జగన్,పవన్ లలో 'మావోయిస్టు'ఎవరు ?
ఆంధ్ర రాజకీయాల్లో 'మావోయిస్టుల పరిభాష' స్వైర విహారం చేస్తున్నది.
ఆంధ్ర రాజకీయాల్లో 'మావోయిస్టుల పరిభాష' స్వైర విహారం చేస్తున్నది.నిజానికి ఎన్నికల రాజకీయాల్లో పాల్గొనే పార్టీలు,ఫక్తు బూర్జువా పార్టీలకు 'అతకని' భాష ఇది! విప్లవం,వర్గపోరాటం,సమసమాజం... తదితర పదాలు,వాక్యాలన్నీ కమ్యూనిస్టుల సొంతం.అది గతం.ఇప్పుడు ఎవరైనా ఈ మాటలను వాడవచ్చు.ఎలాగైనా అన్వయించవచ్చు.కొత్త పద్ధతుల్లో నిర్వచించనూ వచ్చు.క్లాస్ వార్ అనే పదాన్ని వాడడం ద్వారా ఏపీ పాలిటిక్స్ సిలబస్ లో ఈ ధోరణికి ముఖ్యమంత్రి జగన్ శ్రీకారం చుట్టారు.క్లాస్ వార్ అంటే 'వర్గ పోరాటమ'ని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.వచ్చే ఎన్నికల కురుక్షేత్రం రాష్ట్రంలో పెత్తందారులకు,పేద ప్రజలకు మధ్య జరుగుతున్న 'పోరాటం'గా జగన్ శక్తిమంతంగా ఎన్నికల ప్రచారాన్ని మలుపుతిప్పారు.'వర్గపోరాటం' అస్త్రాన్ని ఎట్లా కౌంటర్ చేయాలో తెలియక టీడీపీ,జనసేన అధ్యక్షులు చంద్రబాబు,పవన్ కళ్యాణ్ తికమక పడుతున్నారు.
జగన్ నినాదాలను తిప్పిగొట్టడానికి ఆ రెండు పార్టీలు చేసిన ప్రయత్నాలు వర్కవుట్ కావడం లేదు.ఉదాహరణకు అమరావతి ప్రాంతంలో 50 వేల మందికి పైగా ఇంటి స్థలాలు కేటాయించడం ,పట్టాలు ఇవ్వడం,వాళ్లకు ఇళ్లను నిర్మించాలన్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయానికి 'రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు' హైకోర్టు నుంచి స్టే సాధించుకున్నారు.ఆయా రైతుల వెనుక ఎవరున్నారో బహిరంగ రహస్యమే! ఈ పరిణామం జగన్ కే సానుకూల అంశంగా గుర్తించడంలో టీడీపీ విఫలమవుతోంది.''పేద ప్రజలకు ఇళ్ళు నిర్మించి ఇచ్చే ప్రక్రియను చంద్రబాబు అండ్ కో అడ్డుకున్నారం''టూ ఇటీవల అంబెడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సభలో ముఖ్యమంత్రి జగన్ ఆరోపించారు.
నూతన ప్రజాస్వామిక రాజ్యం భూస్వాముల రాజకీయ అధికారాన్ని ధ్వంసం చేయడం ద్వారా, దున్నేవారికే భూమి ప్రాతిపదికన వారి భూమిని పంపిణీ చేయడం ద్వారా, భూమిలేని,పేద రైతుల నాయకత్వం కింద ఉండే కొత్త అధికారం ద్వారా లభిస్తుందని మావోయిస్టు పార్టీ చెబుతోంది. దళితులు,ఆదివాసులు,ఇతర పీడిత కులాల ప్రజలకు సంపూర్ణ స్వేచ్ఛ లభిస్తున్నదన్నది థియరీ.సమాజంలో కుల ఆధారిత భూస్వామ్య పునాదిలో పాతుకుపోయి ఉన్న కులవ్యవస్థను విప్లవం మాత్రమే రూపుమాపగలుగుతుందని మావోయిస్టు పార్టీ వివరిస్తోంది.కమ్యూనిజంలో మార్క్సిజం,లెనినిజం ముఖ్యమైనవి. జర్మనీకి చెందిన కార్ల్ మార్క్స్ ఆలోచనల నుంచి మార్క్సిజం పుట్టింది. రష్యాకు చెందిన వ్లాడిమీర్ లెనిన్ భావనలకనుగుణంగా ఏర్పాటైన సిద్ధాంతమే లెనినిజం. మార్క్స్ సిద్దాంతానికి కేంద్ర బిందువు వర్గపోరాటం.మార్క్సిజం ప్రకారం ప్రతి సమాజంలోను పీడక(పాలక)వర్గం,పీడిత(పాలిత)వర్గం అనే రెండు వర్గాలు ఉంటాయి.పీడక వర్గం సమాజంలోని అధిక శాతం ఆస్థులపై అధికారం కలిగి ఉంటుంది.
సమాజంలోని ఆర్ధిక అసమానతలను నిర్మూలించడానికి విప్లవమే శరణ్యమని మార్క్సిజం,లెనినిజం,మావోయిజంను విశ్వసించే వారు వాదిస్తుంటారు.సామాజిక జీవన విధానం,పరిపాలనా విధానం,ఆర్థిక విధనాలలో మౌలిక మార్పులు తప్పనిసరిగా తీసుకుని రావాలని, తద్వారా సమాజంలోని అనేక అసమానతలను ఎలా తొలగించవచ్చునో చేసిన ప్రతిపాదనల రూపమే కమ్యూనిజం.
ఏపీలో ఓట్ల వేటలో తలమునకలై ఉన్న రాజకీయ పార్టీలేవీ కమ్యూనిస్టు సిద్ధాంతాల ప్రాతిపదికన ఏర్పడినవి కావు.అలాంటి రాజకీయా అభిప్రాయాలను విశ్వసించే పార్టీలు కూడా కావు.కానీ ఏపీ ముఖ్యమంత్రి జగన్ అత్యంత చాకచక్యంగా 'క్లాస్ వార్' ను విపక్షాలపై క్షిపణిలా సంధించారు.జగన్ వర్గపోరాటాల గురించి మాట్లాడమేమిటి? అని చంద్రబాబు,పవన్ అవహేళన చేస్తూ ఉంటారు.అయితే ఏపీ జనాభాల జగన్ సంక్షేమ పథకాలను అందుకుంటున్న 89 శాతం మందికి 'క్లాస్ వార్' మాట కనెక్టు అవుతోంది.చంద్రబాబు హయాంలో తమకు జరిగిన మేలు,జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక అమలులోకి వచ్చిన సంక్షేమ కార్యక్రమాలను సాధారణ జనం తూకం వేస్తున్నారు.
''జగనన్న ద్వారా మీకు మంచి జరిగిందని అనిపిస్తేనే ఓటు వేయండి'' అని జగన్ ఒక బాణం వదిలారు.ఆ బాణం శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా,ఇటు నెల్లూరు దాకా జనంలో బలంగా నాటుకుపోతోంది.ఇక కులాలు,ప్రాంతాలను దాటి ఈ బాణం సూటిగా జనాన్ని తాకుతోంది.టీడీపీ,జనసేన తిట్లపురాణంపై సాధారణ ఓటర్లలో పెద్దగా చర్చ జరగడం లేదు.జనం నాడిని పసిగట్టడంలో చంద్రబాబు,పవన్ కంటే జగన్ మోహనరెడ్డి ముందంజలో ఉన్నారు.మళ్ళీ వైసిపి అధికారంలోకి రాకపోతే సంక్షేమ కార్యక్రమాలన్నీ నిలిచిపోతాయేమో అనుమాన బీజాలను నాటడంలో జగన్ సక్సెస్ అయ్యారు.
(Views, thoughts, and opinions expressed in this news story/article belong solely to the author)