రాజు గారికి ఎమ్మెల్యే టికెట్ గ్యారంటీ ?
మొత్తానికి బీజేపీలో పదవుల పందేరం కాదు కానీ విశాఖ ఉత్తర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజుకు 2024లో మరో మారు పార్టీ టికెట్ కన్ [more]
మొత్తానికి బీజేపీలో పదవుల పందేరం కాదు కానీ విశాఖ ఉత్తర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజుకు 2024లో మరో మారు పార్టీ టికెట్ కన్ [more]
మొత్తానికి బీజేపీలో పదవుల పందేరం కాదు కానీ విశాఖ ఉత్తర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజుకు 2024లో మరో మారు పార్టీ టికెట్ కన్ ఫర్మ్ అయిందని ఆయన అభిమానులు అంటున్నారు. 2014 ఎన్నికల్లో కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి సిఫార్సుతో టికెట్ సాధించిన విష్ణు కుమార్ రాజు ఆది నుంచి పార్టీలో ఉన్న వారిని కాదని సవాల్ చేసి గెలిచారు. ఆ విధంగా ఆయన విశాఖలో బీజేపీ కురు వ్రుద్ధుడు పీవీ చలపతిరావు కుటుంబానికి కొంత వ్యతిరేకం అయ్యారు. ఎందుకంటే ఆ సీటుని ఆశించింది ఎవరో కాదు పీవీ కుమారుడు, ప్రస్తుత ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ కాబట్టి.
ఇద్దరికీ పదవులు….
ఇక బీజేపీ కొత్త ప్రెసిడెంట్ సోము వీర్రాజు విశాఖకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. తన కార్యవర్గంలో విశాఖలో చాలా మందికి పదవులు కల్పించారు. ఎమ్మెల్సీ మాధవ్ కి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు. అదే విధంగా విష్ణు కుమార్ రాజుకు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కీలక స్థానం ఇచ్చారు. ఇలా ఇద్దరికీ పార్టీ అమితమైన ప్రాధాన్యత ఇస్తుందని చెప్పకనే చెప్పారు. ఈ ఇద్దరూ కలసికట్టుగా విశాఖ జిల్లాలో బీజేపీని అభివృధ్ధి చేయమని ఆయన ఆదేశించారు. అయితే ఇద్దరూ కలసి పనిచేస్తారా అన్నది అనుమానమే అంటున్నారు.
అక్కడే పేచీ……
విశాఖ ఉత్తరం సీటు మీద ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ కి ఆశ ఉంది. ఆయన ఎమ్మెల్సీ పదవీ కాలం కూడా 2023లో పూర్తి అవుతుంది. ఆ తరువాత ఏడాది జరిగే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆయన పోటీకి కచ్చితంగా రెడీగా ఉంటారు. పైగా ఆయన సామాజికవర్గం పెద్ద ఎత్తున ఉత్తర నియోజకవర్గంలో ఉన్నారు. దాంతో మాధవ్ తన సీటు కోసం పట్టుపట్టడం ఖాయమని అంటున్నారు. అది తప్పించి మాధవ్ కి వేరే సీటు కూడా పోటీ చేయడానికి లేదు కూడా. మరో వైపు చూస్తే రెండు సార్లు విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేసి ఒక సారి గెలిచి బీజేపీ శాసన సభా పక్ష నేతగా బాధ్యతలు నిర్వహించిన విష్ణు కుమార్ రాజు ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరం విడిచి వెళ్లరని అంటున్నారు.
చెరో దారేనా…..
ఇపుడు ఎటూ ఏపీ ఉపాధ్యక్ష పదవి చేతిలో ఉంది కాబట్టి పార్టీ సంగతి ఎలా ఉన్నా తనకు మాత్రం ఎమ్మెల్యే టికెట్ మరో మారు కన్ ఫర్మ్ అయిందని విష్ణు కుమార్ రాజు గట్టి విశ్వాసంతో ఉన్నారుట. పార్టీ కార్యవర్గంలో కీలకమైన నేతను కాదని, అది కూడా అతని సొంత సీటుని కాదని వేరే వారికి ఇచ్చే సాహసం బీజేపీ చేయదు అన్నది విష్ణు కుమార్ రాజు అంచనా అని చెబుతున్నారు. దాంతో రాజుకు పార్టీ పదవి రాగానే ఆయన అనుచరులు 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఖాయమని సంబరాలు జరుపుతున్నారు. ఎటూ జనసేనతో పొత్తు కనుక కొనసాగితే ఆ పార్టీ మద్దతుతో మరో మారు రాజు ఎమ్మెల్యే అవుతారు అని కూడా అంటున్నారు. మొత్తానికి విశాఖలో పార్టీ పదవులు పంచి పార్టీని బలోపేతం చేశారా, కొత్త చిచ్చు పెట్టారా అన్నది సోము వీర్రాజుకే తెలియాలి మరి అన్న మాట వినిపిస్తోంది.