‘షా’క్ శక్యమేనా..?
భారత రాజకీయాల్లో చాణక్యుడిని రాజకీయ, ఆర్థిక పితామహుడిగా చెబుతుంటారు. భారతీయ జనతాపార్టీకి సంబంధించిన నవశకంలో అంతటి దిట్టగా అమిత్ షా ను పేర్కొంటూ ఉంటారు ఆపార్టీ నేతలు. [more]
భారత రాజకీయాల్లో చాణక్యుడిని రాజకీయ, ఆర్థిక పితామహుడిగా చెబుతుంటారు. భారతీయ జనతాపార్టీకి సంబంధించిన నవశకంలో అంతటి దిట్టగా అమిత్ షా ను పేర్కొంటూ ఉంటారు ఆపార్టీ నేతలు. [more]
భారత రాజకీయాల్లో చాణక్యుడిని రాజకీయ, ఆర్థిక పితామహుడిగా చెబుతుంటారు. భారతీయ జనతాపార్టీకి సంబంధించిన నవశకంలో అంతటి దిట్టగా అమిత్ షా ను పేర్కొంటూ ఉంటారు ఆపార్టీ నేతలు. భారత యుద్దం చేసింది అర్జునుడే. కానీ నడిపింది కృష్ణుడు. మోడీ, షా లను అలా పోల్చడం అతిశయోక్తి కావచ్చు. కానీ పార్టీకి సంబంధించిన భారమంతా అమిత్ షా నే భరిస్తున్నారు. నద్దా వంటి వారు పేరుకే అధ్యక్షులు. అంతా అగ్రనాయక ద్వయం చేతిలోనే నడుస్తోంది. తాజాగా తమిళనాట చోటు చేసుకున్న పరిణామాల్లో అమిత్ షా పాత్రపై చర్చ నడుస్తోంది. ఏఐఏడీఎంకేను ఏదో రకంగా గట్టెక్కించాలనేది అమిత్ షా తాపత్రయం. పరిస్థితులు ప్రతికూలంగా ఉండటం తో ఆయన ఎటువంటి వ్యూహరచన సాగిస్తారని అంతా ఎదురు చూస్తున్నారు. ప్రతి సందర్భంలోనూ రాజకీయ ఎత్తుగడలు సత్ఫలితాలనే ఇస్తాయని చెప్పలేం. ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఎంత పెద్ద నాయకులైనా పరాజయాలనే చవి చూశారు. అయితే వ్యూహాల్లో నైపుణ్యం ఆయా నేతల చాకచక్యానికి దర్పణం పడుతుంది. తమిళనాట శశికళ రంగంలోంచి తప్పుకోవడం లో అమిత్ షా చూపిన నేర్పు మాత్రం కచ్చితంగా గమనించదగిన పరిణామమే.
అంతర్గత విభేదాలకు చెక్..
అన్నాడీఎంకే పదేళ్ల పాలన తర్వాత ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. 2016 లో జయలలిత సారథ్యంలోనే పార్టీ పరాజయం పాలవుతుందని అందరూ అంచనా వేశారు. కానీ ప్రజాదరణ పథకాలు, జయలలిత పొలిటికల్ గ్లామర్ అతి కష్టం మీద పార్టీని గట్టెక్కించాయి. ప్రస్తుతం పరిపాలన బాగానే ఉన్నప్పటికీ ప్రజాదరణ కల నాయకుడు లేరు. దాంతో ఏఐఏడీఎంకే ఓటమి ఖాయమని అందరూ చెప్పేస్తున్నారు. పైపెచ్చు శశికళ పార్టీలో చిచ్చు పెడతారని భావించారు. దీంతో అన్నాడీఎంకేకు మొదటికే మోసం రావడమే కాదు, ఘోర పరాజయం పాలు కావచ్చని రాజకీయ పండితులు తేల్చి చెప్పేశారు. ఈనేపథ్యంలో రంగ ప్రవేశం చేసిన అమిత్ షా చాలా వరకూ రెండు వర్గాలను కలపాలనే చూశారు. కానీ పని కాలేదు. శశి కళ కంట్రోల్ లోకి పార్టీ వెళ్లిపోతుందని ముఖ్యమంత్రి పళని స్వామి భీష్మించారు. బీజేపీకి సైతం ఆమె పై అనుమానాలున్నాయి. దీంతో కేసులు, ఆస్తుల గొడవ తో పరోక్షంగా ఆమెను మొత్తం రాజకీయ రంగం నుంచే తప్పించేశారు. అమిత్ షా మొదటి స్టెప్ తో అన్నాడీఎంకే లుకలుకలకు క్లియరెన్స్ లభించింది.
కమలం కలలు కల్లలు..
రజనీ కాంత్ రంగంలోకి దిగితే కనీసం 20 శాతం ఓట్లు తెచ్చుకుని 65 శాసనసభ స్థానాలను చేజిక్కించుకుంటారని కమలనాథులు తొలుత భావించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు తీవ్రంగా చీలితే అన్నాడీఏంకే పుంజుకుంటుంది. డీఎంకేతో పోటీ పడి దీటుగా సీట్లు సాధిస్తుందనుకున్నారు. హంగ్ వాతావరణం ఏర్పడితే రజనీకాంత్ సహాయంతో అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని తిరిగి నెలకొల్పుకోవచ్చనుకున్నారు. ఒకవేళ రజనీ ప్రభావం బలంగా వీస్తే అన్నాడీఎంకే కూటమి మద్దతుతో రజనీనే ముఖ్యమంత్రిని చేయవచ్చని కూడా దూరాలోచన చేశారు. కానీ రాజకీయ ఆటుపోట్లను తట్టుకొనేంతటి మానసిక స్థైర్యం లేకపోవడంతో యుద్ధం ప్రారంభించకముందే రజనీ చేతులెత్తేశారు. బీజేపీ ఎన్నిరకాలుగా ప్రయత్నించినా తన వల్లకాదని తేల్చేశారు. దీంతో కమలం పార్టీ కలలు కల్లలైపోయాయి. తలైవా తన అభిమానులతో చివరి క్షణంలో అన్నాడీఎంకే కూటమికి మద్దతు ఇస్తారనే ఆశలు మాత్రం ఇంకా మిగిలే ఉన్నాయి.
కూటముల కూర్పులో…
తమిళనాడు ఎన్నికలు రాష్ట్రంలో కొత్త రాజకీయాన్ని ఆవిష్కరించడం లేదు. కానీ వారసత్వాన్ని స్థిరపరచబోతున్నాయి. డీఎంకే విజయం అప్రతిహతమైతే స్టాలిన్ తమిళనాడులో తిరుగులేని నేతగా ఎదుగుతారు. అన్నాడీఎంకే భవిష్యత్తులో క్రమేపీ తన ప్రధాన పాత్రను కోల్పోయే అవకాశం ఉందంటున్నారు పొలిటికల్ పండితులు. ఒకవేళ ఇంతటి ఎదురీతలోనూ అన్నాడీఎంకే ఘన విజయం సాధిస్తే డీఎంకేను ముందుకు నడపటం ఇకపై స్టాలిన్ కు సాధ్యం కాకపోవచ్చునంటున్నారు. పార్టీలో వారసత్వ పోరు మొదలవుతుంది. రెండు కూటముల్లోనూ సీట్ల పై రాద్ధాంతాలు, పేచీలు కొనసాగుతున్నాయి. కాంగ్రెసు, డీపీఐ, సీపీఐ, సీపీఎం, ఐయూఎంఎల్, మణిదనేయ మక్కల్ కట్చి వంటి ప్రదాన పార్టీలతో కూడిన డీఎంకే కూటమి, బీజేపీ, డీఎండీకే, పీఎంకే, టీఎంసీ లతో కూడిన అన్నాడీఎంకే కూటమి ముఖాముఖిలో పోరు రసవత్తరంగానే ఉండబోతోంది. దక్షిణాదిన సైద్ధాంతికంగా విభేదిస్తున్న తమిళనాడులో బీజేపీ కనీస పట్టు సాధించగలుగుతుందో, లేదో కూడా ఈ ఎన్నికలు తేల్చేయబోతున్నాయి. ఈ విషయంలోనూ అమిత్ షా చకాచకా లెక్కలు వేసుకుంటున్నారట.
– ఎడిటోరియల్ డెస్క్