చివరికి కంపు..కంపు చేసుకునేలా ఉన్నారే?
ఉత్తరాంధ్ర కలసి రావడం వల్లనే వైసీపీకి గత ఏడాది జరిగిన ఎన్నికల్లో బంపర్ మెజార్టీ దక్కింది. మొత్తానికి మొత్తం అంటే 34 అసెంబ్లీ సీట్లలో 28 సీట్లు [more]
ఉత్తరాంధ్ర కలసి రావడం వల్లనే వైసీపీకి గత ఏడాది జరిగిన ఎన్నికల్లో బంపర్ మెజార్టీ దక్కింది. మొత్తానికి మొత్తం అంటే 34 అసెంబ్లీ సీట్లలో 28 సీట్లు [more]
ఉత్తరాంధ్ర కలసి రావడం వల్లనే వైసీపీకి గత ఏడాది జరిగిన ఎన్నికల్లో బంపర్ మెజార్టీ దక్కింది. మొత్తానికి మొత్తం అంటే 34 అసెంబ్లీ సీట్లలో 28 సీట్లు వైసీపీకి దక్కాయి. అలాగే నాలుగు ఎంపీలూ చేజిక్కుని మూడు జిల్లాలలో బలమైన పునాదిని వేసుకుంది. మరి ఆ పునాదిని కదిలించేయడానికి సొంత పార్టీ వారే గునపాలు తీసి తవ్వుతుంటే వైసీపీకి రానున్నది గడ్డు కాలమేనా అనిపించకమానదు. జగన్ మాటను సైతం పెడచెవిన పెట్టి ఎక్కడికక్కడ తమ బంధువులు, దగ్గరవారికి టికెట్లు ఇచ్చేసుకున్నారు. కనీసం సామాజిక న్యాయం అన్నది ఎక్కడా చూడలేదు. ఇంతవరకూ ఖాళీగా ఉన్న ఇంచార్జిలు ఇపుడు ఒక్కసారిగా ఆకలిగా మీద పడిపోయారా? అన్నంతగా సీట్లు అమ్ముకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కో అంటే కోటి…
విశాఖ మేయర్ పీఠాన్ని కొట్టాలని ఓ వైపు వైసీపీ ఆరాటపడుతోంది. విశాఖను రాజధానిగా ప్రకటించిన వైసీపీకి గెలవడం అతి ముఖ్యం. కానీ నాయకులు మాత్రం అధినాయకత్వం పరువుని దక్కించేలా ఎక్కడా కనిపించడంలేదు. టికెట్లకు రేటు కట్టి మరీ అమ్ముకుంటున్నారు. వార్డు కార్పోరేటర్ టికెట్ కోటి రూపాయల దాకా వేలంలో వెళ్ళిపోయిందని వైసీపీ క్యాడరే బయటకు వచ్చి విమర్శలు చేస్తూంటే ఇంత రచ్చ చేసుకున్నాక గెలిచేది ఉంటుందా అనిపించకమానదు. మరో వైపు టికెట్ రానివారు ఆత్మహత్యాయత్నం చేస్తున్నారు. రెబెల్స్ గా రంగంలోకి దిగుతున్నారు. అలాగే, నాయకుల ఇళ్ళ వద్దకు వెళ్ళి ఆందోళన చేస్తున్నారు.
ఆ రెండు జిల్లాలోనూ….
ఇంకో వైపు చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో కార్పోరేషన్ కి ఎన్నికలు లేవు. దాంతో అందరూ కలసి జెడ్పీ పీఠం మీద పడ్డారు. బీసీ మహిళకు కేటాయించడంతో మంత్రి ధర్మాన కృష్ణదాస్ తన కొడుకు కృష్ణ చైతన్యను వైస్ చైర్మన్ చేయడానికి రెడీ అయిపోతున్నారు. మరో వైపు ఎమ్మెల్యే రెడ్డి శాంతి తన కొడుకుకి వీసీ పదవి కోసం పట్టుబడుతున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం వదిన కూడా ఎంపీపీ పదవి కోసం ట్రై చేస్తున్నారుట. ఇక సీనియర్ నేత దువ్వాడ శ్రీను భార్య వాణికి జెడ్పీ పీఠం దక్కకుండా చేసేందుకు సొంత పార్టీలోనే ఎమ్మెల్యేలు, నాయకులు గ్రూపులుగా విడిపోయి పావులు కదుపుతున్నారు.
అది బొత్స సామ్రాజ్యం …
విజయనగరంలో బొత్స సామ్రాజ్యంగా ఉంది. అక్కడ జెడ్పీ పీఠం ఇక్కడ ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో తమ వారినే అక్కడ కూర్చోపెట్టి వైస్ చైర్మన్ పీఠాన్ని తన బంధువులకు దక్కించుకోవాలని చూస్తున్నారని టాక్. ఇక మేయర్ సీటు బీసీలకు ఇచ్చారు. దాంతో డిప్యూటీ మేయర్ మీద ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి కన్నేశారు. తన వారిని అందలం ఎక్కించాలని ఆయన తాపత్రయపడుతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో నాయకుల బంధువులే రాబంధువులుగా మారడంతో జెండా మోసిన కార్యకర్తలు బిత్తరపోతున్నారు. దాంతో విజయావకాశాలు మెండుగా ఉన్నా కూడా క్యాడర్ ని దూరం చేసుకుని వైసీపీ లోకల్ బాడీ ఎన్నికల్లో ఏం సాధిస్తుందని వైసీపీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.