వైసీపీ ఎంపీల మధ్య ముదురుతున్న వివాదం…?
విశాఖ రాజకీయాలు ఇపుడు హీటెక్కిస్తున్నాయి. నిజానికి చాలా మంది విజయవాడను పొలిటికల్ క్యాపిటల్ అంటారు కానీ ఇపుడు విశాఖ అసలైన క్యాపిటల్ గా మారింది. విశాఖ మీదనే [more]
విశాఖ రాజకీయాలు ఇపుడు హీటెక్కిస్తున్నాయి. నిజానికి చాలా మంది విజయవాడను పొలిటికల్ క్యాపిటల్ అంటారు కానీ ఇపుడు విశాఖ అసలైన క్యాపిటల్ గా మారింది. విశాఖ మీదనే [more]
విశాఖ రాజకీయాలు ఇపుడు హీటెక్కిస్తున్నాయి. నిజానికి చాలా మంది విజయవాడను పొలిటికల్ క్యాపిటల్ అంటారు కానీ ఇపుడు విశాఖ అసలైన క్యాపిటల్ గా మారింది. విశాఖ మీదనే అందరి చూపూ పడుతోంది. ఏపీలో రాజకీయ పెద్ద తలకాయలంతా విశాఖ సహా ఉత్తరాంధ్ర టూర్లు వేయడం ఇటీవల కాలంలో పెరిగింది. దానికి అధికార వైసీపీ యాక్టివిటీస్ ఇక్కడ పెరగడమే ముఖ్య కారణం. వైసీపీకి విశాఖను పాలనా రాజధానిగా చేద్దామని ఉంది. దాంతో జగన్ కు అతి ముఖ్య సన్నిహితుడు, రాజ్య సభ ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖలో పాతుకుపోతున్నారు. సూది మొన అంతా సందు ఉన్నా ఆయన దూరిపోతున్నారు. అంతా తానేనని అంటున్నారు. దాంతో మిగిలిన నేతలకు అది చాలా ఇబ్బందిగానే కాదు, ఇరిటేటింగ్ గా ఉందిట.
ఆయన అలా…..
గతంలో విజయసాయిరెడ్డి అన్ని కార్యక్రమాల్లో తానే పెద్దగా పాలుపంచుకుంటూ ఏకంగా అధికారుల స్థాయి మీటింగులను కూడా నిర్వహించేసేవారు. అనేక ప్రారంభోత్సవాలలో కూడా పాలు పంచుకునేవారు. దాంతో ఆయన ఎడం పక్కన నిలబడి ఫోటోలకు ఫోజు ఇవ్వడమే మంత్రిగా అవంతి శ్రీనివాస్ వంతు అయ్యేది. ఈ పరిణామాలను ఆయన అసలు జీర్ణించుకోలేకపోయేవారు. అసలు మంత్రిని తానా ఆయనా అంటూ అవంతి అధికారుల మీద కూడా గుస్సా అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కొన్ని సార్లు ఆయన అలక పానుపు ఎక్కి దిగివచ్చేవారు కాదు. సరే ఆ తరువాత తన అసలైన అధికారాలు వైసీపీలో ఏంటో తెలుసుకుని చక్కగా సర్దుకున్నారు. ఇపుడు కూడా ఆయన విజయసాయిరెడ్డి పక్కనే కనిపిస్తున్నారు కానీ ఆ బాధలు, అసంతృప్తులను ఎపుడో దాటేసి ప్రశాంతంగా ఉన్నారు.
చోటు లేదుగా …?
విశాఖలో జనం నుంచి గెలిచిన ఎంపీగా ఎంవీవీ సత్యనారాయణ ఉన్నారు. అయితే రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిదే అన్నింటా పెత్తనం. ఆఖరుకు కధ ఎంతవరకూ వచ్చిందంటే సింహాచలం లో పంచ గ్రామాల భూ వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం ఒక కమిటీని నియమిస్తే అందులో కూడా విజయసాయిరెడ్డికి చోటు కల్పించారు. దాంతో ఎంవీవీ సత్యనారాయణ రగిలిపోతున్నారుట. తాను జనం ఓట్లతో గెలిచానని, సింహాచలం భూముల విషయంలో ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పానని అంటున్నారు. అటువంటపుడు సర్కార్ వేసిన కమిటీలో లోక్ సభ సభ్యుని హోదాలో తనను నియమించకుండా పెద్దల సభలో ఉన్న విజయసాయిరెడ్డిని పెట్టడమేంటని గుర్రుమంటున్నారుట. అయినా జగన్ కి కుడి భుజం లాంటి విజయసాయిరెడ్డి ఉండగా ఇలా అడగడం ధర్మమేనా అని వైసీపీలో కొందరు అంటున్నారు.
తేల్చుకుంటారా…?
ఈ విషయం ఇపుడు చిలికి చిలికి గాలివానగా మారుతోందిట. తాను జగన్ వద్దనే తేల్చుకుంటానని ఆ ఎంపీ అంటున్నారుట. వైసీపీలో పేరుకు మాత్రమే పదవులు అన్నట్లుగా ఉందని కూడా కస్సుమంటున్నారుట. అన్ని కమిటీల్లో విజయసాయిరెడ్డి ఉంటే తామెందుకు అన్న బాధ ఆయన వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. అయితే విశాఖ జగన్ కి ఇష్టమైన సిటీ. ఇక్కడ చీమ చిటుక్కుమన్నా ఆయనకు క్షణాల్లో సమాచారం రావాలి. విజయసాయిరెడ్డి అందుకే జగన్ తరఫున అన్నింటా ఉంటున్నారని పార్టీలో అంటున్నారు. ఇక సింహాచలం భూముల విషయంలో చాలా పెద్ద తలకాయలు ఉన్నాయని, పైగా సొంత పార్టీ వారి ప్రమేయం కూడా ఉందని ఆరోపణలు ఉన్నాయని చెబుతున్నారు. స్వతహాగా బిల్డర్ అయిన ఎంవీవీఎని ఈ కమిటీలో పెడితే విమర్శలు వస్తాయనే అలా తప్పించారని అంటున్నారు. మొత్తానికి విశాఖలో వట్టి ఎంపీ, గట్టి ఎంపీల మధ్యన గొడవలు మాత్రం ముదిరిపోతున్నాయి.