అమరావతిపై జగన్ ఇలా డిసైడ్ చేశారట
అమరావతిని ఏం చేయాలనే అంశంపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభుత్వం ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్లు ఉన్నత స్థాయి ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం ఎంపిక [more]
అమరావతిని ఏం చేయాలనే అంశంపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభుత్వం ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్లు ఉన్నత స్థాయి ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం ఎంపిక [more]
అమరావతిని ఏం చేయాలనే అంశంపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభుత్వం ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్లు ఉన్నత స్థాయి ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం ఎంపిక చేసిన ఈప్రాంతాన్ని కేవలం శాసన కార్యకలాపాలకే పరిమితం చేసి విశాఖకు కార్యనిర్వాహక రాజధానిని తరలించాలనేది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి యోచన. ఇందుకు అవసరమైన చట్టాన్ని అడ్డుకున్నందుకు శాసనమండలినే రద్దు చేసేందుకు తీర్మానం చేశారు. అయితే రద్దు అంశం కేంద్ర ప్రభుత్వంతో ముడి పడి ఉండటంతో పెండింగులో పడిపోయింది. మరోవైపు హైకోర్టులోనూ వ్యాజ్యం నడుస్తోంది. వీటన్నిటికంటే ప్రధానమైనది ప్రజలతో డీల్ చేయడం. రాజధానిని తరలించవద్దంటూ స్థానిక రైతులు చేస్తున్న ఆందోళనలు రెండువందల రోజుకు చేరుకున్నాయి. కరోనా కారణంగా ఆందోళనల తీవ్రత తగ్గింది. అందులోనూ దీర్ఘకాలం కావడంతో నామమాత్రంగానే నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజధానిని తరలించినా ఇక్కడున్న మౌలిక వసతులు, విస్తారమైన భూములను ఏం చేయాలనే అంశంపై ప్రభుత్వం పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
సెంటిమెంటుకు చెల్లు చీటీ….
మండలి రద్దు ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. హైకోర్టు నుంచి రాజధాని విషయంలో స్పష్టత ఏనాటికి వస్తుందో క్లారిటీ లేదు. మరోవైపు వేలాది ఎకరాల భూములు, సగం మేరకు పూర్తయిన నిర్మాణాలు వృథాగా పడి ఉన్నాయి. ప్రభుత్వానికి ఆర్థిక వనరులు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. దీంతో అమరావతిలో ఒక కదలిక తీసుకురావాలనే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు తెలుస్తోంది. శాసనరాజధానిపై సర్కారు ద్విముఖ వ్యూహం అనుసరించేందుకు సిద్ధమవుతోంది. అమరావతిని ఆర్థిక వనరుగా మార్చితే రైతులు చల్లబడతారు. భూముల విలువ పెరిగితే చాలు ఆందోళన దానంతటదే చల్లబడిపోతుంది. ముఖ్యంగా అమరావతి రాజధాని సెంటిమెంటును రగిలించింది తెలుగుదేశం పార్టీ. ఈ ప్రాంతంలో తమ భూములు ఇవ్వడం వల్ల వాటి విలువ పదిరెట్ల వరకూ పెరుగుతుందనే అంచనాతోనే ఎక్కువ మంది వాటిని సర్కారుకు అప్పగించారు. ఆయా భూములను ప్రభుత్వం అభివృధ్ది చేసి దాదాపు నాలుగోవంతు తిరిగి రైతులకు ప్లాట్ల రూపంలో కేటాయిస్తుంది. దానిని విక్రయించినా, అపార్టుమెంట్లు నిర్మించినా , వాణిజ్య కార్యకలాపాలకు వినియోగించినా భారీగా లాభపడతామనేది రైతుల యోచన. రాజధాని తరలిపోతే మొత్తం ఆశలు తలకిందులవుతాయి. సెంటిమెంటును పక్కనపెట్టినా తాము ఆర్థికంగా నష్టపోకుండా చూడగలిగితే చాలనుకునే రైతుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. దీనిపైనే ప్రస్తుతం వైసీపీ సర్కారు కార్యాచరణ మొదలు పెట్టింది.
నాలుగువేల కోట్ల ఆదాయం….
అమరావతిలో కార్యకలాపాలు ముమ్మరం చేయాలి. దాంతో సహజంగానే భూములకు విలువ పెరుగుతుంది . ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. విశాఖ కార్యనిర్వాహక రాజధాని అంశం ప్రస్తుతానికి పక్కనపెట్టి ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న అమరావతిని విద్య,వ్యవసాయ కేంద్రంగా తీర్చిదిద్దే ప్రణాళికపై వేగంగా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. రవాణా, జలవనరులు అందుబాటులో ఉన్న ఈ కీలక ప్రాంతంలో పెద్ద స్థాయి సంస్థలను నెలకొల్పితే , ప్రయివేటు కార్పొరేట్లకు భూ కేటాయింపులు చేయగలిగితే భూ విలువలు వాటంతటవే పెరుగుతాయి. ఈరకంగా యాక్టివిటీ పెంచడంతో ఆందోళనలు శాంతిస్తాయన్న అంచనాకు ప్రభుత్వం వచ్చినట్లు చెబుతున్నారు. అమరావతిలో ఇప్పటికి పెండింగులో ఉన్న నిర్మాణాలను పూర్తి చేసి విక్రయించగలిగితే ప్రభుత్వానికి నాలుగువేల కోట్ల రూపాయల వరకూ ఆదాయం వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. నివాసాల నిమిత్తం చేపట్టిన 4200 అపార్టుమెంట్లు 70శాతం మేరకు పనులు జరిగాయి. ఖరీదైన నివాసాలుగా తీర్చిదిద్దాలనుకున్న 180 బంగాళాలు 25 శాతం మేరకు నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయి. కేవలం శాసన రాజధానికే అమరావతిని పరిమితం చేస్తే ఇంత పెద్ద స్థాయిలో వసతులు అవసరం లేదు. అందుకే వీటిని పూర్తి చేసినప్పటికీ లీజులు లేదా అమ్మకానికి పెట్టాలి. ఈ ప్రాంతం ఒక ప్రధాన ఆర్థిక, రాజకీయ కేంద్రంగా ఉంటుందనే నమ్మకం కలిగితే తప్ప కొనుగోళ్లు సాగవు. వృథా భవనాలు, భూములను వినియోగంలోకి తెస్తే కొనుగోళ్లకు డోకా ఉండదు. అందుకే పీపీపీ మోడల్ లో కొన్ని ప్రాజెక్టులపై కసరత్తు సాగుతోంది. భూకేటాయింపులు, విక్రయాలతో నూతన సంస్థలను రంగంలోకి దింప బోతున్నారు. అభివ్రుద్ధి కార్యక్రమాలను రైతులు అడ్డుకునే అవకాశాలు అంతంతమాత్రమే. దీనివల్ల ఉభయతారకంగా ప్రభుత్వానికి ప్రయోజనం సమకూరుతుంది. రైతులకు కేటాయించే ప్లాట్ల వల్ల గరిష్ఠంగా వారికి కూడా ఊరట దొరుకుతుంది.
రాజకీయానికి చెక్…
రాష్ట్రంలో రాజధాని రాజకీయ అంశంగా మారిపోయింది. ఇది వైసీపీ, ఇతర రాజకీయ పార్టీలు వివాదంగా చూస్తున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఆందోళనలకు గట్టి మద్దతుదారుగా నిలుస్తోంది. రాష్ట్రస్థాయిలో ఆందోళనలు నిర్వహించాలని ప్రయత్నించినా వైసీపీ ప్రతివ్యూహం టీడీపీ ఆత్మరక్షణలో పడవేసింది. అందువల్లనే అమరావతి రాజధానికి మద్దతుగా ఉత్తరాంధ్ర,రాయలసీమల్లో తెలుగుదేశం మద్దతును సమీకరించలేకపోయింది. తొలిదశలో కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు సాగాయి. ఆ తర్వాత కాలంలో కేవలం అమరావతి ప్రాంతానికే పరిమితమయ్యాయి. తెలుగుదేశం అన్నివిధాలుగా ఆందోళనలకు సహకరిస్తోంది. తెలుగుదేశాన్ని, స్థానిక రైతులను వేరు చేయగలిగితే ఉద్యమాలు, ఆందోళనలు ముందుకు సాగవు. ఇక్కడి భూములకు డిమాండ్ పెరిగి విస్త్రుత స్థాయిలో కార్యకలాపాలు పుంజుకుంటే రైతులకు ఆశించిన ఫలితం లభిస్తుంది. సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకత తగ్గుముఖం పడుతుంది. భూములు ప్రయోజనదాయకంగా మారుతుంటే సమస్య సమసిపోతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.
-ఎడిటోరియల్ డెస్క్