టీడీపీ నేతకు ఇక ఎదురు లేదట.. రిలాక్స్ అయినట్లేనట
విశాఖ అర్బన్ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ వాసుపల్లి గణేష్ కుమార్ పూర్వాశ్రమంలో అంటే రాజకీయాల్లోకి రాకముందు ఆర్మీలో ఉద్యోగి. ఆయన ఆ తరువాత కాలంలో సేవా కార్యక్రమాలు [more]
విశాఖ అర్బన్ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ వాసుపల్లి గణేష్ కుమార్ పూర్వాశ్రమంలో అంటే రాజకీయాల్లోకి రాకముందు ఆర్మీలో ఉద్యోగి. ఆయన ఆ తరువాత కాలంలో సేవా కార్యక్రమాలు [more]
విశాఖ అర్బన్ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ వాసుపల్లి గణేష్ కుమార్ పూర్వాశ్రమంలో అంటే రాజకీయాల్లోకి రాకముందు ఆర్మీలో ఉద్యోగి. ఆయన ఆ తరువాత కాలంలో సేవా కార్యక్రమాలు చేపడుతూ 2009 ఎన్నికల నాటికి టీడీపీలో చేరి విశాఖ సౌత్ నుంచి పోటీ చేశారు. తొలిసారి ఓటమి ఆయనకు ఎదురైంది. కాంగ్రెస్ నుంచి ద్రోణంరాజు శ్రీనివాస్ గెలిచారు. ఆయనకు సొంతంగా ఉన్న పేరుతో పాటు, సామాజికవర్గం సహకారం, అన్నింటికీ మించి వైఎస్సార్ ప్రభంజనం అన్నీ కలసి వాసుపల్లిని ఓటమి రుచి చూపించాయి. అక్కడే వాసుపల్లి గణేష్ కుమార్ లోని నాయకుడు బయటపడ్డాడు. తనను ఓడించిన చోటనే అయిదేళ్ళ పాటు జనంలో ఉంటూ పనిచేశాడు. దాంతో 2014 ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా తొలిసారి విజయబావుటా ఎగరేశాడు.
అవే ప్లస్ పాయింట్లు….
వాసుపల్లి గణేష్ కుమార్ సామాజికవర్గం అయిన మత్స్య కారులు విశాఖ సౌత్ లో పుష్కలంగా ఉన్నారు. దాంతో వారి అండదండలతో పాటు, ఆయన సొంతంగా సేవా కార్యక్రమాల ద్వారా పెంచుకున్న జనం, టీడీపీ ట్రెడిషనల్ ఓటు బ్యాంక్ అన్నీ కలసి 2019 ఎన్నికల నాటికి మరోమారు గెలిచేలా చేశాయి. జనంతో కలసిపోవడం, వారిని కష్టాలలో తనకు చేతనైనంతంగా ఆదుకోవడం వంటివి వాసుపల్లి గణేష్ కుమార్ ను జనం మనిషిగా చేశాయి. ఆయన నిరంతరం ప్రజలలో ఉండడం అతిపెద్ద ప్లస్ పాయింట్.
వారే వెళ్ళారు….
ఇక వాసుపల్లి గణేష్ కుమార్ కు సొంత పార్టీలోనే యాంటీ గ్రూపులు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మైనారిటీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్ ఎ రహమాన్ పార్టీలోనే ఉంటూ వాసుపల్లి గణేష్ కుమార్ గెలుపునకు బ్రేకులు వేశాడని ఆయనతో పాటు అనుచరులు గట్టిగా నమ్ముతూ వచ్చారు. ఆయన మీద ఫిర్యాదులు కూడా చేశారు. ఇక మరో ముస్లిం నేత జహీర్ అహ్మద్ కూడా వాసుపల్లి గణేష్ కుమార్ గెలుపు కోసం సహాయం చేయలేదని, పార్టీ విజయానికి సహకరించలేదని కూడా ఆయన వర్గం అంటోంది. ఇపుడు వారిద్దరూ వైసీపీలో చేరిపోయారు. దాంతో వాసుపల్లి గణేష్ కుమార్ బాగా రిలాక్స్ అయ్యారని చెబుతున్నారు. సొంత పార్టీలో శత్రువులతో పోరాడడం కష్టమని, వారు బయటకు వెళ్తే నేరుగా ఎదిరించడం సులువు అని ఆయన వర్గం అంటోంది.
ఆయనే కింగ్….
ఇక 2024 ఎన్నికల నాటికి మళ్ళీ టికెట్ వాసుపల్లి గణేష్ కుమార్ కే ఖాయమని అంటున్నారు. ఆయన జనంలో వేసుకున్న బలమైన పునాదితో పాటు, ఆప్షనల్ గా పెద్ద లీడర్లు లేకపోవడంతో ఆయనకే టికెట్ అంటున్నారు. ఇపుడు పార్టీ అంతా వాసుపల్లి గణేష్ కుమార్ వెంట ఉంది. ఆయనకు తన బలం, బలహీనత మీద మంచి అవగాహన ఉన్నాయి. దాంతో ముందుగా లోకల్ బాడీ ఎన్నికల్లో మెజారిటీ వార్డులను టీడీపీ పరం చేయడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఆ విజయంతో 2024 నాటికి బంపర్ మెజారిటీతో తాను గెలవడానికి బాటలు వేసుకుంటున్నారు. మొత్తానికి చూస్తే వాసుపల్లి గణేష్ కుమార్ కి పార్టీలో పరిణామాలు ఒక్కసారిగా అనుకూలంగా మారిపోయాయని అంటున్నారు.