలైపోయాయి.
-ఎడిటోరియల్ డెస్క్