పసుపుకోటలో ఫ్యాన్ తిప్పేస్తారా ?
తూర్పుగోదావరి జిల్లా లో వైసిపి సునామీని అడ్డుకున్న ప్రాంతాల్లో రాజమండ్రి వన్, టూ అసెంబ్లీ నియోజకవర్గాలు. తెలుగుదేశం కంచుకోటగా మారిన ఈ ప్రాంతాల్లో ఇప్పుడు వైసిపి జండా [more]
తూర్పుగోదావరి జిల్లా లో వైసిపి సునామీని అడ్డుకున్న ప్రాంతాల్లో రాజమండ్రి వన్, టూ అసెంబ్లీ నియోజకవర్గాలు. తెలుగుదేశం కంచుకోటగా మారిన ఈ ప్రాంతాల్లో ఇప్పుడు వైసిపి జండా [more]
తూర్పుగోదావరి జిల్లా లో వైసిపి సునామీని అడ్డుకున్న ప్రాంతాల్లో రాజమండ్రి వన్, టూ అసెంబ్లీ నియోజకవర్గాలు. తెలుగుదేశం కంచుకోటగా మారిన ఈ ప్రాంతాల్లో ఇప్పుడు వైసిపి జండా ఎగురవేయడానికి వైఎస్ జగన్ పక్కా ప్లాన్ ను సిద్ధం చేస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ ఎమ్యెల్యే రౌతు సూర్యప్రకాశరావు నుంచి పగ్గాలు తప్పించి మాజీ ఏపీఐఐసి చైర్మన్ శివరామ సుబ్రమణ్యానికి జగన్ ఇన్ ఛార్జి బాధ్యతలు అప్పగించి శ్రేణులకు కొత్త సందేశం పంపారు. రాష్ట్రం అంతా దుమ్ములేపే విజయాన్ని అందుకున్నా కీలకమైన రాజమండ్రి లో ఓటమిని ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలే డీలా పడ్డాయి. పరాజయం మిగిల్చిన షాక్ నుంచి ఎమ్యెల్యే అభ్యర్థి రౌతు సైతం ఇంకా తేరుకోలేకపోతున్నారు. దాంతో వైసిపి సైన్యంలో నైరాశ్యం రాజ్యమేలుతుంది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో కొత్త నాయకత్వాన్ని ఏర్పాటు చేసి టిడిపి తో నేరుగా తలపడేందుకు జగన్ ఆచితూచి వ్యూహం సిద్ధం చేశారు.
బాగా వెనుకబడ్డ వైసిపి …
మొన్నటి ఎన్నికల్లో మరీ ఘోరంగా ముప్పైవేల ఓట్ల తేడాతో ఓటమిని చవిచూసింది వైసిపి. టిడిపి అభ్యర్థి ఆదిరెడ్డి భవాని విజయం జగన్ వేవ్ లో కూడా నల్లేరుపై బండి నడకలా సాగింది. వాస్తవానికి జగన్ తన పాదయాత్రలో రోడ్డు కం రైలువంతెనపై సాగిన తీరుతో జిల్లాల్లో వైసిపి హవా మాములుగా ఉండదన్న సంకేతాలు ముందే అందరికి అందాయి. అయితే ఈ ఊపు ను కొనసాగించడం లో కానీ ప్రత్యర్థుల వ్యూహాన్ని అందుకోవడంలో వైసిపి చతికిల పడిపోయింది. ఎంతో అనుభవం వైసిపి నేతలకు ఉన్నప్పటి కి టిడిపి కి బలంగా వున్న పునాదిని కదిలించలేక పోయింది. ముఖ్యంగా అన్ని డివిజన్ లలో వున్న ఆదిరెడ్డి సైన్యానికి తోడు మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిర్మించిన కోటను బీటలు వార్చడం వైసిపికి చేతకాలేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల అనంతరం వందరోజుల అధ్యయనం తరువాత వైసిపి తన ఆపరేషన్ కి శ్రీకారం చుట్టింది. ముందుగా రాజమండ్రి అర్బన్ పై దృష్టి పెట్టి మాజీ ఏపిఐఐసి చైర్మన్ గా వున్న శ్రీఘాకోళపు శివరామ సుబ్రహ్మణ్యం కి సిటీ ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించింది.
సుబ్రమణ్యానికి ముళ్ళకిరీటమే …
శివరామ సుబ్రమణ్యానికి సిటీలో మంచి ఫాలోయింగ్ వుంది.దశాబ్దాల పాటు కాంగ్రెస్ లో అనేక కార్పొరేటర్ స్థాయినుంచి ఎపిఐసిసి వరకు అనేక పదవులు చేపట్టిన అనుభవం వుంది. యువజన కాంగ్రెస్ నుంచి అనేక ఉద్యమాలు నిర్వహించిన చరిత్ర ఆయన సొంతమే. పార్టీలకు అతీతంగా స్నేహితుల అండా వుంది. 2014 ఎన్నికల్లో సమైక్యాంధ్ర పార్టీ నుంచి ఎమ్యెల్యేగా పోటీ చేసిన సుబ్రహ్మణ్యం రాష్ట్రంలో అత్యధిక ఓట్లు తెచ్చుకున్న వారిలో ఒకరు కావడం గమనార్హం. వైశ్య సామాజిక వర్గం ప్రతినిధిగా కూడా గట్టిపట్టే వుంది. ప్రస్తుత ఎంపి భరత్ రామ్, రాజానగరం ఎమ్యెల్యే జక్కంపూడి రాజా ల సహకారం పూర్తిగా ఆయనకు వుంది. ఇవన్నీ వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో వైసిపి ని ముందుకు తీసుకువెళతాయనే అంచనాతో అధిష్టానం ఆయనకు కిరీట ధారణ చేసింది. అయితే డివిజన్ ల వారీగా పరిశీలిస్తే సుబ్రహ్మణ్యం టిడిపి కంచుకోటను బద్దలు కొట్టడం ఆషామాషీ కానేకాదు. గ్రూప్ రాజకీయాలకు వేదికగా మారిపోయిన రాజమండ్రి అర్బన్ వైసిపి ని ముందుగా ఆయన ఏకతాటిపైకి తేవడానికి బాగా శ్రమించాలిసి వుంది. ఆ తరువాత ఒక్కో డివిజన్ లో మొన్నటి ఎన్నికల్లో పోల్ అయిన ఓట్లను పరిశీలించి తదనుగుణంగా ఈక్వేషన్లు మార్చడానికి భారీ కసరత్తే చేయాలి.
జగన్ నమ్మకాన్ని వమ్ము చేయను …
తనపై ముఖ్యమంత్రి వైసిపి అధినేత పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయనని ఇంచార్జ్ గా ప్రకటించాక తెలుగు పోస్ట్ తో మాట్లాడుతూ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇప్పటికే రాజమండ్రి కార్పొరేషన్ ఏర్పడ్డాక జరిగిన మూడు ఎన్నికల్లో టిడిపి హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసిందని వారి విజయాలు అడ్డుకోవాలంటే ప్రతి వైసిపి కార్యకర్తను సైనికుడిగా మార్చడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. మొన్నటి ఎన్నికల్లో సమన్వయ లోపం తో పాటు ప్రత్యర్థి పార్టీ డబ్బును వరదలా పారించిందని తమ పార్టీ లోపాలు గమనించి తెలుగుదేశాన్ని ధీటుగా ఎదుర్కొంటామన్నారు. రాజమండ్రి ప్రజలకు వైసిపి పక్షాన నిలవడం వల్ల కలిగే లాభాలు వివరిస్తామని అదే విధంగా జగన్ నవరత్నాల కార్యక్రమాన్ని ఇంటింటికి అందేలా కృషి చేస్తామని వెల్లడించారు సుబ్రహ్మణ్యం. టిడిపి నేతలు చేసే తప్పుడు ప్రచారం ఎప్పటికప్పుడు తిప్పికొడతామని చెప్పుకొచ్చారు శివరామ సుబ్రహ్మణ్యం. వైసిపి అధినేత జగన్ తాజా నియామకంతో ఇప్పటికే రాజమండ్రి అర్బన్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిపోయాయి. భవిష్యత్తులో ఎలా వుంటాయో చూడాలి.