ఇద్దరికీ టెన్షన్… ఎవరి పక్షాన నిలుస్తారో?
బీసీలు ఏపీలో దాదాపు యాభై శాతం పైగా ఉన్నారు. వారు గత నాలుగు దశాబ్దాలుగా టీడీపీకి అతిపెద్ద మద్దతుదారులు. అందుకే ఓడినా కూడా ఆ పార్టీ గౌరవంగా [more]
బీసీలు ఏపీలో దాదాపు యాభై శాతం పైగా ఉన్నారు. వారు గత నాలుగు దశాబ్దాలుగా టీడీపీకి అతిపెద్ద మద్దతుదారులు. అందుకే ఓడినా కూడా ఆ పార్టీ గౌరవంగా [more]
బీసీలు ఏపీలో దాదాపు యాభై శాతం పైగా ఉన్నారు. వారు గత నాలుగు దశాబ్దాలుగా టీడీపీకి అతిపెద్ద మద్దతుదారులు. అందుకే ఓడినా కూడా ఆ పార్టీ గౌరవంగా నిలిచేది. కానీ తొలిసారిగా 2019 ఎన్నికల్లో బీసీలు వైసీపీ వైపుగా మళ్ళారు. మేజర్ సెక్షన్ టీడీపీని దెబ్బకొట్టడంతో సైకిల్ కి భారీ పంక్చర్ అయింది. ఆ తరువాత బీసీల ఓటు బ్యాంక్ ని గట్టిపరచుకునేందుకు వైసీపీ సర్కార్ అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తోంది. అందులో భాగంగా వారికి నామినేటెడ్ పదవుల్లో, కాంట్రాక్టుల్లో, ఆలయ పాలకవర్గాల్లో, మంత్రివర్గంలో ఇలా అన్నింటా భారీ వాటా ఇచ్చి జగన్ తమ వైపునకు బీసీలను తిప్పుకునేందుకు వ్యూహరచన చేశారు.
టార్గెట్ అదే….
చివరికి బీసీలకు లోకల్ బాడీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున రిజర్వేషన్లు చేస్తూ మొత్తానికి 59.85 శాతంగా నిర్ణయిస్తూ జగన్ సర్కార్ సంచలనమైన నిర్ణయం తీసుకుంది. దాని వల్ల బీసీలకు పెద్ద ఎత్తున లాభం చేకూరేది. జెడ్పీ చైర్మన్ పదవులతో పాటు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఇలా దాదాపుగా 15 వేలకు పైగా పదవులు బీసీలకు అదనంగా లభించేవి. కానీ హైకోర్టు ఈ రిజర్వేషన్లను కొట్టేస్తూ యాభై శాతానికి కుదించమనడంతో బీసీలకు పెద్ద దెబ్బ పడింది. ఓ విధంగా జగన్ సర్కార్ బీసీలను సమాదరిద్దామనుకున్నా కూడా కోర్టు నిర్ణయం శరాఘాతంగా మారింది. దాంతో ఏమీ చేయలేని పరిస్థితిలో జగన్ సర్కార్ పడింది.
వ్యతిరేక ముద్ర….
ఇక జగన్ సర్కార్ అసమర్ధ వాదనల వల్లనే ఈ విధంగా బీసీలు నష్టపోయారని టీడీపీ పాట అందుకుంది. జగన్ కి బీసీల మీద ప్రేమ లేదని, కేవలం కక్ష మాత్రమే ఉందని యనమల రామకృష్ణుడు అంటున్నారు. చిత్తశుద్ధి ఉంటే సుప్రీం కోర్టు దాకా వెళ్ళి బీసీలకు పెంచిన రిజర్వేషన్లు ఖరారు చేయాలని కూడా వారు కోరుతున్నారు. మరో వైపు చంద్రబాబు బీసీ వ్యతిరేకి అని వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ అంటున్నారు. బాబుని, ఆయన పార్టీని అనేకమార్లు గెలిపించినందుకు ఇదా బహుమతి అని ఆయన నిలదీస్తున్నారు. బాబు పార్టీకి చెందిన బిర్రు ప్రతాపరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేసి రిజర్వేషన్లు ఆపారని కూడా ఆయన విమర్శించారు.
తులసీదళం ఎటు…?
బీసీలు ఇపుడు ఏ పార్టీ వైపు ఉంటారన్నది చూడాలి. మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా ఉన్నారు. ఇపుడు కూడా ప్రభుత్వం వారి మేలు కోసమే పనిచేస్తోంది.అదే సమయంలో మొదటి నుంచి టీడీపీలో బీసీలకు ఎక్కువ అవకాశాలు వచ్చాయి. అవన్నీ పక్కన పెడితే లేటెస్ట్ ఎపిసోడ్ లో ఎవరిని బీసీలు విలన్లుగా చూస్తారన్నది రెండు పార్టీలలోనూ టెన్షన్ గానే ఉంది. బీసీలను ఏదో చేయాలనుకున్నాం చేయలేకపోయాం అనే వైసీపీని నమ్ముతారా, లేక సుప్రీం కోర్టు దాకా కధను నడిపించలేదని పక్కన పెడతారా అన్నది ఒక చర్చ. మరో వైపు తమ పార్టీ వారిచేత కేసు వేయించి బీసీల నోట్లో మట్టి కొట్టి అదే నోటితో సుప్రీం దాకా ప్రభుత్వం వెళ్తే తాము కూడా ఒక పార్టీగా ఇంప్లీడ్ అవుతామని టీడీపీ అంటోంది. ఆ వైపు బీసీలు మొగ్గుతారా అన్నది లోకల్ బాడీ ఎన్నికల్లో తేలుతుంది. ఈసారి కూడా బీసీలు వైసీపీ వైపు ఉంటే మాత్రం టీడీపీకి అతి పెద్ద షాక్ గానే చూడాలి.