సాయిరెడ్డికి జగన్ క్లాస్… ఫోన్లోనే వాయించేశారా?
వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ విజయసాయిరెడ్డికి ముఖ్యమంత్రి జగన్ క్లాస్ ఇచ్చారా ? ఫోన్ చేసి మరీ వాయించేశారా ? ప్రస్తుతం వైసీపీ నేతల్లో ఇదే హాట్ [more]
వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ విజయసాయిరెడ్డికి ముఖ్యమంత్రి జగన్ క్లాస్ ఇచ్చారా ? ఫోన్ చేసి మరీ వాయించేశారా ? ప్రస్తుతం వైసీపీ నేతల్లో ఇదే హాట్ [more]
వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ విజయసాయిరెడ్డికి ముఖ్యమంత్రి జగన్ క్లాస్ ఇచ్చారా ? ఫోన్ చేసి మరీ వాయించేశారా ? ప్రస్తుతం వైసీపీ నేతల్లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక నేపథ్యంలో విజయసాయిరెడ్డి చేసిన పనికి సీఎం జగన్ వెంటనే రియాక్ట్ అయ్యారని సీనియర్లు అంటున్నారు. తిరుపతి పార్లమెంటు ఉప పోరులో వైసీపీని గెలిపించేందుకు వ్యూహాలు వేయాల్సిన విజయసాయిరెడ్డి అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారనేది ప్రధాన ఆరోపణగా చెబుతున్నారు. 'మా నాయకుడు ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నారు' అని వైసీపీ ముఖ్య నేతలు చర్చించుకుంటున్నారు.
బీజేపీపై ట్వీట్ చేయడంతో…..
ఇంతకీ విషయం ఏంటంటే.. రోజూ ఏదో ఒక విషయం.. ఏదో ఒక పార్టీపై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసే విజయసాయిరెడ్డి ఇటీవల బీజేపీపై విమర్శలు చేశారు. ‘‘తిరుపతి ఉప ఎన్నికల ముందు మీరు వేస్తున్న డ్రామాలకు జనం నవ్వుకుంటున్నారు. ఉప ఎన్నికల్లో డిపాజిట్లు వస్తే చాలు మన వాడు సీఎం అయిపోతాడన్నట్లు నటిస్తున్నారు. ఎవరి పాత్రల్లో వారు జీవించండి.. చెవిలో క్యాబేజీ పూలు పెట్టండి. జనం మాత్రం మళ్లీ వైసీపీనే దీవిస్తారు’’ అని పేర్కొన్నారు. అయితే.. దీనికి బీజేపీ కూడా అంతే సీరియస్‌గా రియాక్ట్ అయింది. ‘‘మా ఊసు ఎందుకులే.. కోర్టులకు చెవులో పువ్వులు పెడుతూ బయట మేకపోతు గాంభీర్యంతో తిరుగుతున్నా.. లోపల గోళ్లు కొరుక్కుంటున్నారంటగా అలీబాబా నలభై దొంగలంతా’’ అంటూ బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు సెటైర్ వేశారు.
ముందు ముందు ఇలాంటివి….
ఇది రాజకీయ దుమారానికి దారితీసింది. అయితే.. సాధారణ పరిస్థితిలో విజయసాయిరెడ్డి ఏం చేసినా.. జగన్ ఏమీ అనేవారు కాదు. అందుకే ఆయన ట్విట్టర్ వేదికగా నేతలు,పార్టీలపై కూడా తీవ్ర వివాదాస్పద, విమర్శలు చేశారు. కానీ, ఇప్పుడు సమయం కాని సమయంలో .. బీజేపీని కెలకడం.. ఎదురు అనిపించుకోవడంపై పార్టీ సీనియర్లు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.. ఇక, ఇదే విషయంపై సీఎం జగన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ..ఏకంగా విజయసాయిరెడ్డికి ఫోన్ చేసి.. ఇకముందు ఇలాంటావి చేయొద్దంటూ ఘాటుగానే చెప్పారని సీనియర్లు గుసగుసలాడుతున్నారు.
ఆయుధాలు అందించవద్దంటూ…..
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం తర్వాత కేంద్రంపై మరీ అంత దూకుడుగా వెళ్లేందుకు జగన్ ఇష్టపడడం లేదు. వైసీపీ నేతలు బీజేపీపై విమర్శలు చేస్తే బీజేపీ ఘాటుగా కౌంటర్లు ఇస్తోంది. ఇలా బీజేపీని కెలుక్కోవడం జగన్‌కు ఎంత మాత్రం ఇష్టంలేదన్నట్టుగానే ఉంది. ప్రస్తుతం అందరూ తిరుపతిలో భారీ మెజారిటీపైనే దృష్టి పెట్టాలని.. ఈ క్రమంలో పొరుగు పార్టీలకు ఆయుధాలు అందించి.. మనకు మైనస్ చేసుకోవడం సరికాదని.. కూడా జగన్ చెప్పినట్టు సమాచారం. ఇదే విషయంపై సీనియర్లు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తుండడం గమనార్హం. మరి విజయసాయిరెడ్డి ఇప్పటికైనా సెట్ రైట్ అవుతారో లేదో చూడాలి.