వైసీపీలో ఆ ఇద్దరు కాపు నేతలకు కష్టాలు మొదలయినట్లేనా?
ఏపీలో ఎవరెన్ని చెప్పినా అధికార వైసీపీలో రెడ్ల హవా నడుస్తోంది. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. విమర్శలు, ప్రతి విమర్శలు పక్కన పెడితే రెడ్లకే సింహభాగం [more]
ఏపీలో ఎవరెన్ని చెప్పినా అధికార వైసీపీలో రెడ్ల హవా నడుస్తోంది. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. విమర్శలు, ప్రతి విమర్శలు పక్కన పెడితే రెడ్లకే సింహభాగం [more]
ఏపీలో ఎవరెన్ని చెప్పినా అధికార వైసీపీలో రెడ్ల హవా నడుస్తోంది. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. విమర్శలు, ప్రతి విమర్శలు పక్కన పెడితే రెడ్లకే సింహభాగం పదవులు దక్కుతున్నాయి. అయితే ఈ రెడ్ల ప్రయార్టీలో చాలా సామాజిక వర్గాల నేతలు నలిగిపోతున్న మాట వాస్తవం. సీమ లాంటి చోట్ల రెడ్ల హవా మరీ ఎక్కువుగా ఉండడంతో బీసీ నేతలు, మంత్రులు బాగా నలిగిపోతున్నారు. అనిల్‌కుమార్, శంకర్ నారాయణ లాంటి బీసీ మంత్రులు తమ ఆవేదన పైకి చెప్పుకోకపోయినా వర్ణనాతీమే అనుకుంటోన్న పరిస్థితి. ఇక పార్టీకి పట్టున్న ప్రకాశం జిల్లాలో వైసీపీలో బలంగా ఉన్న ఇద్దరు కాపు నేతలు కమ్మ, రెడ్ల రాజకీయంలో నలిగిపోతున్నారు. ఇందుకు దర్శి, చీరాల నియోజకవర్గాలే వేదిక అయ్యాయి.
పోటీ చేయకుండా…. చికాకు తెప్పిస్తూ…..
దర్శిలో రెడ్డి వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తాను ఎన్నికల్లో పోటీ చేయలేనని చేతులు ఎత్తేస్తేనే జగన్ ఆయన్ను తప్పించి వ్యాపారవేత్తగా ఉన్న కాపు వర్గానికి చెందిన మద్దిశెట్టి వేణుగోపాల్‌కు సీటు ఇచ్చారు. జగన్ ప్రభంజనంలో ఆయన ఘనవిజయం సాధించారు. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చాక బూచేపల్లి జగన్‌తో ఉన్న అనుబంధంతో పాటు జిల్లాలో వైసీపీ కీలక నేతల అండదండలతో దర్శి రాజకీయాన్ని చికాకు చేస్తూ మద్దిశెట్టికి నానా తలనొప్పిగా మారారని వైసీపీ కేడరే ఆగ్రహంతో ఉంది. బూచేపల్లికి ఇక్కడ కాస్తో కూస్తో కేడర్ ఉంటే ఉండొచ్చు. అంత మాత్రాన ఏ నియోజకవర్గంలో అయినా పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేనే సుప్రీం.. మంత్రి బాలినేని కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్టు సమాచారం.
కాళ్లూ.. వేళ్లూ పెడుతూ….
అంతెందుకు గతంలో ఇక్కడ టీడీపీ నుంచి శిద్ధా రాఘవరావు మంత్రిగా ఉన్నప్పుడు కనీసం నియోజకవర్గంలో కేడర్‌ను కూడా కాపాడలేక బూచేపల్లి తప్పించుకున్నారన్న టాక్ ఉంది. చివరకు జగన్ మధ్యలో బాదం మాధవరెడ్డికి ఇన్చార్జ్ బాధ్యతలు ఇవ్వగా, ఆయన కూడా చేతులు ఎత్తేయడంతో చివరకు మద్దిశెట్టికి సీటు ఇచ్చారు. ఆయన ఎన్నికల్లో భారీగా ఖర్చు చేయడంతో పాటు జగన్ గాలిలో బంపర్ మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చాక బూచేపల్లి దర్శిలో ఎంటర్ అయ్యి అన్ని పనుల్లో కాళ్లు, వేళ్లు పెడుతున్నారు. పోలీసు అధికారుల బదిలీలతో మొదలు పెడితే, టెండర్లు, నామినేటెడ్ పోస్టులు అన్ని తన వర్గానికే కావాలని పట్టుబడుతున్నారు. చివరకు ఎమ్మెల్యే ఫ్లెక్సీల చించివేత, ఆయనకు వ్యతిరేకంగా కరపత్రాల పంపిణీతో బూచేపల్లి వర్గం మద్దిశెట్టిని నానా ఇబ్బందులు పెడుతోంది. అదేమంటే మద్దిశెట్టిది కాపు వర్గం… పైన మా రెడ్డి వర్గం వాడు సీఎం అని బూచేపల్లి వర్గీయులు మాట్లాడుతోన్న పరిస్థితి. ఈ రెండు వర్గాల గొడవతో దర్శి జనాలకు వైసీపీకి ఎందుకు ఓట్లేశామా ? అని తలలు పట్టుకునే పరిస్థితి వచ్చేసింది.
చీరాలలో జగన్ కొనితెచ్చుకున్నారే…
చంద్రబాబు ప్రభుత్వంలో ఏం జరిగిందో చూడాల్సింది అంతా చూసి ఇప్పుడు జగన్ అదే తప్పు చేస్తున్నారా ? అన్నది చీరాల రాజకీయం చూస్తేనే అర్థమవుతోంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అద్దంకి రాజకీయం గొట్టిపాటి వర్సెస్ కరణం మధ్య ఎలా రగిలిందో చూశాం. ఇక గన్నవరంలో వంశీని పార్టీ దగ్గర చేర్చుకున్నాక అక్కడ గ్రూపుల రాజకీయం పార్టీని నాశనం చేస్తోంది. ఇది చూసి కూడా జగన్ చీరాలలో టీడీపీ నుంచి గెలిచిన కరణం బలరాం వారసుడు వెంకటేష్‌ను పార్టీలో చేర్చుకున్నారు. వైసీపీలో కమ్మలకు ప్రయార్టీ లేదని వస్తోన్న వార్తలకు చెక్ పెట్టే క్రమంలో కంగారు పడ్డ జగన్ కరణం వారసుడికి వైసీపీ కండువా కప్పేశారు. కానీ ఆయన వేసిన స్టెప్ చీరాలలో పార్టీని ముంచేస్తుందని ఊహించ లేదు.
కరణం దెబ్బకు…..
జగన్ తప్పని పరిస్థితుల్లో కరణంను పార్టీలో చేర్చుకున్నారు. కరణం పార్టీ మారినా, నియోజకవర్గం మారినా ఆయనపై వివాదాల ముద్ర పోలేదు. గత ఐదేళ్ల టీడీపీ పాలనలో ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతోంది. కాని మార్పులు ఏంటంటే కరణం, ఆయన వారసుడు ఐదేళ్లు టీడీపీలో ఉండి అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్‌తో రెచ్చగొట్టుడు రాజకీయం చేశారు. కాకపోతే ఇప్పుడు వైసీపీలో ఉంటూ చీరాలలో ఆమంచిని కవ్విస్తున్నారు. కమ్మ వర్గంలో సీనియర్ నేతగా ఉన్న కరణంకు వైసీపీలో కొందరి సపోర్ట్ ఉండడంతో ఇక్కడ కాపు నేతగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ బలవుతోన్న పరిస్థితి. చీరాలలో కాపులు లేకపోయినా ఇండిపెండెంట్‌గా కూడా గెలిచిన ఆమంచి ఇప్పుడు రాజకీయంగా సంకట స్థితిలో ఉన్నారు. ఏదేమైనా దర్శిలో రెడ్లు, చీరాలలో కమ్మల దెబ్బకు పరపతి ఉన్న కాపు నేతల రాజకీయం డైలమాలో పడింది.