బూమ్ రాంగ్ అవుతుందేమో చూడు జగన్?
ప్రభుత్వం అంటే ప్రజలకు అవసరమైన సదుపాయాలు, వసతులు కల్పిస్తూ శాంతి భద్రతలను పరిరక్షిస్తూ పరిపాలన చేయాలనేది విధానం. అన్నిటా తామున్నామంటూ అనవసరమైన బురద జల్లుకుంటుంటాయి కొన్ని సర్కారులు. [more]
ప్రభుత్వం అంటే ప్రజలకు అవసరమైన సదుపాయాలు, వసతులు కల్పిస్తూ శాంతి భద్రతలను పరిరక్షిస్తూ పరిపాలన చేయాలనేది విధానం. అన్నిటా తామున్నామంటూ అనవసరమైన బురద జల్లుకుంటుంటాయి కొన్ని సర్కారులు. [more]
ప్రభుత్వం అంటే ప్రజలకు అవసరమైన సదుపాయాలు, వసతులు కల్పిస్తూ శాంతి భద్రతలను పరిరక్షిస్తూ పరిపాలన చేయాలనేది విధానం. అన్నిటా తామున్నామంటూ అనవసరమైన బురద జల్లుకుంటుంటాయి కొన్ని సర్కారులు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ కోవలోనే తీసుకుంటున్న తాజా నిర్ణయం సినిమా టిక్కెట్లను ప్రభుత్వ వెబ్ సైట్ల ద్వారా విక్రయించాలనే ఆలోచన. ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడని, ప్రభుత్వానికి సంబంధం లేని ఈ అమ్మకాల గోలపై ఇప్పటికే రచ్చ సాగుతోంది. అదనపు ఆదాయం వస్తుందనో, సినిమా పరిశ్రమ తమ గుప్పెట్టో ఉంటుందనో ఈ నిర్ణయం తీసుకుంటే అది బూమ్ రాంగ్ అయ్యే ప్రమాదమే ఎక్కువ. పైపెచ్చు సినిమా పరిశ్రమ నుంచి ప్రజల నుంచి కొంతమేరకు వ్యతిరేకత ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే కష్టాల్లో, నష్టాల్లో ఉన్న పరిశ్రమ నిండా మునిగిపోయే సూచనలున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాల్సిన ప్రభుత్వానికి ఈ కొసరు పనులు ఎందుకనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కిక్కు ఇచ్చిన ఆదాయం…
మద్యం వ్యాపారాన్ని జగన్ ప్రభుత్వం ఇప్పటికే నియంత్రణలోకి తెచ్చుకుంది. దానివల్ల వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిపడుతోంది. మద్యం వ్యాపారం చేయడమన్నది ప్రభుత్వానికి మంచి ఇమేజ్ ఇచ్చే విషయం కాదు. కానీ భవిష్యత్తులో నిషధం అమలు చేసే ఆలోచన ఉంది కాబట్టి నియంత్రించడానికి ఈ వ్యాపారంలోకి దిగినట్లుగా ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పుడు ఆ ఆలోచనలు విరమించుకున్నట్లే. మద్యం నుంచి వస్తున్న ఆదాయాన్ని ష్యూరీటిగా చూపిస్తూ అప్పులు చేస్తోంది. అంటే భవిష్యత్తులో నిషేధం అమలుకు గండి పడినట్లే. తాగుబోతుల సంఖ్య పెరిగిపోతోంది కాబట్టి నిర్దిష్టవేళల్లో సక్రమంగా అమ్మకం చేయడానికి మద్యం షాపులు నిర్వహిస్తున్నామని చెబితే సరిపెట్టుకోవచ్చు. కానీ సినిమా టిక్కెట్ల అమ్మకాన్ని ఆ రకంగా సమర్థించుకోలేదు. ప్రభుత్వ దైనందిన కార్యక్రమాలకు, వినోద పరిశ్రమలో టిక్కెట్ల విక్రయానికి అసలు ఎటువంటి సంబంధమూ లేదు.
చేయాల్సిందెంతో …
ప్రజలకు అవసరమైన రహదారులు, ఉపాధి కల్పన, సేవలు, పన్నుల వసూళ్లు, విద్య, వైద్య సదుపాయాలు …ఇలా చూస్తే తలకు మించిన రాజ్యాంగబాధ్యతలు జగన్ ప్రభుత్వంపై ఉన్నాయి. వాటిని సక్రమంగా నిర్వహించడం ద్వారానే ప్రజల్లో పలుకుబడి పెరుగుతుంది. సినిమా టిక్కెట్లు అమ్మడం ప్రభుత్వాల బాద్యత కాదు. అందులోనూ ఇప్పటికే డిస్టిబ్యూటర్లు, ఎగ్గిబిటర్లుగా పక్కా వ్యవస్థీకృతమైన యంత్రాంగం ఉంది. అంతా సజావుగా సాగిపోతోంది. ప్రభుత్వానికి వినోదపన్ను రూపంలో భారీగానే ఆదాయం లభిస్తోంది. ఇప్పుడు టిక్కెట్ల వ్యాపారంలోకి దిగితే మళ్లీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని థియేటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య పంపిణీ చేయాలి. ఇదంతా పెద్ద తతంగం. సినిమా వ్యాపారానికి సంకెళ్లు వేసినట్లవుతుంది. పైపెచ్చు ఉద్యోగుల సహా పెద్ద వ్యవస్థను కొత్తగా నెలకొల్పుకోవాలి. పరిపాలనకు సంబంధించి సవాలక్ష కార్యక్రమాలు ఉండగా ఈ వాణిజ్య రంగంలో ప్రభుత్వం ప్రవేశించాలనుకోవడం దేశంలోనే ఇది తొలిసారి.
నిండా మునుగుతుంది…
ఒకప్పుడు తెలుగుసినీ పరిశ్రమ హిందీ పరిశ్రమకు దీటుగా వెలుగుతుండేది. సంఖ్యాపరంగా బాలీవుడ్ కంటే అత్యధిక సినిమాలు తెలుగులోనే నిర్మాణమవుతుండేవి. 2000 సంవత్సరం వరకూ ఈ ట్రెండ్ కొనసాగింది. దక్షిణాదిలో అత్యధిక వనరులు, థియేటర్లతో కళకళలాడే పరిశ్రమ క్రమేపీ దిగజారుతూ వచ్చింది. మొత్తం నిర్మాణ వ్యయంలో సగానికి పైగా హీరోల రెమ్యునరేషన్ చేరిపోవడం, సృజనాత్మకత లోపించడంతో తెలుగు సినిమాల పట్ల ప్రేక్షకులకే ఏవగింపు పెరిగింది. తమిళం, మళయాళం నుంచి వచ్చే డబ్బింగ్ చిత్రాలను ప్రజలు ఆదరించడం మొదలు పెట్టారు. దక్షిణాదిలో తన నంబర్ వన్ స్థానాన్ని కోల్పోయింది. రాష్ట్ర విభజన తర్వాత ఇది మరింతగా కనిపించింది. తెలుగులో తీస్తున్న పది సినిమాల్లో ఎనిమిది నష్టాల్లోనే ఉంటున్నాయి. కరోనా దెబ్బతో అత్యధికంగా నష్టపోయిన రంగమూ ఇదే. ఈ స్థితిలో పరిశ్రమను బ్రతికించడానికి ప్రభుత్వాలు సహకరించాల్సిన అవసరం ఉంది. కానీ తమ గుత్తాధిపత్యంలోకి సినిమాను తెచ్చుకోవాలనుకుంటే మొత్తం పరిశ్రమే దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఓటీటీ వేదికల నుంచి పెద్ద పోటీ ఎదురవుతోంది. ఇక జగన్ సర్కారు జోక్యమూ పెరిగితే థియేటర్లు మూతపడటము, సినిమా నిర్మాణాలు నిలిచిపోవడమూ ఖాయమనే చెప్పాలి.
-ఎడిటోరియల్ డెస్క్