జగన్ కు ఈ శాపాలేంటి…? నిజమవుతాయా ఏంది?
రాజకీయాల్లో అతి తెలివి తేటలు ఎక్కువైపోతున్నాయి. తమ గురించి, తమ పార్టీ గురించి నేతలు ఆలోచించడం మానేసి చాలా కాలం అయింది. ఎదుటి పార్టీని, ఆ పార్టీ [more]
రాజకీయాల్లో అతి తెలివి తేటలు ఎక్కువైపోతున్నాయి. తమ గురించి, తమ పార్టీ గురించి నేతలు ఆలోచించడం మానేసి చాలా కాలం అయింది. ఎదుటి పార్టీని, ఆ పార్టీ [more]
రాజకీయాల్లో అతి తెలివి తేటలు ఎక్కువైపోతున్నాయి. తమ గురించి, తమ పార్టీ గురించి నేతలు ఆలోచించడం మానేసి చాలా కాలం అయింది. ఎదుటి పార్టీని, ఆ పార్టీ నేతలను ముందు జనాలలో బదనాం చేస్తే ఆ మీదట కధ చూసుకోవచ్చు అన్న థియరీని అందరూ ఫాలో అవుతున్నారు. అంటే తాము బాగుపడడం అటుంచి ఎదుటివారు చెడిపోవాలని కోరుకుంటున్నారు అన్న మాట. అంటే తాము ఎత్తుకు ఎదగడం కష్టం కాబట్టి ప్రత్యర్ధి దిగజారి పక్కకు వస్తే అదే తమ గొప్పతనం అనుకుంటున్నారు.
జోస్యమేనా…?
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున అభ్యర్ధిగా ఉన్న చింతా మోహన్ బాగానే జోస్యాలు చెబుతున్నారు. ఏపీలో జగన్ సర్కార్ ఆరు నెలల్లో కూలిపోతుంది అని ఆయన అంటున్నారు. దానికి కారణాలు మాత్రం చెప్పడంలేదు. ఎందుకు కూలుతుంది అంటే మాత్రం జవాబు లేదు . కానీ జగన్ మాజీ సీఎం అయి తీరుతాడు అని బల్ల గుద్దుతున్నారు. సరే ఆయన ఆనందం అలా ఉంది అనుకుంటే వైసీపీ తరఫున ఎంపీగా గెలిచి సొంత పార్టీకి విపక్ష నేతగా మారిన రఘురామ క్రిష్ణం రాజు అయితే జగన్ ప్రభుత్వం త్వరలోనే ఇంటికెళ్ళడం ఖాయమని చాలా సులువుగా చెప్పేస్తున్నారు.
రీజన్ అదిట….
ఏపీ మొత్తం అప్పుల పాలు అయిందని, జగన్ ప్రభుత్వం నిండా మునిగిందని, ఇక కొత్తగా ఒక్క పైసా కూడా పుట్టే చాన్స్ లేదని ఎంపీ రఘురామ అంటున్నారు. అందువల్ల చాలా తొందరలోనే జగన్ సర్కార్ కూలిపోవడం ష్యూర్ అని చెప్పేస్తున్నారు. సరే అప్పులకూ జగన్ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమేంటి అన్నది మాత్రం రాజు గారు చెప్పడంలేదు. ఆ మాటకు వస్తే ఈ దేశంలో దాదాపుగా అన్ని రాష్ట్రాలు అప్పుల్లోనే ఉన్నాయి. మోడీ గద్దెనెక్కాక ఏడేళ్లలో లక్ష కోట్లకు పైగా దేశానికి అప్పులు పెంచారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. పొరుగున తెలంగాణాలోనూ ప్రభుత్వానికి అప్పులు ఉన్నాయని అంటున్నారు. మరి అక్కడ లేని కుప్ప కూలడాలు కేవలం జగన్ కే వస్తాయా అంటే రాజు గారి వద్ద బహుశా సమాధానం ఉండదేమో.
పార్టీ పోదుగా….?
సరే నిన్నటిదాకా టీడీపీకే ఈ ఆశలు ఉన్నాయనుకుంటే ఇపుడు జగన్ ప్రత్యర్ధులందరికీ ఒక్కసారిగా దురాశలు కలుగుతున్నాయి. జగన్ జైలు కెళ్తాడని ఒకరు, మాజీ అవుతారని మరొకరు, అప్పుల కుప్పతో సర్కార్ కూలుతుందని మరొకరు ఇలా చేస్తున్న ప్రచారంలో ఏదో ఒకటి నిజమై జగన్ మాజీ సీఎం అయ్యాడనే అనుకుందాం. మళ్లీ ఎన్నికలు రావా. అపుడు వైసీపీ పోటీ చేయదా. జనాదరణ ఉంటే మళ్లీ అధికారంలోకి రాదా. ఈ చిన్న లాజిక్ ని మరచిపోయి జగన్ అర్జంటుగా మాజీ అయిపోవాలని కోరుకోవడం, పిల్లి శాపాలు పెట్టడం ఎందుకో అర్ధం కాదన్న మాట అయితే ఉంది. జగన్ కి జనాల్లో ఆదరణ తగ్గి వారే ఓడిస్తే తప్ప ఆయన సర్కార్ కి ఇప్పట్లో వచ్చే చిక్కులేవీ లేదని కూడా రాజకీయ పరిశీలకులు అంటున్న మాట. ఏది ఏమైనా ఏపీలో అక్టోపస్ లు ఎక్కువైపోయారు అన్నది మాత్రం నిజం.