ఆ ఇద్దరు ..అదే దారిలో…?
తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్రల సీజన్ మళ్లీ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాజకీయ నేతలకు తమ పార్టీలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఇదో దగ్గరి దారిగా కనిపిస్తోంది. ప్రచారంతో పాటు [more]
తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్రల సీజన్ మళ్లీ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాజకీయ నేతలకు తమ పార్టీలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఇదో దగ్గరి దారిగా కనిపిస్తోంది. ప్రచారంతో పాటు [more]
తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్రల సీజన్ మళ్లీ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాజకీయ నేతలకు తమ పార్టీలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఇదో దగ్గరి దారిగా కనిపిస్తోంది. ప్రచారంతో పాటు నాయకుల ఇమేజ్ పెరుగుతుంది. ప్రజల్లో కొంత సానుభూతి ఏర్పడుతుంది. అన్ని ప్రాంతాలను చుట్టి రావడం వల్ల ప్రత్యక్షంగా అక్కడి సమస్యలపై నాయకులకు అవగాహన కలుగుతుంది. అందువల్ల పాదయాత్రలు బహుముఖ ప్రయోజనాలకు కారణమవుతున్నాయి. రాజశేఖరరెడ్డి, చంద్రబాబు, జగన్ లు ఇదే మార్గంలో తమ అధికారానికి బాటలు వేసుకున్నారు. గడచిన రెండు దశాబ్దాల్లో తెలుగు రాష్ట్రాల్లో వీటి ప్రాబల్యం బాగా పెరిగింది. ఇటీవల తీన్మార్ మల్లన్న వంటి సామాన్యుడు పాదయాత్రతో ఎమ్మెల్సీ ఎన్నికలో తన ఇమేజ్ ను అమాంతం పెంచుకుని అధికారపార్టీకి చుక్కలు చూపించారు. వీటన్నిటిని పరిగణనలోకి తీసుకుంటే వచ్చే అయిదారు నెలల కాలవ్యవధిలో ఇద్దరు ప్రముఖ నేతలు అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ లలో పాదయాత్రలకు సన్నాహాలు చేసుకోనున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. రాజన్న రాజ్యం పేరిట తెలంగాణలో కొత్త పార్టీకి శ్రీకారం చుట్టాలనుకుంటున్న షర్మిల తెలంగాణ కేంద్రంగా యాత్రకు శ్రీకారం చుడతారని ప్రచారం సాగుతోంది. మరోవైపు తెలుగుదేశం పార్టీకి పునరుజ్జీవం కల్పించేందుకు లోకేశ్ ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర చేయాలనే డిమాండ్ పార్టీ నుంచి వినవచ్చినట్లు తెలుస్తోంది. వీరి ప్రాంతాలు వేరు, కానీ ప్రజలతో అనుబంధం పెంచుకోవడం ద్వారా రాజకీయ ఉత్థానానికి బాటలు వేసుకోవాలనేది అంతిమ లక్ష్యం.
అంతుచిక్కట్లేదు…
షర్మిల పార్టీ వ్యవహారం ఇప్పటికీ అంతుచిక్కని రహస్యం. ఎవరో వెనక ఉండి నడిపిస్తున్నారనే అనుమానం వెన్నాడుతోంది. ఆమె తన పార్టీ ద్వారా ఏం సాధించదలచుకున్నారో రెండు రాష్ట్రాల్లోని నాయకులకు సందేహమే. నిజంగానే తెలంగాణ ఫోకస్ గా పార్టీ నడుపుతారా? లేకపోతే అవకాశాన్ని బట్టి ఆంధ్రకు విస్తరిస్తారా? అనే అనుమానాలూ ఉన్నాయి. ముందుగా ప్రజల్లో యాక్టివ్ గా ఉండి పొలిటికల్ కసరత్తు చేసేందుకు తెలంగాణ గడ్డను వేదికగా వినియోగించుకుంటున్నారనే భావన వ్యక్తమవుతోంది. వై.ఎస్. అడుగు జాడలకు వ్యతిరేకంగా ఆంధ్రాలో ఏదేని పరిణామం చోటు చేసుకుంటే స్పందిస్తారు. అంతవరకూ తెలంగాణనే తన కార్యక్షేత్రంగా కొనసాగిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. పూర్తిగా ఆంధ్రాను వదిలేస్తారని ఎవరూ చెప్పడం లేదు. తెలంగాణకు సంబంధించి పెద్దగా రాజకీయ ఆకాంక్షలు, ఆశలు పెట్టుకునే వాతావరణం లేదు. ఏప్రిల్ లో తొలి బహిరంగ సభ నిర్వహించనున్న ఖమ్మం జిల్లాతో పాటు నల్గొండ, హైదరాబాద్; రంగారెడ్డి ప్రాంతాలలో మాత్రమే పార్టీకి కొంత కదలిక వస్తుందని అంచనా. ముఖ్యంగా ఈ నాలుగు జిల్లాల్లో 13 నియోజకవర్గాల్లో కొంత ప్రభావం చూపించగలుగుతారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో బలహీనపడిన స్థితిలో ఉన్న తెలుగుదేశం పార్టీ, షర్మిల పెట్టబోయే పార్టీలు రెండూ ఇంచుమించు ఒకే విధమైన బలాబలాలను కలిగి ఉంటాయని పేర్కొంటున్నారు. ఓవరాల్ గా ఫలితాలను తారుమారు చేయగల స్థాయి రాకపోవచ్చునంటున్నారు.
అదే మొండితనం…
పక్క రాష్ట్రంలో అధికారంలో ఉండి , తెలంగాణలో బలమైన ఇన్ ఫ్లూయన్స్ ఉన్నప్పటికీ జగన్ మోహన్ రెడ్డి తనది కాదని ఈ రాష్ట్రాన్ని వదిలేసుకున్నారు. రాజకీయంగా ఇక్కడ పెద్దగా సాధించేదేమీ లేదనేది ఆయన నమ్మకం. అటువంటి వాతావరణంలో షర్మిల రంగంలోకి దిగి రాజన్న రాజ్యం స్థాపిస్తాననడం ఒక రకంగా మొండితనమే. గతంలో 3,112 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రజల్లో రాజకీయ వేడి రగించిన ఘనత షర్మిలకే దక్కుతుంది. ప్రపంచ చరిత్రలోనే ఒక మహిళ ఇంతటి సుదీర్ఘ పాదయాత్ర చేసిన సంఘటనలు లేవు. అప్పుడు షర్మిల కష్టం వైసీపీకి ఉపయోగపడింది. ఇప్పుడు తన సొంత రాజకీయ భవిష్యత్తు కోసం మరోసారి పాదయాత్ర ద్వారా ప్రజలను పలకరించాలని ఆమె యోచిస్తున్నారు. వై.ఎస్. అభిమానులందరూ పార్టీ గూటికి చేరేందుకు పాదయాత్రను మించి సాధనం లేదనేది షర్మిల ఆంతరంగికుల వ్యూహం. పార్టీ నిర్మాణానికి ఈచర్య ఉపయోగపడుతుంది. ప్రజా క్షేత్రంలో ప్రదాన పక్షంగా పోటీనిచ్చేందుకు కూడా ఇదే సరైన మార్గమని పరిశీలకులు చెబుతున్నారు.
చూపు లోకేశ్ వైపు..
తెలుగుదేశం లో చంద్రబాబు నాయుడి తర్వాత ఎవరన్న ప్రశ్న తలెత్తదు. కానీ రాజకీయ సామర్థ్యం విషయంలో సవాలక్ష సందేహాలు వెన్నాడుతున్నాయి. లోకేశ్ ఇంతవరకూ తనను తాను నిరూపించుకోలేకపోయారు. 2014 ఎన్నికలకు ముందు 2800 కిలోమీటర్ల పాదయాత్ర చేసి చంద్రబాబు రికార్డు సృష్టించారు. పార్టీకి సానుభూతి రావడానికి కారణమయ్యారు. ప్రస్తుతం పార్టీ నిస్తేజమై పోయి కనిపిస్తోంది. నాయకుడిగా కార్యకర్తలలో ముద్ర వేసుకోవడానికి, ప్రజలకు చేరువ కావడానికి తండ్రి తరహాలోనే లోకేశ్ పాదయాత్ర చేపట్టాలని ఇటీవల కొందరు ముఖ్యులు సూచించినట్లు సమాచారం. అయితే ఇది తగిన సమయమేనా? అన్న ప్రశ్న టీడీపీని వెన్నాడుతోంది. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ద్వారా 3,648 కిలోమీటర్ల రికార్డు సాధించారు. దానిని అధిగమించే విధంగానే ప్రణాళిక ఉండాలనేది మరికొందరి సూచన. తెలంగాణపై టీడీపీకి పూర్తిగా ఆశ చావలేదు. కానీ అక్కడ పాదయాత్ర చేయడం వృథా ప్రయాస అని ఆంధ్రా నాయకులు చెబుతున్నారు. ఒకరాష్ట్రానికే పరిమితం అయితే గరిష్ఠంగా ప్రయోజనముంటుందంటున్నారు. మొత్తమ్మీద డైలమా కొనసాగుతోంది. మొత్తమ్మీద లోకేశ్ ప్రజల్లోకి వెళ్లాల్సిందేననేది పార్టీలో డిమాండ్. లేకపోతే పార్టీకి వారసుడిగా తనను తాను క్లెయిం చేసుకునే చాన్సు మిస్సవుతారనేది మెజార్టీ అభిప్రాయం.
– ఎడిటోరియల్ డెస్క్