జగన్ మార్క్ రాజకీయ ఉపాధి హామీ పధకం…?
రాజకీయాల్లో ఉన్న వారికి పని ఉండదా అంటే ఉంటుంది. కళ్ళు పెట్టి చూస్తే చాలానే కనిపిస్తుంది. అసలు భారతదేశం లాంటి చోట్ల గజానికి డజను సమస్యలు పోగై [more]
రాజకీయాల్లో ఉన్న వారికి పని ఉండదా అంటే ఉంటుంది. కళ్ళు పెట్టి చూస్తే చాలానే కనిపిస్తుంది. అసలు భారతదేశం లాంటి చోట్ల గజానికి డజను సమస్యలు పోగై [more]
రాజకీయాల్లో ఉన్న వారికి పని ఉండదా అంటే ఉంటుంది. కళ్ళు పెట్టి చూస్తే చాలానే కనిపిస్తుంది. అసలు భారతదేశం లాంటి చోట్ల గజానికి డజను సమస్యలు పోగై ఉంటాయి. వాటిని పట్టించుకుని పోరాడవచ్చు. కానీ అన్ని సమస్యలూ హైలెట్ కావు. జనాల అటెన్షన్ లోకి వెళ్లవు, ఎక్కడైతే అధికార పార్టీ ఇరుకున పడుతుందో వాటిని పట్టుకుని గట్టిగా వేలాడితే ఆ పొలిటికల్ గెయిన్ చాలానే వస్తుంది. ఢీ అంటే ఢీ అన్న పాలిటిక్స్ ఉన్న చోట ఇది మరింత ఎక్కువగా వర్కౌట్ అవుతుంది. ఏపీలో చూసుకుంటే టీడీపీ వైసీపీల మధ్య నిత్యాగ్నిహోత్రం అలా రగులుతూనే ఉంటుంది. ఇక జగన్ , చంద్రబాబుల మధ్య పచ్చగడ్డిని పెట్టినా అగ్గిపుల్ల కూడా అక్కరలేకుండానే భగ్గుమంటుంది.
కోరి మరీ …
జగన్ విషయంలో అదే పెద్ద సమస్య. తాను పట్టిన కాళ్ళకు మూడే కాళ్ళు అనే రకం. ఆయన అనుకున్నది జరిగిపోవాలంటారు. ఏడాది పాటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో తెగేదాకా లాగిన ఎపిసోడ్ చూసిన వారికి జగన్ అంటే పూర్తిగా తెలిసివచ్చింది. ఇక కాదు అంటే అవును అనే విపక్ష రాజకీయ ఏపీలో ఉండగా జగన్ ది ఎపుడూ వన్ సైడ్ పాలిటిక్స్ గానే ఉంటుంది. ఆయన ప్రతీ సారి అడ్డంగా దొరికిపోతూంటారు. దాని వల్ల విపక్షాలకు అజెండా ఆయనే చక్కగా అందిస్తారు. ఇంటర్, టెన్త్ పరీక్షల విషయంలో జగన్ చేస్తోంది మంచి అనుకుంటున్నారు. కానీ అక్కడ విద్యార్ధుల తల్లిదండ్రుల మూడ్ ని ఆయన పట్టించుకోవడంలేదు అన్న విమర్శ అయితే ఉంది.
కరోనా బురద …
ఏపీలో అసలు కరోనా ఎలా విస్తరించింది అన్నది అందరికీ తెలిసిందే. వైసీపీ లోకల్ బాడీ ఎన్నికలకు వద్దు అంటే విపక్షాలు కావాలంటూ కోర్టు మెట్లు ఎక్కాయి. ఇక నాటి ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అయితే సరేసరి. మొత్తానికి అంతా కలసి జగన్ వద్దన్నాడు అన్న ఒకే ఒక్క దాన్ని పట్టుకుని ఎన్నికలు పెట్టించారు. దాంతోనే ఏపీలో కరోనా వ్యాపించింది అన్నది అంతా ఒప్పుకుంటారు. ఇక తిరుపతి ఉప ఎన్నికల్లో తండ్రీ కొడుకులు టీడీపీ తరఫున ఏకంగా పక్షం రోజుల పాటు కలియతిరిగేసినపుడు కూడా కరోనా గుర్తుకురాలేదు. ఇపుడు ఏపీలో పరీక్షలు నిర్వహిస్తామంటే మాత్రం కరోనా పేరిట రాజకీయమాడుతున్నారు. సరే రోజురోజుకూ కరోనా పెరుగుతోంది కాబట్టి జగన్ కూడా తగ్గి ఉండాల్సింది అన్న మాట అయితే ఉంది. కానీ జగమొండి జగన్ కాబట్టే విపక్షాలు మేత బాగా దొరుకుతోంది. తిరుపతి ఉప ఎన్నిక తరువాత ఆవురావురుమని ఉన్న వారికి ఇపుడు కొత్త ఆయుధం దొరికింది. పైగా ఏపీలో జగన్ విధానాల వల్లనే కరోనా ఎక్కువ అవుతోంది అని బురద కూడా జల్లేస్తున్నారు.
అమెరికా పాల్ కూడా..?
ఎక్కడో అమెరికాలో ఉండే ప్రజా శాంతి ప్రెసిడెంట్ పాల్ కూడా విశాఖలో దీక్ష చేసేలా చేస్తున్నారు అంటే జగన్ ఏ ఒక్క విపక్షాన్ని వదలడంలేదు. తనదైన పోకడలతో వారికి చక్కగా అస్త్రాలు అందిస్తున్నారు అనుకోవాలి. వామపక్షాలు, బీజేపీ, ఆఖరుకు కరోనా బారిన పడి కోలుకుని రెస్ట్ తీసుకుంటున్న జనసేనాని కూడా జగన్ మీద లేఖాస్త్రాలు సంధించడానికి సరిపడే రాజకీయ సరుకులను జగన్ ఏదో ఒకటి తెచ్చి మరీ ఇస్తున్నారు అనుకోవాలి. సరే దీని వల్ల వారు పెరుగుతున్నారా జగన్ తగ్గుతున్నారా అన్నది చర్చ కాదు కానీ ప్రతీ రోజూ ఏదో ఒక తలనొప్పి ఉంటే పాలకులకు ఎలా తోస్తోంది అన్న మాట అయితే ఉంది. ఏది ఏమైనా విపక్షానికి సమస్యలు కావాలి. కానీ వారికి శ్రమ లేకుండా జగన్ అందిస్తున్నా ఆయుధాలు ఒక్కోటీ ఏరుకుంటే రేపటి రోజున వారే బలంగా దూసుకువస్తారా అన్నదే ఇక్కడ డౌట్. ఇక ఉపాధి హామీ పధకం మాదిరిగా రాజకీయ నాయకుల చేతికి, నోటికీ పని మాత్రం జగన్ బాగా ఇస్తున్నాడు అన్నది మాత్రం నిజం.