పల్లెలనూ పట్టేస్తున్నారు..!
అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో దూకుడు మీదున్న తెలంగాణ రాష్ట్ర సమితి పంచాయితీ ఎన్నికల్లోనూ దూసుకుపోతోంది. మూడు విడతల్లో జరుగుతున్న ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలను ఏకగ్రీవంగా దక్కించుకోవాలని [more]
అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో దూకుడు మీదున్న తెలంగాణ రాష్ట్ర సమితి పంచాయితీ ఎన్నికల్లోనూ దూసుకుపోతోంది. మూడు విడతల్లో జరుగుతున్న ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలను ఏకగ్రీవంగా దక్కించుకోవాలని [more]
అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో దూకుడు మీదున్న తెలంగాణ రాష్ట్ర సమితి పంచాయితీ ఎన్నికల్లోనూ దూసుకుపోతోంది. మూడు విడతల్లో జరుగుతున్న ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలను ఏకగ్రీవంగా దక్కించుకోవాలని ఆ పార్టీ కసరత్తు చేస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జిలు ఈ బాధ్యతలు తీసుకుని గ్రామాల్లో చర్చించి ఏకగ్రీవమయ్యేలా చూస్తున్నారు. ఇందుకోసం గ్రామాల్లోకి వెళ్లి అందరికీ ఆమోదయోగ్యుడైన టీఆర్ఎస్ కు చెందిన వారిని ఎంపిక చేసి నామినేషన్లు వేయిస్తున్నారు. వారికి పోటీ లేకుండా చూసుకుంటున్నారు. మూడు విడతల్లో జరుగుతున్న ఎన్నికల్లో మొదటి విడతలోనే 600కి పైగా గ్రామ పంచాయితీలను టీఆర్ఎస్ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కేవలం 40 స్థానాలను మాత్రమే ఏకగ్రీవంగా దక్కించుకుంది.
బుజ్జగిస్తే ఓకే… భయపెడితే…
సాధ్యమైనన్ని గ్రామ పంచాయితీలను ఏకగ్రీవంగా కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గ్రామాల్లో నేతలను బుజ్జగిస్తున్నారు. ఏకగ్రీవంగా సర్పంచ్ లను ఎన్నుకుంటే ప్రభుత్వం తరపున గ్రామానికి వచ్చే ప్రోత్సాహకంతో పాటు సదరు పంచాయితీ అభివృద్ధి బాధ్యత పూర్తిగా మాదే అని ఎమ్మెల్యేలు ప్రజలకు అభయమిస్తున్నారు. ఇక, టీఆర్ఎస్ లోనే ఇద్దరు ముగ్గురు సర్పించ్ పదవిని ఆశిస్తుంటే వారికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ టిక్కెట్లు ఇస్తామంటూ నచ్చజెపుతూ ఏకగ్రీవమయ్యేలా చూస్తున్నారు. అయితే, ఇలా ఎమ్మెల్యే గ్రామాల్లో తిరుగుతూ ప్రజలకు నచ్చజెప్పి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చూస్తే ఎటువంటి సమస్య లేదు కానీ కొన్ని చోట్ల టీఆర్ఎస్ నేతలు కొంత బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వాయిస్ రికార్డులు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పలుకుబడి పెరగాలన్నా… ఖర్చు తగ్గాలన్నా
ఇక, గ్రామ పంచాయితీలను ఏకగ్రీవంగా కైవసం చేసుకోవడం వెనుక పార్టీ అధిష్ఠానం వద్ద తమ బలాన్ని చాటుకోవడం ఒక కారణమైతే, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఖర్చు విషయంలోనూ భయపడుతున్నారట. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బంతా ఊడ్చి ఖర్చు పెట్టారు. పైగా మూడు నెలల పాటు టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారాం నిర్వహించాల్సి రావడంతో ఇతర పార్టీల కంటే చాలా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. గ్రామ పంచాయితీ ఎన్నికలు ఎమ్మెల్యేలకు సంబంధం లేకున్నా… ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీ గ్రామ స్థాయి నేతలకు ఆర్థికంగా కొంత సహకారం అందించాల్సి వస్తుంది. దీంతో ఈ పరేషన్ ఏమీ లేకుండా ఏకగ్రీవానికి ప్రయత్నిస్తే మేలనే భావనలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. గ్రామస్థులు సైతం ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా వెళ్లడం ఎందుకులే అనే ఉద్దేశ్యంతో ఏకగ్రీవానికి అంగీకరిస్తున్నారు. ఇతర పార్టీల నేతలు సైతం బలంగా ఉన్న చోట్ల మాత్రం టీఆర్ఎస్ ఏకగ్రీవంగా దక్కించుకోలేకపోతోంది. మొదటి విడత ఎన్నికల్లో సుమారు 15 శాతం పంచాయితీలను ఇప్పటికే టీఆర్ఎస్ ఏకగ్రీవంగా దక్కించుకోగా ఇప్పుడు మరో రెండు విడతల్లోనూ ఇదే ఫార్ములా పాటిస్తోంది.