బ్యాక్ టు బేసిక్స్
‘పల్లెటూరు మన భాగ్యసీమరా’ అని పాటలు పాడుకునే రోజులకు కాలం చెల్లిపోయింది. గ్రామీణ వృత్తులు కొడిగట్టిపోయాయి. కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం [more]
‘పల్లెటూరు మన భాగ్యసీమరా’ అని పాటలు పాడుకునే రోజులకు కాలం చెల్లిపోయింది. గ్రామీణ వృత్తులు కొడిగట్టిపోయాయి. కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం [more]
‘పల్లెటూరు మన భాగ్యసీమరా’ అని పాటలు పాడుకునే రోజులకు కాలం చెల్లిపోయింది. గ్రామీణ వృత్తులు కొడిగట్టిపోయాయి. కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం కళ తప్పిపోయాయి. వలసబాట పట్టిన పల్లెలు వల్లకాడును తలపింప చేస్తున్నాయి. ముసలీ,ముతకా మినహా యువతరం గ్రామాల్లో ఉండటమే మానేశారు. ఎంతటి చిన్నపనైనా పట్టణమే వారికి గమ్యస్థానంగా మారిపోయింది. గౌరవప్రదమైన కులవృత్తులు, వ్యవసాయం కొరగానివైపోయాయి. గడచిన రెండు దశాబ్దాలుగా ఈ పరిస్థితులు నానాటికీ దిగజారుతూ వస్తున్నాయి. సేవలు, సహకారం, ఉత్పత్తి, ధ్రువీకరణల వంటివన్నీ మండలస్థాయి ఓ మోస్తరు పట్టణాలకు పరిమితమైపోయాయి. ఒకనాడు స్వయం సమృద్ధంగా విలసిల్లిన గ్రామాలు దాదాపు అన్నివస్తువులను పట్టణాలనుంచి అరువు తెచ్చుకునే స్థాయికి వచ్చేశాయి. ఉపాధి కోల్పోయాయి. ఈ దశలో గ్రామాల్లో సచివాలయాల ఏర్పాటు ఎందుకనే ప్రశ్న మేధావి వర్గాల నుంచే ఎదురైంది. పట్టుకోల్పోయిన గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు జీవం పోయడానికి , పల్లె జీవన వికాసానికి ఈ ఏర్పాటు ఎలా దోహదం చేస్తుందనే సందేహాలనూ కొందరు వ్యక్తం చేశారు.
వినూత్న విప్లవం…
పల్లెటూళ్లను భారంగా, తమ జీవన స్థితిగతులను ఏమాత్రం మెరుగుపరచడానికి ఉపకరించని గత కాలపు అవశేషాలుగా భావించే వారి సంఖ్య పెరిగిపోయింది. అందువల్లనే పదోతరగతి పైన చదివిన ప్రతిఒక్కరి చూపులూ పట్టణాలపైనే పడ్డాయి. గ్రామీణ వృత్తులు, ఉత్పత్తులు అన్నీ అదృశ్యమైపోయాయి. ఉపాధి కూడా కనుమరుగైపోయింది. ఈ దశలో గ్రామసచివాలయాలను ఏర్పాటు చేసి కనీసం పది మంది సర్కారీ ఉద్యోగులను అందులో కూర్చోబెట్టడం చిన్నవిషయం కాదు. ప్రభుత్వం, పంచాయతీ చేయాల్సిన అన్ని సేవలను ఇంటింటికీ అందిస్తామంటూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విప్లవాత్మకమనే చెప్పాలి. నిజంగా అంతమందికి పని ఉంటుందా? అనేది కొందరి సందేహం. ఊరకనే కూర్చోబెట్టి పోషించడమేమోనని మరికొందరి అనుమానాలు. కానీ ఒకనాడు కళ కళ లాడిన గ్రామాలు మళ్లీ కళాత్మకంగా రూపుదిద్దుకోవాలంటే ఇది తప్పని సరి ఏర్పాటు. పదిమంది యువతరం ప్రతినిధులు గ్రామంలో ఉంటూ పల్లె ప్రజలకు సేవచేసే బాధ్యత, కర్తవ్యాన్ని తీసుకోవడం దేశానికి సేవ చేసినట్లే. దాంతో పోలిస్తే ఉపాధి అన్నది చిన్న అంకమే.
అనుబంధాలకు ఆయువు…
గ్రామ సచివాలయంలో ఉద్యోగాలన్నీ దాదాపు సేవారంగమే. అయితే దీనికి అనుబంధంగా ఉత్పత్తి రంగానికి ప్రాణం పోసినప్పుడే పల్లెలు నిజమైన ఉపాధి కేంద్రాలుగా మారతాయి. కుటీర పరిశ్రమలు, చిన్నతరహా పరిశ్రమలు, వ్యవసాయానుబంధ పరిశ్రమలు నెలకొల్పినప్పుడు వలసలు తగ్గుతాయి. ఆ మేరకు ఈ సచివాలయ ఉద్యోగులను ఎలా వినియోగించుకోవాలనే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఆయా గ్రామాల్లో ఉన్న మానవ వనరులు, ఉత్పత్తి అవకాశాలు, స్థానికంగా లభించే సహజ వనరుల ఆధారంగా పల్లెల పునరుద్ధరణ ప్రణాళికను రూపకల్పన చేయాలి. అప్పుడే ఈ ఉద్యోగులకు పూర్తి స్థాయి పని లభిస్తుంది. ఆయా గ్రామాల్లోనే కచ్చితంగా నివసించే నిబంధనను అమలు చేయాలి. లేకపోతే పట్టణ కార్యాలయాల తరహాలో పది నుంచి ఆరుగంటల వరకూ చేసే ఉద్యోగం గా మారితే ప్రభుత్వం ఆశించిన ప్రయోజనం నెరవేరదు. అంతేకాకుండా ఉద్యోగులు పట్టణాల నుంచి వచ్చి కార్యాలయంలో కాలక్షేపం చేసి మళ్లీ పట్టణాల లో తమ నివాసాలకు వెళ్లిపోయే అవకాశాలుంటాయి. దీనికి అడ్డుకట్ట వేయాలంటే గ్రామంతో అనుబంధం పెంచేలా చర్యలుండాలి. గ్రామ సర్వతోముఖ వికాసం తమపైనే ఆధారపడి ఉందన్న స్పృహ వారిలో కలిగించాలి.
పల్లెకు ప్రాణం..మళ్లీ చూడాలి మనం…
గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా పల్లెల పునరుజ్జీవనానికి తొలి అడుగు పడినట్లే. యువకులకు పల్లెల్లోనే ఉద్యోగాలివ్వడం మంచి ఆశయం. అనుబంధ కార్యకలాపాలు కూడా మొగ్గ తొడిగితే గ్రామసీమలు మళ్లీ చిగురిస్తాయి. వీటిని ఒక మంచి ఆశయంతో రూపుదిద్దితేనే ఫలితాలు సిద్ధిస్తాయి. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పల్లెల్లో చాలా చోట్ల ఇళ్లకు తాళాలు పడి వెక్కిరిస్తుంటాయి. సత్తువ ఉడిగిన వ్రుద్ధులను ఇళ్లకు కాపలా పెట్టి జీవనభృతిని వెదుక్కుంటున్న కుటుంబాలు లక్షల్లోనే కనిపిస్తాయి. ప్రభుత్వ చిత్తశుద్ధితో రివర్స్ మైగ్రేషన్ మొదలు కావాలి. వలస పోయిన వారు తమ సొంత ఊళ్లకు పరుగులు తీయాలి . బారులు కట్టాలి. ఇది జరగాలంటే ప్రభుత్వం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ‘నియమితులందరూ మూడేళ్లపాటు కచ్చితంగా పనిచేయాలి. లేకపోతే మొత్తం జీతమంతా తిరిగి చెల్లించాల’నే కఠిన నిబంధనలు అవసరం లేదు. ఎందుకంటే ఈ పల్లె ఉద్యోగులు పైస్థాయి ఉద్యోగాలకు వెళితే ప్రభుత్వానికి పెద్దగా నష్టమేమీలేదు. ఆయా ఖాళీల్లో కొత్తవారిని నియమించుకోవచ్చు. మరింతమందికి ఉపాధి సమకూరుతుంది. బలవంతపు ఉద్యోగాలు చేయించాల్సిన అవసరం అంతకన్నా లేదు. పైపెచ్చు తాజా నియామకాలు పెద్ద శిక్షణతో ముడిపడిన ఉద్యోగాలు కావు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని విమర్శలకు అతీతంగా వ్యవస్థ సమర్థంగా పనిచేసేలా చూసుకోవడం సర్కారు బాధ్యత. అలా జరిగినప్పుడే గ్రామస్వరాజ్యం ఆశయం నెరవేరుతుంది.
-ఎడిటోరియల్ డెస్క్