ఎనీ డౌట్స్ … ఆల్ హ్యాపీస్
అంతా అయిపోయింది … అనుకుంటున్న సమయంలో హఠాత్తుగా బ్రేక్ పడింది. మంత్రి మండలి సమావేశంలోనే మూడు రాజధానులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారనుకున్నారు. కానీ ఆచితూచి ముందుకు వెళతామని [more]
అంతా అయిపోయింది … అనుకుంటున్న సమయంలో హఠాత్తుగా బ్రేక్ పడింది. మంత్రి మండలి సమావేశంలోనే మూడు రాజధానులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారనుకున్నారు. కానీ ఆచితూచి ముందుకు వెళతామని [more]
అంతా అయిపోయింది … అనుకుంటున్న సమయంలో హఠాత్తుగా బ్రేక్ పడింది. మంత్రి మండలి సమావేశంలోనే మూడు రాజధానులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారనుకున్నారు. కానీ ఆచితూచి ముందుకు వెళతామని చెప్పింది వైసీపీ సర్కార్ . అంతలోనే మనసు మార్చుకుంది. బోస్టన్ కన్సల్టెన్సీ నివేదిక ఇంకా చేతికి రాకుండానే పదిమంది మంత్రులు ఆరుగురు ఉన్నతాధికారులతో కూడిన హైపవర్ కమిటీని నియమించింది. జీఎన్ రావు కమిటీ నివేదికతోపాటు త్వరలో చేతికి రానున్న బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు నివేదికనూ అధ్యయనం చేసి సిఫార్సులు చేయడం ఈ కమిటీ బాధ్యత. మూడు వారాల్లో ఈ తతంగాన్ని ముగించి అసెంబ్లీలో చర్చించి రాజధానిని కొలిక్కి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. అవసరమైతే అఖిలపక్ష భేటీ వంటి ప్రక్రియలూ ఉంటాయంటోంది. మొత్తంగా ఏకాభిప్రాయ సాధన అనేది బహిరంగంగా కనిపించే అంతస్సూత్రం. రాజకీయ, పాలన, చట్టపరమైన అంశాల్లో అవరోధాలను అధిగమించేందుకు హైపవర్ కమిటీతో సాధికారత తేవాలనేది వ్యూహాత్మకమైన అంశం. అంతిమంగా పార్టీకి, ప్రభుత్వానికి సానుకూలత తెచ్చుకుంటూ ముందడుగు వేయాలనే దిశలో నడుస్తోంది ప్రభుత్వం.
చెప్పే చేద్దాం…
రాజకీయంతో ముడిపడిన ఏ అంశంలోనూ ఏకాభిప్రాయం అనేది దాదాపు అసాధ్యం. ప్రజల సెంటిమెంటును తమ ఖాతాల్లో వేసుకునేందుకు పార్టీలు పోటీ పడతాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిందదే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మూడు ప్రాంతాల్లో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల వికేంద్రీకరణ చేస్తామన్న ప్రభుత్వ నిర్ణయం రాజకీయపార్టీల్లో ప్రాంతాల వారీ భిన్న స్పందనలకు ఆస్కారం కల్పించింది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఈ ఇబ్బందిని ఎక్కువగా చవి చూస్తోంది. రాష్ట్రంలో పెద్దగా బలం లేని బీజేపీ, వామపక్షాలు వంటివి స్థిరమైన అభిప్రాయాలు ప్రకటించాయి. తెలుగుదేశం అధిష్ఠానం అమరావతినే కోరుకుంటున్నప్పటికీ ఉత్తరాంధ్ర నాయకులు విశాఖ రాజధానిని స్వాగతిస్తున్నారు. తెలుగుదేశం ఆయా ప్రాంత నాయకులను నియంత్రించే చర్యలు తీసుకోవడం లేదు. ఇది ప్రతిపక్షం బలహీనత. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దృఢంగానే ముందుకు వెళ్లాలని భావిస్తోంది.
అగ్రనేతల అంతరంగం…
ముఖ్యమంత్రి మూడు రాజధానులపై శాసనసభ సాక్షిగా ప్రకటించారు. ఏదో మొక్కుబడిగా ప్రకటనలు చేసే తీరు, వైఖరి కాదు జగన్ మోహన్ రెడ్డిది. అందులోనూ జీఎన్ రావు కమిటీ నివేదిక చేతికి అందే తరుణంలో చేసిన ప్రకటన అత్యంత కీలకమైనది. ప్రభుత్వ ఉద్దేశాన్ని చట్టసభలోనే చెప్పడం అధికారికమైనది. ఆ తర్వాతనే పార్టీలో నంబర్ టు గా గుర్తింపు ఉన్న విజయసాయిరెడ్డి విశాఖలో సంబరాలకు పిలుపునిచ్చారు. మంత్రి బొత్స చాలా కాలంగా బహిరంగంగానే చెబుతూ వస్తున్నారు. అందువల్ల పాలన కేంద్రాల వికేంద్రీకరణ అన్న విషయంలో వైసీపీలో ఎటువంటి సందిగ్ధత లేదు. సంప్రతింపులు, ఏకాభిప్రాయ సాధనల వంటి ప్రక్రియలన్నీ ఆశించిన లక్ష్యం దిశలో నడిపే ఎత్తుగడలే. హైపవర్ కమిటీ ఏర్పాటు దీనికి కొనసాగింపు.
సుదీర్ఘ ప్రక్రియ…
రాజధానుల అంశాన్ని కొలిక్కి తెచ్చేందుకు సుదీర్ఘ ప్రక్రియకు తెర తీస్తోంది వైసీపీ సర్కారు. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు జనవరి మొదటి వారంలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించబోతోంది. ఇప్పటికే జీఎన్ రావు కమిటీ నివేదిక ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉంది. ఈ రెండు నివేదికలను కలిపి ఆచరణాత్మకతను అధ్యయనం చేసేందుకు హైపవర్ కమిటీని మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాజకీయ నిర్ణయానికి అవసరమైన ప్రాతిపదికను సిద్దం చేసే విషయాన్ని కమిటీలో మంత్రులు చూసుకుంటారు. పరిపాలన, న్యాయ, చట్టపరమైన అంశాల బాధ్యతను ఉన్నతాధికారులు చూస్తారు. ఈ నివేదిక అందిన వెంటనే అసెంబ్లీ లో చర్చకూ జనవరి మూడో వారంలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అవసరమైతే అఖిలపక్షంతో ఏకాభిప్రాయానికీ ప్రయత్నించేందుకూ సిద్ధమవుతోంది. మొత్తమ్మీద ప్రభుత్వం సాంకేతికంగా, సాధికారికంగానే నిర్ణయం తీసుకున్నట్లు నిరూపించుకునే ప్రక్రియకు శ్రీకారం చుడుతోందని చెప్పాలి.
కేంద్రం సమ్మతికి యత్నాలు…
అమరావతి రాజధాని కొనసాగింపుపై బీజేపీ రాష్ట్ర శాఖ పట్టుదలతో ఉంది. దీనికి అగ్రనాయకత్వం మద్దతు ఉందా? లేదా? అన్న విషయంలో సందేహాలున్నాయి. తామెందుకు రాజధానిని విశాఖకు తరలించాలని యోచిస్తున్నదీ కేంద్రప్రభుత్వానికి వివరించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఇప్పటికే రాజధాని భూముల ఇన్ సైడర్ ట్రేడింగుపై మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన నివేదిక, కొత్త నిర్మాణాలకు అత్యధికమైన వ్యయం, విశాఖకు సహజంగా ఉన్న సానుకూలతలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలనేది రాష్ట్రప్రభుత్వ యోచన. సాంకేతికంగా చూస్తే సెక్రటేరియట్ తరలింపునకు కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. కానీ కర్నూలుకు హైకోర్టు తరలింపు, ఇతర ప్రభుత్వ విషయాల్లో కేంద్రం సహకరించకపోతే అడుగు ముందుకు పడదు. అందువల్ల స్వయంగా ముఖ్యమంత్రే ప్రధానిని, హోం మంత్రిని కలిసి రాజధానులపై స్పష్టత ఇస్తే కేంద్రం అభ్యంతరపెట్టకపోవచ్చనేది అంచనా.
న్యాయ ప్రక్రియ తేలిన తర్వాతే…
మూడు రాజధానుల ప్రకటనలో అత్యంత కీలకమైనది రాయలసీమకు హైకోర్టు తరలింపు. అది సాధ్యం కాకపోతే విశాఖకు సెక్రటేరియట్ తరలించినా ప్రయోజనం నిష్ఫలం. రాయలసీమతోపాటు క్రుష్ణా జిల్లా వరకూ వ్యతిరేకత తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే ముందుగా హైకోర్టు విషయాన్ని తేల్చేయాలని ప్రభుత్వంలోని ఉన్నత వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 31(2) ప్రకారం హైకోర్టు విభజన చట్టంలోని సెక్షన్ 31(3) ప్రకారం హైకోర్టు బెంచీల ఏర్పాటుకు అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా అమరావతిలో హైకోర్టు ఏర్పాటైంది. హైకోర్టు ముఖ్యకేంద్రాన్ని తరలించాలంటే సుదీర్ఘ సమయం పట్టవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనకు కేంద్రం, హైకోర్టు, సుప్రీం కోర్టు అంగీకరించాలి. రాయలసీమలో హైకోర్టుకు బ్రేక్ పడితే వైసీపీకి రాజకీయ నష్టం ఏర్పడుతుంది. పూర్తి స్థాయి కోర్టును సీమ వాసులు డిమాండ్ చేస్తున్నారు. బెంచ్ ఏర్పాటుతో సంతృప్తి పడే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఇది ప్రభుత్వానికి సవాల్ గానే చూడాలి.
లక్ష కోట్ల బాణం…
అమరావతి అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయలు అవసరమవుతాయని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అంచనా వేసింది. 6 వేల కోట్ల రూపాయల పనులు పూర్తిచేయడంతోపాటు 42 వేల కోట్ల రూపాయల పనులకు టెండర్లు పిలిచింది. రాజధాని తరలింపునకు ఇదే అంశాన్ని వైసీపీ సర్కార్ ప్రాతిపదిక చేసుకుంది. లక్ష కోట్ల రూపాయలు వెచ్చించే ఆర్థిక పరిస్థితి రాష్ట్రానికి లేదన్నది ప్రధాన వాదన. ఒకవేళ రుణాల ద్వారా వాటిని సమకూర్చుకున్నప్పటికీ కనీసం వడ్డీలు చెల్లించే ఆర్థిక సామర్థ్యం సైతం ఆంధ్రప్రదేశ్ కు లేదని ప్రభుత్వం చెబుతోంది. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అన్న టీడీపీ వాదనను కూడా వైసీపీ తోసిపుచ్చుతోంది. మౌలిక వసతులైన భవనాలు, రహదారులు, రవాణా సౌకర్యాలు, విద్యుత్, తాగునీటి ప్రాజెక్టుల వంటివన్నీ ప్రభుత్వమే చేపట్టాల్సి ఉంటుంది. ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటే ప్రయివేటు సంస్థలకు భూములు ఉచితంగా నామమాత్ర రుసుముకు ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే లీజు పద్ధతిపై కేటాయించాల్సి ఉంటుంది. అందువల్ల వెయ్యి కోట్ల రూపాయలు సమకూరడం కూడా కష్టమేనంటోంది. మొత్తమ్మీద అమరావతి తరలింపునకు ఆర్థిక కారణాలను ఒక ప్రధానాస్త్రంగా వాడుకోబోతున్నారు. ఇప్పటికే విశాఖలో సౌకర్యాలున్నాయి. మౌలిక వసతులకు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో పెద్ద నగరం కాబట్టి హైదరాబాదుతో పోటీ పడుతుందని ప్రభుత్వం వాదిస్తోంది. ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా రాజకీయ చదరంగంలో చతురంగ బలాలు పక్కాగా కదులుతున్నాయనే చెప్పాలి. స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయాలూ రాజధానుల ప్రకటనలతో ముడిపడి ఉన్నాయనేది పరిశీలకుల అంచనా.
– ఎడిటోరియల్ డెస్క్