టీఆర్ఎస్ నెత్తిన మమత పాలు పోశారుగా?
తెలంగాణ రాష్ట్ర సమితి నెత్తిన పశ్చిమబంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాలు పోశారు. ఎప్పటికీ తెమలని తేనెతుట్టను ఒక్కసారిగా కదిల్చారు. దేశానికి నాలుగు రాజధానులుండాలంటూ కొత్తవాదనను తెరపైకి [more]
తెలంగాణ రాష్ట్ర సమితి నెత్తిన పశ్చిమబంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాలు పోశారు. ఎప్పటికీ తెమలని తేనెతుట్టను ఒక్కసారిగా కదిల్చారు. దేశానికి నాలుగు రాజధానులుండాలంటూ కొత్తవాదనను తెరపైకి [more]
తెలంగాణ రాష్ట్ర సమితి నెత్తిన పశ్చిమబంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాలు పోశారు. ఎప్పటికీ తెమలని తేనెతుట్టను ఒక్కసారిగా కదిల్చారు. దేశానికి నాలుగు రాజధానులుండాలంటూ కొత్తవాదనను తెరపైకి తెచ్చారు. దీంతో దక్షిణాదిలో భారత్ రెండో రాజధానిగా హైదరాబాద్ ను ఎంపిక చేయాలంటూ వస్తున్న డిమాండ్లకు శాశ్వతంగా బ్రేక్ పడినట్లే. తెలంగాణ జనాభాలో మూడో వంతు హైదరాబాద్ లోనే నివసిస్తున్నారు. దేశానికి రెండో రాజధానిని చేస్తే దీనికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించి పరిపాలన విభాగం ఏర్పాటు చేస్తారు. శాంతిభద్రతలను కేంద్రం నియంత్రణలోకి తీసుకుంటుంది. అదే జరిగితే రాష్ట్రానికి రాజకీయంగా, ఆర్థికంగా గుండె కాయలాంటి హైదరాబాద్ పై టీఆర్ఎస్ పెత్తనం పోతుంది. తెలంగాణ నామ్ కే వాస్తే రాష్ట్రంగా మిగిలిపోతుంది. తెలంగాణ గ్రామీణప్రాంతాల్లో రానున్న శాసనసభ, లోక్ సభ ఎన్నికల్లో పట్టు సాధించాలని బీజేపీ యోచిస్తోంది. ఒకవేళ అలా జరగకపోతే రెండో రాజధాని ని తమ అజెండాలోకి తెచ్చుకుంటుంది. ఇప్పుడు మమత లేవనెత్తిన నాలుగు కుంపట్లతో ఇక ఈ వివాదం జోలికి పోకపోవచ్చు.
ఇరుకునపడ్డ బీజేపీ…
భారతీయజనతాపార్టీకి అల్లిమేట్ గా దేశంలో శాశ్వతంగా అధికారంలో ఉండే వ్యూహం ముఖ్యం. ఇంకా దేశానికి సంబంధించి తన అజెండాను పూర్తిగా అమలు చేయాలంటే మరో రెండు మూడు దఫాలు వరసగా అధికారం అవసరమని బీజేపీ అగ్రనాయకత్వం అభిప్రాయపడుతోంది. జమ్ము కశ్మీర్ ను అత్యంత సాహసోపేతంగా విడదీసి ఆమేరకు కమలం పార్టీ దేశవ్యాప్తంగా రాజకీయ ప్రయోజనం సాధించింది. మతపరంగా బలమైన పట్టుకోసం మరో కొత్త ఎత్తుగడతో వెళ్లాల్సిన అవసరం కనిపిస్తోంది. నిన్నామొన్నటి వరకూ హైదరాబాద్ కే పరిమితమైన ఎంఐఎం క్రమేపీ వివిధ రాష్ట్రాల్లో వేళ్లూనుకుంటోంది. ఇది బీజేపీకి లాభించే చర్యనే. ఎంఐఎం ను చూపించి హిందూ ఓట్లను సంఘటితం చేసుకోవచ్చు. లౌకిక వాదం ప్రస్తావనతో మైనారిటీల పట్ల మౌనం వహించే ఇతర పార్టీలు తీవ్రంగా నష్టపోతాయి. ముస్లింల సంఖ్య మరీ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఎంఐఎం లాభపడుతుంది. హిందూ ఓట్లు అత్యధికంగా ఉండే మొత్తం నియోజకవర్గాల్లో బీజేపీకి కలిసి వస్తుంది. ఈ ఫార్ములా బాగానే వర్కవుట్ అవుతోంది. అయితే ఎంఐఎం ను కట్టడి చేయకపోతే , దానిపై చర్యలకు పూనుకోకపోతే కాంగ్రెసుతో , ప్రతిపక్షాలతో కలిసే ప్రమాదం ఉంది. అందువల్ల ఎంఐఎం ను శాశ్వత శత్రువుగా తనతో నేరుగా పోటీ పడే ప్రత్యర్థిగా మలచుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమబంగ, కర్ణాటక, తెలంగాణల్లో ఎంఐఎం కారణంగా బీజేపీకి భారీ లబ్ధి చేకూరుతుందనేది రాజకీయ అంచనా. కేంద్ర పెత్తనంతో హైదరాబాద్ పై రాజకీయంగా పట్టు సాధిస్తే దేశంలో ఎంఐఎం ను నియంత్రించగల శక్తి బీజేపీ మాత్రమే అని ప్రజలు భావిస్తారు. అందుకే దేశంలో రెండో రాజధాని ప్రతిపాదనకు బీజేపీ వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. .
దక్షిణాదికి అన్యాయం…
బీజేపీ రాజకీయ ప్రయోజనాల సంగతి ఎలా ఉన్పప్పటికీ దేశంలో రెండో రాజధాని దక్షిణభారతంలో ఏర్పాటు కావాల్సిన వ్యూహాత్మక అవసరం ఉంది. దేశ ప్రయోజనాల దృష్ట్యా హైదరాబాద్ అందుకు అనువైన ప్రాంతం. అదే విధంగా సుప్రీం కోర్టు బెంచ్ కూడా దక్షిణాదిలో చెన్నై, బెంగుళూరుల్లో ఒకచోట ఏర్పాటు చేయడం సముచితం. మమత ప్రాంతీయంగా రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందనే వాదన తేవడంలో టీఎంసీకి సంబంధించి తృణమూల్ రాజకీయ ప్రయోజనాలే ముడిపడి ఉన్నాయి. బీజేపీ ఆ రాష్ట్రంలో చాలా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే మమత కు ప్రధాన ప్రత్యర్థిగా రూపుదాల్చింది. ఈ ఎన్నికల్లో మమత గట్టెక్కినా రానున్న కాలంలో బీజేపీ కచ్చితంగా ఆ రాష్ట్రంలో పాగా వేస్తుందని రాజకీయ పండితులు జోస్యం చెబుతున్నారు. వివేకానంద, రవీంద్రనాథ్ టాగూర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి వారిని బీజేపీ ఆవాహన చేస్తోంది. ఈ పరిస్థితుల్లో దక్షిణాదికి ఏమైనా ప్రయోజనం చేసే చర్యలు తీసుకుంటే పశ్చిమబంగ వంటి రాష్ట్రంలో మమత చెలరేగిపోయే అవకాశం ఉంది. బ్రిటిష్ కాలంలోనే దేశానికి రాజధాని అయిన కోల్ కతా కు అన్యాయం జరుగుతోందని పొలిటికల్ వెపన్ బయటికి తీస్తుంది. ఈ తలపోటును బీజేపీ తెచ్చిపెట్టుకోదు. అందువల్ల మమత తన సంకుచిత రాజకీయంతో దక్షిణాదికి విస్తరించాల్సిన రాజకీయ, పరిపాలన కేంద్రాలను పరోక్షంగా అడ్డుకున్నట్లే భావించాలి. నామమాత్రపు రాజకీయ ప్రాధాన్యంతో ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు కేంద్రంలో నష్టపోతున్నాయి.
ఊసెత్తరిక..
ఉత్తర, దక్షిణ, ఈశాన్య రాష్ట్రాల ప్రాంతీయ హక్కులు అనే డిమాండ్ పెరిగితే ఒకే దేశం ఒకే భాష, ఒకే మతం అన్నట్లుగా రాజకీయాలు నడుపుతున్న కమలం పార్టీ అవకాశాలకు గండి పడుతుంది. అందువల్ల సాధ్యమైనంత వరకూ లోప్రొఫైల్ లో తన మత పరమైన అజెండా ప్రాతిపదికగానే పట్టు పెంచుకునే వ్యూహాలను అమలు చేస్తుంది. అధికార వికేంద్రీకరణ , దక్షిణాదికి సముచిత ప్రాధాన్యం వంటివి మరుగున పడిపోవచ్చు. అయితే మమత లేవనెత్తిన అంశాల కారణంగా రాష్ట్రాలకు వేరే కోణంలో కొంత ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. 2026లో లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరిగితే దక్షిణాదిన ఉన్న సీట్ల సంఖ్య మరింత కుదించుకుపోవచ్చు. రాజకీయంగా అలజడి తలెత్తవచ్చు. అందువల్ల మొత్తం సీట్లను పెంచి, దామాషా పద్ధతిలో దక్షిణభారత రాష్ట్రాల ప్రాతినిధ్యం ఇప్పటిలాగే ఉండేలా చూడవచ్చని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
-ఎడిటోరియల్ డెస్క్