ఆధిపత్యం మళ్లీ ఆయనదేనా..?
తెలంగాణలో మరో ఎన్నికల సంగ్రామానికి రంగం సిద్ధమైంది. స్థానిక సంస్థల కోటాలో ఖాళీగా ఉన్న మూడు స్థానాల్లో ఉన ఎన్నికలకు పార్టీలు సిద్ధమయ్యాయి. 14వ తేదీకి నామినేషన్ల [more]
తెలంగాణలో మరో ఎన్నికల సంగ్రామానికి రంగం సిద్ధమైంది. స్థానిక సంస్థల కోటాలో ఖాళీగా ఉన్న మూడు స్థానాల్లో ఉన ఎన్నికలకు పార్టీలు సిద్ధమయ్యాయి. 14వ తేదీకి నామినేషన్ల [more]
తెలంగాణలో మరో ఎన్నికల సంగ్రామానికి రంగం సిద్ధమైంది. స్థానిక సంస్థల కోటాలో ఖాళీగా ఉన్న మూడు స్థానాల్లో ఉన ఎన్నికలకు పార్టీలు సిద్ధమయ్యాయి. 14వ తేదీకి నామినేషన్ల గడువు పూర్తవుతుండటంతో రెండు ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఖరారు చేశాయి. మొత్తం మూడు స్థానాలనూ దక్కించుకోవాలని అధికార టీఆర్ఎస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఇక, తమ స్థానమైన నల్గొండను తిరిగి దక్కించుకోవడంతో పాటు మిగతా రెండు స్థానాల్లోనూ గట్టి పోటీ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలగా ఉంది. దీంతో రెండు పార్టీలూ అన్ని లెక్కలను బేరీజు వేసుకొని బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నాయి. కాంగ్రెస్ మాత్రం ఎన్నికలు వాయిదా వేయాలని ఓ వైపు కోర్టు గడప తొక్కడంతో పాటు ఎన్నికలకు సైతం సిద్ధపడుతోంది.
టీఆర్ఎస్ అభ్యర్థుల ఖరారు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను ఖరారు చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తమిళనాడు పర్యటనకు విరామం ఇచ్చి మరీ హైదరాబాద్ వచ్చారు. మంత్రులు, ఆయా జిల్లాల ముఖ్య నేతలతో సంప్రదింపులు జరిపిన అనంతరం ఆయన మూడు స్థానాలకూ అభ్యర్థులను ఖరారు చేసి బీఫాంలు కూడా అందజేశారు. వరంగల్ నుంచి కేటీఆర్ కు సన్నిహితుడు, పార్టీలో ముఖ్యనేతగా ఎదిగిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని ఖరారు చేశారు. ఇక, ఎమ్మెల్యేగా గెలిచిన పట్నం నరేందర్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రంగారెడ్డి స్థానానికి ఆయన అన్న, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి పేరును ఖరారు చేశారు. కీలకమైన నల్గొండ స్థానానికి మొదట ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పేరు వినిపించినా చివరకు ఇంతకుముందు ఓడిన తేరా చిన్నపరెడ్డినే మళ్లీ బరిలో నిలిపారు.
బలమైన అభ్యర్థులను దింపుతున్న కాంగ్రెస్
కాంగ్రెస్ కూడా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు గట్టిగానే కసరత్తు చేసింది. అభ్యర్థుల ఎంపికపై జాగ్రత్త తీసుకుంది. నల్గొండ సీటు కోసం పటేల్ రమేశ్ రెడ్డితో పాటు మరికొందరు ఆశించినా చివరకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మీకి ఖరారు చేశారు. ఈ స్థానం నుంచి తేరా చిన్నపరెడ్డిపై ఇంతకుముందు అనూహ్యంగా రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. ఇప్పుడు ఎన్నికలు పాత ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతోనే జరుగుతుండటం, వారితో రాజగోపాల్ రెడ్డికి మంచి సంబంధాలు ఉండటంతో ఆయన భార్య అయితేనే గట్టి పోటీ ఇస్తుందనే ఉద్దేశ్యంతో ఆమెను నిలబెట్టారు. ఇక, వరంగల్ స్థానానికి కొండా మురళిని పోటీ చేయిద్దామని భావించినా ఆయన పోటీకి ఆసక్తి చూపించలేదు. దీంతో పరకాల అసెంబ్లీ టిక్కెట్ ఆశించి భంగపడ్డ ఇనగాల వెంకట్రామ్ రెడ్డికి టిక్కెట్ ఖరారు చేశారు. రంగారెడ్డి స్థానానికి మాజీ ఎమ్మెల్యేలు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డిల పేర్లను పరిశీలిస్తున్నారు. ఇక్కడ అభ్యర్థి ఎంపిక బాధ్యత ఎంపీ విశ్వేశ్వరరెడ్డికి అప్పగించింది పీసీసీ. మొత్తంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో రెండు పార్టీలూ బలమైన అభ్యర్థులనే నిలబెడుతుండటంతో ఆసక్తికర పోటీ నెలకొననుంది.