కర్నూలులో వైసీపీ క్లీన్ స్వీప్.. నేతలు ఏం చేస్తున్నారంటే?
రాయలసీమ ప్రాంతంలోని నాలుగు జిల్లాల్లోనూ కర్నూలుకు చాలా విశిష్టత ఉంది. ఒకప్పుడు ఈ జిల్లా కాంగ్రెస్కు, తర్వాత టీడీపీకి కంచుకోటగా మారింది. వరుస విజయాలతో నాయకులు దూకుడు [more]
రాయలసీమ ప్రాంతంలోని నాలుగు జిల్లాల్లోనూ కర్నూలుకు చాలా విశిష్టత ఉంది. ఒకప్పుడు ఈ జిల్లా కాంగ్రెస్కు, తర్వాత టీడీపీకి కంచుకోటగా మారింది. వరుస విజయాలతో నాయకులు దూకుడు [more]
రాయలసీమ ప్రాంతంలోని నాలుగు జిల్లాల్లోనూ కర్నూలుకు చాలా విశిష్టత ఉంది. ఒకప్పుడు ఈ జిల్లా కాంగ్రెస్కు, తర్వాత టీడీపీకి కంచుకోటగా మారింది. వరుస విజయాలతో నాయకులు దూకుడు చూపించారు. అనేక మంది నాయకులు ఇక్కడ నుంచి గెలిచి.. రాష్ట్రంలో సీఎంలుగా, డిప్యూటీ సీఎంలుగా కూడా గుర్తింపు పొందారు. అలాంటి జిల్లాలో.. వైసీపీ గత ఏడాది ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది. 14 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంటు స్థానాల్లోనూ వైసీపీ విజయదుందుభి మోగించింది. ప్రతిపక్ష పార్టీకి అసలు స్థానమే లేకుండా చేసింది. ఆ మాటకు వస్తే 2014లో ఏపీలో వైసీపీ ఓడినా జిల్లాలో రెండు ఎంపీ సీట్లు, 11 అసెంబ్లీ సీట్లలో గెలిచి అప్పుడు కూడా పై చేయి సాధించింది.
సమస్యలను పట్టించుకోకుండా….
మరి అలాంటి చోట పార్టీ నేతలు ఎలా వ్యవహరించాలి ? ఏ విధంగా ముందుకు వెళ్లాలి ? అనే విషయం ప్రతి ఒక్కరిలోనూ చర్చకు వస్తుంది. ప్రజలను కలుపుకొని పోతూ.. ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరును పర్యవేక్షిస్తూ.. పార్టీని బలోపేతం చేసుకునేందుకు రెడీ అయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ, ఇక్కడ వైసీపీ తరఫున గెలుపు గుర్రాలు ఎక్కిన నాయకులు మాత్రం ఎవరికి వారు తమ సొంత వ్యాపారాలు వ్యవహారాలు చూసుకుంటున్నారు. నియోజకవర్గ సమస్యలను పెద్దగా పట్టించుకుంటున్న వారు కూడా పెద్దగా కనిపిం చడం లేదు.
కెమిస్ట్రీ కుదరక…..
ఇక, పార్లమెంటు సభ్యులకు స్థానిక ఎమ్మెల్యేకు మధ్య కెమిస్ట్రీ కుదరడం లేదు. దీంతో వారు కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. కర్నూలు ఎంపీ సంజయ్ కుమార్ ఈ వివాదాలకు నా కెందుకులే అనుకుని సైలెంట్ ఆయన పని ఆయన చేసుకు పోతున్నారు. నంద్యాల ఎంపీ కొద్ది రోజులు ఎంపీగా తన పవర్ చూపించేందుకు హడావిడి చేసినా తర్వాత ఎమ్మెల్యేలతో ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభమవుతుండడంతో ఆయన కూడా సైలెంట్ కాక తప్పని పరిస్థితి. ఇద్దరు ఎంపీలు ప్రభుత్వం తరఫున నిర్వహించే కార్యక్రమాలకు మాత్రం ఏదో అడపాదడపా వచ్చిపోతున్నారే తప్ప.. మనసు పెట్టి మాత్రం పనిచేయడం లేదు.
సెటిల్ మెంట్లు…. భూదందాలు….
ఇక, ఎమ్మెల్యేల పరిస్థితి ఎంత వెనుసుకున్నాం.. అనే పరిస్థితినే తలపిస్తోంది. సెటిల్మెంట్లు, భూముల దందా వంటి కార్యక్రమాలు జోరుగా సాగిస్తున్నారు. అదే సమయంలో పార్టీకి దూరంగా ఉన్నారని అధికారిక వర్గాలే తేల్చి చెబుతున్నాయి. సంపాదనకు మార్గలేమి లేకపోవడంతో కాంట్రాక్టు ఉద్యోగాలకు వసూళ్లు, ఇతర సెటిల్మెంట్లతోనే నాలుగురాళ్లు వెనకేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చేశారు. ఇక కొందరు ఎమ్మెల్యే పుత్రరత్నాలు, బంధుగణం చేస్తోన్న దౌర్జన్యాలకు అంతే లేదు.
ఇలా చేసుకుంటూ పోతే….?
రాక రాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని.. పార్టీని బలోపేతం చేసేలా ముందుకు సాగాలని చెబుతున్నారు సీనియర్లు. పార్టీ అధినేత సైతం ఎవ్వరూ లిమిట్స్ దాటకూడదని.. ఎవరు తప్పు చేసినా సహించనని వార్నింగ్లు ఇస్తున్నా… జిల్లా ఎమ్మెల్యేల్లో ఒకరో ఇద్దరో మినహా ఎవ్వరూ ఆ మాట పట్టించుకోవడం లేదు. మరికొందరు మాత్రం వచ్చే ఎన్నికల తర్వాత రాజెవరో ? రెడ్డవరో ? అధికారం ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి కదా ? అన్న ధోరణితో ఉన్నారు. ఈ పరిస్థితిలో మార్పు రాకపోతే కర్నూలు జిల్లాలో వైసీపీ గ్రాఫ్ పతనమయ్యే రోజులు దగ్గర్లోనే ఉంటాయి.