తప్పెవరిది…?
ఆంధ్రప్రదేశ్ శాసనసభా వేదికగా పలువురు కీలక నేతలు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల వెనకబాటుతనంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. చట్టసభలో ఇటువంటి ప్రస్తావన రావడం హర్షణీయమే. ప్రభుత్వం మేలుకొని దిద్దుబాటు [more]
ఆంధ్రప్రదేశ్ శాసనసభా వేదికగా పలువురు కీలక నేతలు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల వెనకబాటుతనంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. చట్టసభలో ఇటువంటి ప్రస్తావన రావడం హర్షణీయమే. ప్రభుత్వం మేలుకొని దిద్దుబాటు [more]
ఆంధ్రప్రదేశ్ శాసనసభా వేదికగా పలువురు కీలక నేతలు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల వెనకబాటుతనంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. చట్టసభలో ఇటువంటి ప్రస్తావన రావడం హర్షణీయమే. ప్రభుత్వం మేలుకొని దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి, సమతుల్యాభివృద్ధికి దోహదం చేస్తుంది. అయితే గడచిన మూడు దశాబ్దాలుగా ప్రభుత్వంలో ఉన్నత హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించిన వారే ఈ అంశాన్ని లేవనెత్తడం విశేషం. మానవ వనరులు, సహజవనరులు సమృద్ధిగా ఉన్న ఉత్తరాంధ్ర వంటి ప్రాంతాలు సమగ్ర ప్రగతికి నోచుకోకపోవడానికి రాజకీయ నాయకత్వానికి బాధ్యత లేదా? అనేదే ప్రశ్న. తమ తమ ప్రాంతాల వెనకబాటు తనంలో నాయకుల నిర్లక్ష్యం, ఉదాసీనతలను తోసిపుచ్చలేం.
గాలివాటం రాజకీయాలు..
ఎదుటివారికి చెప్పేందుకే నీతులన్న సామెత అన్ని రాజకీయ పార్టీలకూ వర్తిస్తుంది. ఈ విషయంలో గురివిందలనే తలపిస్తుంటారు నేతలు. మాటల విన్యాసంలో ప్రజలనూ బురిడీ కొట్టించాలని చూస్తుంటారు. దీర్ఘకాలం అధికారంలో భాగస్వాములైనవారు సైతం అన్ని సమస్యలకు ఎదుటి పార్టీదే బాధ్యత అన్నట్లుగా వేలెత్తి చూపుతుంటారు. గడచిన మూడున్నర దశాబ్దాల్లో రాష్ట్రంలో దీర్ఘకాలం అధికారంలో ఉన్నపార్టీ తెలుగుదేశం. తర్వాత స్థానం కాంగ్రెసుది. విభజిత ఆంధ్రప్రదేశ్ లో తాజాగా వైసీపీ పవర్ పగ్గాలు చేపట్టింది. పవర్ లోకి వచ్చే పార్టీలు మారుతున్నాయి తప్పితే నాయకులు మాత్రం వారే ఉంటున్నారు. రాజకీయాల గాలిని, ప్రజల నాడిని కనిపెట్టి నాయకులు సానుకూలమైన పార్టీలను ఎంచుకుంటున్నారు. అందుకే ఏ పార్టీలో ఎవరు ? ఎప్పుడుంటారో చెప్పలేని పరిస్థితి. ప్రత్యర్థి పార్టీల తరఫున నిన్నామొన్నటి వరకూ తిట్టుకున్న నాయకులే అవకాశాలను అందిపుచ్చుకుని పరస్పరం అధికారంలో భాగస్వాము లవుతుంటారు. అయితే ఏ పార్టీలో ఉన్నప్పటికీ అధికారం, ప్రతిపక్షం అన్న తేడా లేకుండా తమ ప్రాంత సమగ్రాభివ్రుద్ధికి కృషి చేయడం నాయకుల బాధ్యత. పార్టీలు మారినా, పోరాటాలు చేసినా, ఆందోళనలు చేసినా తమ ప్రాంతాల ఇంటరెస్టులు కాపాడుకోవాలి. అప్పుడే ప్రజానాయకులు అన్న పేరుకు సార్థకత.
నేతలూ బాధ్యులే…
ప్రస్తుతం శాసనసభ అధ్యక్ష స్థానంలో ఉన్న తమ్మినేని సీతారాం రాష్ట్రంలోనే సీనియర్ నాయకుల్లో ఒకరు. 1983 నుంచి రాజకీయాల్లో క్రియాశీల పాత్రలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీకాకుళం జిల్లా నుంచి అయిదుసార్లు శాసనసభకు ఎన్నిక కావడమే కాకుండా తొమ్మిది సంవత్సరాలపాటు మంత్రిగా పనిచేశారు. 18 శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. ప్రభుత్వ విప్ గానూ అయిదేళ్లు పనిచేశారు. అలాగే ధర్మానప్రసాదరావు ఇదే జిల్లా నుంచి అయిదు సార్లు శాసనసభలో అడుగుపెట్టారు. కోట్లవిజయభాస్కరరెడ్డి, నేదురుమల్లి జనార్దనరెడ్డి ల హయాంలోనే మంత్రిగా పనిచేశారు. వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో రెవిన్యూ శాఖ మంత్రిగా అత్యంతకీలకంగా వ్యవహరించారు. విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ రెండు దశాబ్దాలుగా చాలా ముఖ్యమైన పాత్రనే పోషించారు. 2004 నుంచి పదేళ్లపాటు ప్రభుత్వంలో పరిశ్రమలు, రవాణా, మార్కెటింగ్, పంచాయతీ రాజ్ వంటి శాఖలను నిర్వహించారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడిగానూ అత్యంత క్లిష్టమైన సమయంలో పనిచేశారు. వీరంతా కూడా ప్రభుత్వంపై ప్రభావం చూపి తమ ప్రాంతం అభివృద్ధికి బాటలు వేసుకోగల స్థాయిలోనే అధికారాలు చెలాయించారు. అయినప్పటికీ ఉత్తరాంధ్ర ఇంకా వెనకబాటు తనాన్నే చవి చూస్తోంది. శాసనసభ చర్చల్లో రాజకీయాంశంగానే మిగులుతోంది. ఆయా నాయకులు ఈ వెనకబాటు తనంలో తమ వంతు బాధ్యతను అంగీకరించకపోవడమే అసలు సమస్య.
ఉసూరుమంటున్న ఉత్తరాంధ్ర…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు చాలా వెనకబడి ఉన్నాయంటూ సభ్యులు వివిధ సందర్బాల్లో ఆయానేతలు సభ దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఆ అంశాన్ని రాజకీయకోణంలోనే సభలో చర్చకు తేవడం శోచనీయం. తెలుగుదేశం , కాంగ్రెసు ప్రభుత్వాల హయాంలో శాసనసభ్యులుగా, మంత్రులుగా కీలకభూమికలు పోషించిన నేతలే ఉదాహరించడం విశేషం. రాయలసీమ విషయానికొస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత అత్యధిక కాలం ముఖ్యమంత్రులుగా, పవర్ పుల్ రాజకీయనేతలుగా పనిచేసిన వారు సీమ ప్రాంతానికి చెందినవారే. రాష్ట్రంలో తీవ్రంగా వెనకబడిన మరో ప్రాంతం ఉత్తరాంధ్ర. సహజ వనరుల విషయంలో ఈ ప్రాంతం అద్వితీయమైనది. మానవవనరులు, ప్రకృతి సంపద పుష్కలంగా ఉంది. అయినప్పటికీ అక్కడ పారిశ్రామికీకరణ, ఉపాధి కల్పన సక్రమంగా సాగలేదు.
అంతా వలసకూలీలే….
హైదరాబాదు, చెన్నై, విజయవాడ ప్రాంతాల్లో ఏ నిర్మాణం , ప్రాజెక్టు వద్ద చూసినా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల వలస కూలీలే కనిపిస్తారు. తమ సొంత ప్రాంతాల్లో జీవనమార్గంలేకనే లేకనే వారు కూలీలుగా మారి పొట్ట చేత పట్టుకుని పొరుగు ప్రాంతాలకు పోతున్నారు. రాష్ట్రమంతా ఒక దిశలో అభివృద్ది వైపు అడుగులు వేస్తుంటే తలసరి ఆదాయంలో, జీవన ప్రమాణాల్లో కనిష్ఠస్థితిలో ఉంటున్నాయి ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు. పార్టీ ఏదైనప్పటికీ నాయకులు తమ ప్రాంతం అభివ్రుద్ధికి కృషి చేయడమే లక్ష్యంగా పనిచేయాలి. అప్పుడే ప్రజాజీవితంలో తమదైన ముద్ర వేయగలుగుతారు. చరిత్రలో శాశ్వతంగా మిగులుతారు. లేకపోతే ఎంతటి పెద్ద పదవులు నిర్వర్తించినా మరుగునపడిపోయే ప్రమాదం ఉంటుంది.
– ఎడిటోరియల్ డెస్క్