జగన్ శత్రువులు ఎక్కువయ్యారే
వైఎస్సార్ కుటుంబానికి మంచి చేయడమే తెలుసు అంటారు. ఆ విషయంలో వారు వెనకా ముందు కూడా ఆలోచన చేయరని కూడా చెబుతారు. ఇచ్చిన మాట తప్పరని కూడా [more]
వైఎస్సార్ కుటుంబానికి మంచి చేయడమే తెలుసు అంటారు. ఆ విషయంలో వారు వెనకా ముందు కూడా ఆలోచన చేయరని కూడా చెబుతారు. ఇచ్చిన మాట తప్పరని కూడా [more]
వైఎస్సార్ కుటుంబానికి మంచి చేయడమే తెలుసు అంటారు. ఆ విషయంలో వారు వెనకా ముందు కూడా ఆలోచన చేయరని కూడా చెబుతారు. ఇచ్చిన మాట తప్పరని కూడా పేరుంది. ఇక వైఎస్సార్ విషయంలో కూడా లౌక్యం పెద్దగా లేదని, అందుకే ఆయన మూడు పదుల వయసులో పీసీసీ ప్రెసిడెంట్ అయినా అయిదున్నర పదులు వచ్చేంతవరకూ సీఎం కాలేకపోయారని చెబుతారు. ఎంతైనా కాంగ్రెస్ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి వైఎస్సార్ కాలక్రమేణా తనను తాను కొంత తీర్చిదిద్దుకుంటూ ముందుకు సాగారు. రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన వైఎస్సార్ కి కాంగ్రెస్ లో మిత్రులు ఎంతమంది ఉన్నారో శత్రువులు కూడా అంతమందే ఉన్నారంటారు. ఆయన పొడగిట్టని వారితో సఖ్యత పెంచుకోవడానికి వైఎస్సార్ పెద్దగా ప్రయత్నం చేసినదీ లేదని అంటారు.
అన్నీ గుర్తేనట…..
ఇక జగన్ విషయానికి వస్తే ఈ విషయంలో వైఎస్సార్ కంటే నాలుగాకులు ఎక్కువ చదివారు. లౌక్యం జగన్ కి కూడా లేదు. తండ్రి కంటే దూకుడు పాళ్ళు ఎక్కువ. వైఎస్సార్ తనవరకూ రాజకీయ శత్రువులతో రాజీ పడకపోయినా ఎవరైనా శరణు అని వస్తే మాత్రం ఆదరించి వదిలేసే గుణం ఉందని అంటారు. అయితే జగన్ అలా కాదని, ఆయనకు అన్నీ గుర్తేనని, తనను బాగా బాధ పెట్టిన వారిని గుర్తుంచుకుని తగిన సమయం చూసి మరీ షాక్ ట్రీట్ మెంట్ ఇస్తారని కూడా చెబుతూంటారు. బహుశా ఈ రకమైన ధోరణి వల్లనే జగన్ కి రాజకీయంగా శత్రువులు ఎక్కువగా తయారయ్యారని అంటారు. సాధారణంగా రాజకీయాల్లో విధానపరమైన శత్రుత్వం ఉంటుంది. కానీ వైఎస్సార్ కి కానీ జగన్ కి కానీ అది వ్యక్తిగతం దాకా వచ్చింది. ఆ విషయంలో తండ్రి కంటే ఎక్కువగా జగన్ ఇబ్బంది పడుతున్నారంటే నిజమేననిపిస్తుంది.
ముక్కుసూటితనమేనా…?
జగన్ ఏదీ నాన్చరు. అలాగే ఎవరి విషయంలోనూ ఉపేక్షించరు. ఎవరికైనా తాను చేయలేకపోతే ముఖం మీదే చెప్పేస్తారు. ఓ విధంగా ఆది నిష్టూరం బెటర్ అనుకుంటారు. ఇదే ఇపుడు జగన్ కి శత్రువులను ఎక్కువగా చేస్తోంది. రాజకీయం అనగానే అన్ని రకాల వ్యక్తులు ఉంటారు. ముఖ్యంగా అన్నీ ఆశించి వచ్చేవారు ఉంటారు. అటువంటి వారిని చేరదీసి హామీలు ఇస్తూ ఆశలు కల్పిస్తూ పోవాలి. కానీ జగన్ అలా కాదు, మాట ఇస్తే నెరవేర్చాలి. కాదు అనుకుంటే చెప్పేయాలి. ఇదే రాజకీయ విధానం. దీని వల్ల సొంత పార్టీలో కూడా ఎమ్మెల్యేలు ఇపుడు జగన్ తీరు పట్ల గుర్రుగా ఉంటున్నారని అంటున్నారు. జగన్ అంటే ప్రాణం పెట్టే వారు, ఆయన కుటుంబం రాజకీయంగా వెలిగిపోవాలని కోరుకునేవారు సైతం ఇపుడు జగన్ కి కొంత ఎడం జరుగుతున్నారంటే జగన్ జాగ్రత్త పడడం మంచిదేమో. ముక్కుసూటితనంతో రాజకీయాల్లో కొనసాగలేరనడానికి కళ్ల ముందే అలనాటి ఎన్టీయార్ ఉదంతం ఉంది. మరి జగన్ కూడా అలా దూకుడుగా పోతే ఇబ్బందులు పడతారని హితులు గట్టిగానే చెబుతున్నారట.