విజయనగరం రారాజు ఎవరు.. అశోక్ కోటలో ఏం జరుగుతోంది…?
విజయనగరం జిల్లా కేంద్రమైన విజయనగరం నియోజకవర్గంలో వచ్చే సాధారణ ఎన్నికలకు ముందుగానే రాజకీయ వ్యూహాలకు తెర లేచింది. మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుకు కంచుకోటగా ఉంటూ [more]
విజయనగరం జిల్లా కేంద్రమైన విజయనగరం నియోజకవర్గంలో వచ్చే సాధారణ ఎన్నికలకు ముందుగానే రాజకీయ వ్యూహాలకు తెర లేచింది. మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుకు కంచుకోటగా ఉంటూ [more]
విజయనగరం జిల్లా కేంద్రమైన విజయనగరం నియోజకవర్గంలో వచ్చే సాధారణ ఎన్నికలకు ముందుగానే రాజకీయ వ్యూహాలకు తెర లేచింది. మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుకు కంచుకోటగా ఉంటూ వస్తున్న ఈ నియోజకవర్గంలో ఆయన వరసగా ఆరుసార్లు గెలిచిన రికార్డు దక్కించుకున్నారు. ఈ నియోజకవర్గంలో 1978లో జనతా పార్టీ నుంచి గెలిచిన ఆయన ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి 2004 ఎన్నికల వరకు ఓటమి లేకుండా ఆరు వరస విజయాలు సాధించారు. 2004 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి చేతిలో కేవలం 1000 ఓట్ల తేడాతో ఓడిపోయిన ఆయన తిరిగి 2009 ఎన్నికల్లో విజయం సాధించారు. ఇక గత ఎన్నికల్లో అశోక్ విజయనగరం నుంచి ఎంపీగా పోటీ చేసి ఘన విజయం సాధించడంతో పాటు కేంద్ర మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు రావడంతో ఆయన సైతం తన మంత్రి పదవిని వదులుకున్నారు.
వారసురాలిని దింపనున్నారా..?
ఇక వచ్చే ఎన్నికల్లో విజయనగరం అసెంబ్లీ సెగ్మెంట్లో రాజకీయాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా ఉంది. అశోక్ గజపతి రాజు తిరిగి ఎంపీగా పోటీ చేస్తారా? లేదా అసెంబ్లీకి పోటీ చేస్తారా? అన్నది సస్పెన్స్ గా ఉంది. అశోక్ వచ్చే ఎన్నికల్లో తన కుమార్తె అతిథి గజపతిని విజయనగరం అసెంబ్లీ బరిలో నిలపవచ్చని సాగుతున్న ప్రచారం సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల గీత టిక్కెట్‌కు ఎసరు పెట్టవచ్చన్న వాదనకు బలం చేకూర్చుతోంది. ఒకవేళ అశోక్ తిరిగి ఎంపీగా పోటీ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ మీసాల గీతకు అభ్యర్థిత్వం దక్కకుండా చెయ్యాలని… ఈ క్రమంలోనే ఆయన కుమార్తె అతిథిని అసెంబ్లీ బరిలోకి దింపాలని అశోక్ అనుచరులు కూడా భావిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మీసాల గీత వ్యూహాత్మకంగా కుల రాజకీయాలను తెరమీదకు తెస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. బీసీ మరీ ముఖ్యంగా తూర్పు కాపు సామాజికవర్గం ఓట్లే ఎక్కువగా ఉన్న విజయనగరం నియోజకవర్గంలో అదే సామాజికవర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల గీత వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి తానే అవుతానన్న ధీమాతో ఉన్నారు. ఆమెకు వైసీపీ కీలక నేత బొత్స నుంచి ఇంటర్నల్ సహకారం ఉందన్న ప్రచారమూ ఉంది.
వైసీపీ నుంచి కోలగట్ల…
వైసీపీ నుంచి ఎమ్మెల్సీ, నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్ కోలగట్ల వీరభద్రస్వామికే జగన్ ఈ టికెట్ ప్రకటించారు. విజయనగరం రాజకీయాల్లో 1989 నుంచి కంటిన్యూ అవుతూ అశోక్ గజపతి రాజుకు వ్యతిరేకంగా ధీటుగా నిలబడుతున్న కోలగట్ల అయితేనే ఇక్కడ సరైన ప్రత్యర్థి అవుతారన్న అంచనా ఉంది. 1989, 1994, 1999 ఎన్నికల్లో అశోక్‌పై వరుసగా మూడు సార్లు ఓడి 2004 మాత్రం ఇండిపెండెంట్‌గా సంచలన విజయం సాధించారు. ఇక ప్రస్తుతం జిల్లా వైసీపీలో బొత్స సత్యనారాయణకు వీరభద్రస్వామికి మధ్య తీవ్రమైన వైరుధ్యం ఉంది. ఈ నేపథ్యంలో ఒకానొక దశలో తీవ్రమైన అసహనం వ్యక్తం చేసిన కోలగట్ల వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చెయ్యనని కూడా స్పష్టం చేశారు. చివరకు పార్టీ రాష్ట్ర నాయకత్వం బుజ్జగింపులతో ఆయన కాస్త మెత్తపడ్డారు. కోలగట్ల ప్రస్తుతానికి తన పని తాను చేసుకుంటున్నా ఎన్నికల్లో బొత్స రాజకీయాలకు ఆయన బలికాక తప్పదన్న చర్చలు కూడా ఉన్నాయి. అదే టైమ్‌లో నియోజకవర్గంలో కాపు ఓటు బ్యాంకు బలంగా ఉండడంతో జనసేన సైతం బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపితే భారీగా ఓట్లు చీల్చవచ్చు. ఇక టీడీపీ సీటు రాకపోతే జనసేన నుంచి పోటీ చేసేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే గీత ఆ పార్టీ టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. ఏదేమైనా విజయనగరం అసెంబ్లీ కోటపై ఏ పార్టీ జెండా ఎగురుతుందో? చూడాలి.