అన్ని సార్లూ.. అయినట్లు.. ఈసారి అవుతుందా?
విశాఖ చాలా కూల్ అంటారు. అది నిజం. ఎదురుగా గంభీరమైన సాగరం ఉన్నా కూడా విశాఖ నిశ్చలంగా నిర్మలంగా ఉంటుంది. విశాఖ జనాలు తమ పనేంటో తామేంటో [more]
విశాఖ చాలా కూల్ అంటారు. అది నిజం. ఎదురుగా గంభీరమైన సాగరం ఉన్నా కూడా విశాఖ నిశ్చలంగా నిర్మలంగా ఉంటుంది. విశాఖ జనాలు తమ పనేంటో తామేంటో [more]
విశాఖ చాలా కూల్ అంటారు. అది నిజం. ఎదురుగా గంభీరమైన సాగరం ఉన్నా కూడా విశాఖ నిశ్చలంగా నిర్మలంగా ఉంటుంది. విశాఖ జనాలు తమ పనేంటో తామేంటో అన్నట్లుగా ఉంటారు. ఈ సిటీలో రాజకీయాల జోలు కానీ గోల కానీ అసలు ఉండదు. ఎన్నికల వేళ సందడి తప్ప మళ్ళీ ఎక్కడా ఎవరూ కూడా ఏదీ కనీసంగా కూడా చర్చించరు. అటువంటి విశాఖలో ఇపుడు రాజకీయాల జోరు పెరిగింది. సవాళ్ళూ ప్రతిసవాళ్ళూ చోటు చేసుకుంటున్నాయి. రాజకీయంగా నీవెంత అంటే నీవెంత అంటూ దూకుడు చేస్తున్నారు.
రంగాని తెచ్చి మరీ…
ఎక్కడ విజయవాడ వంగవీటి రంగా మరెక్కడ విశాఖ సిటీ. కానీ అలా విశాఖ రాజకీయాల్లోకి ఆయన వచ్చేశారు. తెచ్చేశారు. నెల్లూరుకి చెందిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖలో వైసీపీ రాజకీయాలను పరుగులు పెట్టిస్తున్నారు. దాంతో రెండవ వైపు కూడా టీడీపీ అదే విధంగా బిగ్ సౌండ్ చేయాల్సి వస్తోంది. ఈ నేపధ్యంలో విజయవాడ తరహాలో విశాఖ రాజకీయాలూ హీటెక్కి మోతెక్కిపోతున్నాయి. వంగవీటి రంగా హత్య జరిగి సరిగ్గా 32 ఏళ్ళు అయింది. కానీ రంగా హత్య కేసులో నిందితుడూ అంటూ విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడిని మాత్రం వీలున్నపుడల్లా కెలకడం ప్రత్యర్ధి పార్టీలు అసలు మానడంలేదు. ఆ విధంగా ఆయననూ, ఆ వెనకాల ఉన్న టీడీపీని కూడా దెబ్బ కొట్టే వ్యూహానికి తాజాగా విజయసాయిరెడ్డి తెరతీశారు.
కాపుల కోసమేనా…?
వంగవీటి రంగా ప్రభావాన్ని ఒక ఎన్నికలో చాలా గట్టిగానే తెలుగుదేశం చూసింది. 1989 ఎన్నికల్లో ఆ పార్టీ చిత్తుగా ఓటమిపాలు కావడం వెనక కాపుల ధర్మాగ్రహం ఉందని అంతా అంటారు. ఆ తరువాత మళ్లీ కధ మామూలే. కాపులు ఎన్నో ఎన్నికల్లో టీడీపీని సపోర్ట్ చేసి మరీ ఎన్టీయార్ ని, చంద్రబాబుని కూడా ముఖ్యమంత్రులను చేశారు. ఇక కాపుల మద్దతు ఎన్నిక ఎన్నికకూ మారుతోంది. దానికి వేరే కారణాలు ఉంటున్నాయి కానీ దానికి రంగా ప్రభావం మాత్రం హేతువు కాదు, కానీ ఉన్నట్లుండి విజయసాయిరెడ్డి రంగా హత్య కేసుని ప్రస్తావిస్తూ చంద్రబాబుకు అతి ముఖ్య అనుచరుడు ఎమ్మెల్యే అయిన వెలగపూడిని టార్గెట్ చేస్తున్నారు. దీని ద్వారా టీడీపీకి మరోమారు కాపుల దెబ్బ చూపించాలన్నదే అజెండాగా కనిపిస్తోందిట.
వర్కౌట్ అయ్యేనా…?
ఏపీ రాజకీయాల్లో సామాజిక శక్తుల పాత్ర చాలానే ఉంటుంది. అది ఎవరూ కాదనలేని సత్యం. అయితే ఇపుడు కాపులు వైసీపీ వైపు ఉన్నారు. అందుకే జగన్ 151 సీట్లతో ముఖ్యమంత్రి కాగలిగారు. కానీ ఎల్లకాలం ఈ మద్దతు నిలబెట్టుకోవాలనుకుంటే మాత్రం కష్టమేనని చెప్పాలి. కాపులు అధికార పీఠం కోసం ఎదురుచూస్తున్నారు. వారి కులానికి సీఎం పీఠం ఇచ్చే పార్టీ వైపు పెద్ద ఎత్తున ర్యాలీ అవుతారు. ఇపుడు చూస్తే బీజేపీ జనసేన కూటమి కాపులను ఆకట్టుకోవాలని చూస్తున్నాయి. మరో వైపు చూసుకుంటే టీడీపీ రంగాను హత్య చేయించిందని వైసీపీ, వైసీపీలో ఉన్న కాంగ్రెస్ నాయకులే అని టీడీపీ ఆరోపణలు చేసుకోవడం ద్వారా నష్టపోయేది క్లారిటీగా ఆ రెండు పార్టీలే. ఏ రాజకీయాలను చూసి కాపులు టీడీపీ, వైసీపీల మీదనే పూర్తి విముఖత ప్రదర్శించే అవకాశాలూ ఎక్కువగా ఉన్నాయి. మూడవ పార్టీ వైపుగా కూడా మళ్ళే సీన్ కూడా ఉంది. మరి సమయం చూసి రంగాను విశాఖ రాజకీయాల్లోకి తెస్తున్న విజయసాయిరెడ్డి కాపుల మద్దతు తమకే అని ఎలా చెప్పుకోగలుగుతారో చూడాల్సిందే.