కక్కలేక…మింగలేక…?
కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై హోరా హోరీగా తలపడిన నాయకుడు వైసీపీకి చెందిన వసంత కృష్ణప్రసాద్. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఎవరూ [more]
కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై హోరా హోరీగా తలపడిన నాయకుడు వైసీపీకి చెందిన వసంత కృష్ణప్రసాద్. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఎవరూ [more]
కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై హోరా హోరీగా తలపడిన నాయకుడు వైసీపీకి చెందిన వసంత కృష్ణప్రసాద్. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఎవరూ ఊహించని రీతిలో ఉమాకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడైన కృష్ణప్రసాద్ ఎన్నికలకు ఆరు మాసాల ముందు వరకు టీడీపీలో ఉన్న విషయం తెలిసిందే. అయితే, తనకు కృష్ణా జిల్లాలోని ఏదో ఒక అసెంబ్లీ టికెట్ కావాలని అధిష్టానాన్ని కోరడం, చంద్రబాబు ఈ విషయంలో నాన్చుడు ధోరణి అవలంబించడంతో ఆయన పార్టీ జంప్ చేసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
దేవినేనిపై అసంతృప్తితో….
వసంత రాకతో కృష్ణా వైసీపీలోనూ ముఖ్యంగా కమ్మ సామాజికవర్గంలో ఎక్కడా లేని ఉత్సాహం వచ్చింది. ఇక, ఎన్నికలకు ముందు అప్పటి అధికార పార్టీ టీడీపీ నుంచి అనేక ఆరోపణలు, కేసులు కూడా కృష్ణ ప్రసాద్ ఎదుర్కొన్నారు. అయినా అన్నింటికీ ఎదురొడ్డి పోటీ చేసి విజయం సాధించారు. దేవినేని, వసంతలు ఒకే సామాజిక వర్గం కావడంతో దేవినేనిని వ్యతిరేకించిన కమ్మ నాయకులు అందరూ వసంతకు జై కొట్టారు. ఇక, గెలుపు అనంతరం జగన్‌తో ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో కేబినెట్లో సీటు కోసం ప్రయత్నాలు చేశారు.
రాజధాని రగడతో….
అయితే, ఇదే జిల్లా నుంచి పార్టీలో సీనియర్‌గా ఉన్న కొడాలి నానిని తీసుకోవడంతో వసంత ప్రయత్నాలకు బ్రేకులు పడ్డాయి. దీంతో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడంతోనే వసంత పరిమితమయ్యారు. అయితే, ప్రస్తుతం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజుకున్న రాజధాని రగడ విషయంలో వసంతపై ఒత్తిడి పెరుగుతోంది. తన నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో తనకు మద్దతిచ్చిన, తనకు అండగా నిలిచిన కమ్మ సామాజిక వర్గం. రాజధానిని అమరావతిలోనే కోరుకుంటోంది. కమ్మ సామాజికవర్గమే కాదు రాజధాని మార్పు వ్యవహారం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చాలా మందిలో అసంతృప్తి కలిగిస్తోంది.
పెరుగుతున్న వత్తిడి…..
జగన్ మాత్రం మూడు రాజధానుల నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు. గతంలో దేవినేనిని వ్యతిరేకించి వచ్చిన వర్గం ఇప్పుడు వసంతపై ఒత్తిడి పెంచుతోంది. మీ అధినేతను ఎలాగైనా ఒప్పించి.. రాజధానిని ఇక్కడే ఉంచేలా చూడాలని వారు కోరుతున్నారు. దీంతో ఒకపక్క, తనను గెలిపించేందుకు కృషి చేసిన తన సొంత సామాజిక వర్గం, మరోపక్క పార్టీ అధినేత జగన్ దూకుడు ఈ రెండు వర్గాలతో వసంత సతమతమవుతున్నారు. వాస్తవానికి తనకు కూడా రాజధాని అమరావతిలోనే ఉండాలని ఉందన్నది ఆయన మనసులోని మాట.
సమాధానం చెప్పలేక…
ఇటీవల నియోజకవర్గంలో జరిగిన ఓ సమావేశంలోనూ వసంత ఇదే విషయాన్ని వెల్లడించారు. అయితే, పార్టీలైన్‌ను తాను తప్పలేనని, పైగా జగన్ తనకు ఎంతో కీలక దిశానిర్దేశకుడని స్వామి భక్తి చాటుకుంటూనే, ఇక్కడి కమ్మ సామాజిక వర్గానికి, తన నియోజకవర్గంలో ప్రజల నుంచి రాజధాని విషయంలో వస్తోన్న వ్యతిరేకతను తగ్గించేలా వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని లెజిస్టేటివ్ కార్యకలాపాలన్నీ ఇక్కడ నుంచే జరుగుతాయని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో అప్పటికి అందరినీ మౌఖికంగా ఒప్పుకొన్నా., తర్వాత మాత్రం వసంతపై గుస్సాగానే ఉన్నారని తెలుస్తోంది. మరి ఈ ఎఫెక్ట్ ఎంత దూరం వెళ్తుందో చూడాలి.