ys jagan : పొలిటికల్ మోనార్కిజం…?
ఆంధ్రప్రదేశ్ లో అధికారపార్టీ అన్ని స్థాయుల్లోనూ తన పెత్తనాన్ని ఖరారు చేసుకుంది. తాజాగా వెలువడిన ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో మరోసారి తనకు ఎదురులేదని చాటి చెప్పింది. ప్రతిపక్షాల పరాజయం [more]
ఆంధ్రప్రదేశ్ లో అధికారపార్టీ అన్ని స్థాయుల్లోనూ తన పెత్తనాన్ని ఖరారు చేసుకుంది. తాజాగా వెలువడిన ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో మరోసారి తనకు ఎదురులేదని చాటి చెప్పింది. ప్రతిపక్షాల పరాజయం [more]
ఆంధ్రప్రదేశ్ లో అధికారపార్టీ అన్ని స్థాయుల్లోనూ తన పెత్తనాన్ని ఖరారు చేసుకుంది. తాజాగా వెలువడిన ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో మరోసారి తనకు ఎదురులేదని చాటి చెప్పింది. ప్రతిపక్షాల పరాజయం పరిపూర్ణమని తేలిపోయింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రతిపక్షమే కనిపించని రీతిలో ఏకైక పక్షంగా వైసీపీ 90 శాతం పైగా స్థానాలను కైవసం చేసుకుంది. కొన్ని మండల పరిషత్తుల్లో అసలు ప్రతిపక్షమే ఉండదు. మరికొన్ని చోట్ల నామమాత్రంగా ఉండబోతోంది. అటు ఉత్తరాంధ్ర మొదలు ఇటు రాయలసీమ వరకూ అదే ధోరణి. అయిదునెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వెలువడిన ఫలితాలు అధికారపార్టీ వైసీపీకి సంబరమే. స్థానిక పాలనకు కీలకమైన మండలాలు, జిల్లా పరిషత్తుల్లో ప్రతిపక్షాలు కనుమరుగవ్వడం ప్రజాస్వామ్యానికి విషాదమే. అయితే ప్రతిపక్షాలు ఈ పరాభవానికి ముందుగానే సిద్దమయ్యాయి. క్షేత్రస్థాయిలో ట్రెండ్ ను గమనించి ఎన్నికల ఘట్టం చివరి దశలో తాము ఎన్నికలను బహిష్కరిస్తున్నామని తెలుగుదేశం ప్రకటించింది. అయితే అభ్యర్థులు మాత్రం బరిలోనే నిలిచారు. అధికారికంగా టీడీపీ పోటీలోనే ఉన్నట్లు చెప్పాలి. చాలా చోట్ల అభ్యర్థులు ప్రచారం కూడా చేశారు. అయితే అనూహ్యంగా తీవ్రమైన చేదు ఫలితం మిగిలింది.
ఏకైక పక్షం…
పదివేల పైచిలుకు ఎంపీటీసీలు, 550 వరకూ జెడ్పీటీసీలు కొత్తగా కొలువుతీరబోతున్నారు. అక్కడక్కడా మినహాయిస్తే దాదాపు అందరూ వైసీపీ అభ్యర్థులే. గతంలో ఎన్నడూ స్థానిక ఎన్నికల్లో ఈ రకమైన ఫలితాలు రాలేదు. తాను అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ గతంలో అనేక సార్లు స్థానిక ఎన్నికల్లో బలమైన ఆధిక్యం కనబరిచింది. కానీ అప్పట్లో కాంగ్రెసు అభ్యర్థులు గట్టి పోటీనే ఇచ్చేవారు. కనీసం 30శాతం వరకూ సీట్లు ప్రతిపక్షాల చేతిలో ఉంటుండేవి. చర్చలకు, వాదోపవాదాలకు అవకాశం ఉండేది. ఇప్పుడు ఫలితాలను బట్టి చూస్తుంటే స్థానిక సంస్థలు ప్రభుత్వానికి వత్తాసు పలికే వ్యవస్థగా రూపుదిద్దుకునే ప్రమాదం కనిపిస్తోంది. నిధుల వినియోగం, పనుల్లో జవాబుదారీతనంపై నిఘా కొరవడుతుంది. అధికారపార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నమాట వాస్తవమే. కానీ ప్రతిపక్షాలు కనీసం సంఘటితంగా పోరాడి ఉండాల్సింది. మండల పరిషత్తులు, జిల్లాపరిషత్తుల్లో నూటికి 20 మందైనా ప్రతిపక్ష అభ్యర్థులు ఉండేవారు. ఈ అవకాశాన్ని ప్రతిపక్షాలు చేజేతులారా పోగొట్టుకున్నాయి.
కొంపముంచిన కొట్లాటలు…
ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ స్థానిక ఎన్నికల్లో పుంజుకునే ప్రయత్నం చేయలేదు. పోటీకి ముందే చేతులెత్తేసింది. పార్టీ రహితంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తాము చాలా చోట్ల ఆధిక్యం కనబరిచామని క్లెయిం చేసుకుంది. తీరా పార్టీ గుర్తులపై జరిగే పోటీ విషయానికొచ్చేసరికి తమ బలహీనతను బయటపెట్టుకుంది. న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు, రాష్ట్రంలో కొత్తగా నియమితులైన ఎన్నికల కమిషనర్ తో వివాదాలతో లబ్ధి పొందాలని చూసింది. ఈ పోరాటం ఒక రకంగా వికటించింది. పార్టీ అధిష్ఠానం దిగువ స్తాయి క్యాడర్ కు నైతికంగా మద్దతు ఇవ్వలేకపోయింది. అందుకే పార్టీ కార్యకర్తలు, దిగువశ్రేణి నాయకులు ఎన్నికలు తమకు సంబంధించిన వ్యవహారంగా బావించలేదు. దీంతో వైసీపీ అభ్యర్థుల హవా తప్ప మరే గాలి ఎన్నికల్లో కనిపించలేదు. రాజకీయంగా స్థిరపడటానికి పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు చాలా కీలకం. గ్రౌండ్ లెవెల్ లో వీరి పనితీరు పార్టీకి మంచి గుర్తింపు తెచ్చి పెడుతుంది. శాసనసభ ఎన్నికల వంటివాటికి బలమైన క్యాడర్ గానూ ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఉపయోగపడతారు. అధికారిక హోదాల రీత్యా ప్రజలకు సన్నిహితంగా మెలుగుతూ పనులు చేసే పెట్టే వీలుంటుంది. వైసీపీ పార్టీ నిర్మాణానికి తాజా గా లభించిన పలితాలు దోహదపడతాయి. మరోవైపు టీడీపీకి మంచి నిర్మాణం ఉన్నప్పటికీ స్థానిక ఎన్నికల్లో దానిని ఉపయోగించుకోలేక పోయింది. దీని ప్రభావం వచ్చే శాసనసభ ఎన్నికల వరకూ కొనసాగుతుంది.
వాస్తవం వక్రీకరించిందా..?
శాసనసభ ఎన్నికల ఫలితాలు, గడచిన నలభై సంవత్సరాలుగా రాష్ట రాజకీయాలలో వెలువడిన వివిధ ఎన్నికల ను బేరీజు వేసి చూస్తే తాజా ఫలితాలు భిన్నంగా కనిపిస్తున్నాయి. గ్రౌండ్ లెవెల్ వాస్తవాలతో ఏమాత్రం సంబంధం లేకుండా రిజల్ట్స్ లో అధికారపార్టీ వైసీపీ విజయాలు నమోదు చేసింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నపార్టీకి అనుకూలంగానే స్థానిక సంస్థల పలితాలు వస్తుంటాయి. కానీ ప్రతిపక్షం పాత్ర కూడా ఎంతోకొంత అవసరం. దానివల్ల చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కు అవకాశం ఉంటుంది. కేంద్రం నుంచి వచ్చే నిధులు, రాష్ట్రం నుంచి రావాల్సిన బకాయిల వంటి అంశాలపై నిలదీయడానికి జెడ్సీ,ఎంపీపీలు ప్రధాన వేదికలు. అంతిమంగా అధికారపార్టీ అనుకున్నదే జరుగుతుంది. కానీ ప్రశ్నించే గొంతులు ఉండటం వల్ల మీడియాలోనూ, ప్రజల్లోనూ చర్చ జరుగుతుంది. దానివల్ల గ్రామాలకు, మండలాలకు, జిల్లాలకు మేలు చేకూరుతుంది. తాజా ఫలితాలతో స్థానిక సంస్థలు సైతం తప్పుదారి పట్టినా అడిగే నాథుడు ఉండకపోవచ్చు. అటు వంటి సందర్బాల్లో అధికారపార్టీకే దీర్ఘకాలంలో నష్టం వాటిల్లుతుంది. ఎప్పటికప్పుడు దిద్దుబాటు చేసుకునే మార్గదర్శకత్వాన్ని వైసీపీ కోల్పోయింది. ఏదేమైనా ఈ పలితాలు గ్రౌండ్ లెవెల్ లో బలాబలాలకు అతికినట్లు సరిపోతాయని చెప్పలేం. అదే సమయంలో అధికారపార్టీకి ఇంకా కచ్చితమైన ఆధిక్యం ఉందని మాత్రం చాటిచెప్పాయి.
-ఎడిటోరియల్ డెస్క్