వేవ్ ఉంటేనే వైసీపీకి అక్కడ ఆశలు..!
కడప జిల్లా తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆవిర్భావం నుంచి పట్టున్న జిల్లా నెల్లూరు. 2012లో వైసీపీ ఆవిర్భావం తర్వాత వచ్చి ఉప ఎన్నికల్లో జిల్లా ప్రజలు [more]
కడప జిల్లా తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆవిర్భావం నుంచి పట్టున్న జిల్లా నెల్లూరు. 2012లో వైసీపీ ఆవిర్భావం తర్వాత వచ్చి ఉప ఎన్నికల్లో జిల్లా ప్రజలు [more]
కడప జిల్లా తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆవిర్భావం నుంచి పట్టున్న జిల్లా నెల్లూరు. 2012లో వైసీపీ ఆవిర్భావం తర్వాత వచ్చి ఉప ఎన్నికల్లో జిల్లా ప్రజలు వైసీపీ అభ్యర్థులను గెలిపించారు. అప్పుడు వచ్చిన నెల్లూరు లోక్ సభ ఉప ఎన్నికలో అయితే వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డి ఏకంగా 2,91,745 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. అప్పటి నుంచీ జిల్లాలో పార్టీ బలంగా కనిపిస్తోంది. అయితే, అనూహ్యంగా గత ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంటు స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీని ఎదుర్కుంది. రెండేళ్ల ముందు ఉప ఎన్నికల్లో 2.91 లక్షల మెజారిటీతో గెలిచిన మేకపాటి 2014 ఎన్నికల్లో కేవలం 13 వేల ఓట్ల స్వల్ప మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డిపై విజయం సాధించారు.
ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు
సీనియర్ నేతగా అయినా, ముందునుంచీ జగన్ కు అండగా ఉంటున్నా మేకపాటి రాజమోహన్ రెడ్డికి ఈసారి టిక్కెట్ దక్కలేదు. చివరి నిమిషంలో టీడీపీ ఇచ్చిన టిక్కెట్ ను కాదనుకొని వైసీపీలో చేరిన ఆదాల ప్రభాకర్ రెడ్డికి జగన్ నెల్లూరు లోక్ సభ టిక్కెట్ ఇచ్చారు. మూడుసార్లు ఎంపీగా గెలిచిన మేకపాటిపై కొంత వ్యతిరేకత ఉండటంతో ఈసారి వైసీపీ కొత్త అభ్యర్థిగా ఆదాలను దింపింది. ఆదాలకు గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి ఉంది. పైగా అన్ని నియోజకవర్గాల్లో మంచి పట్టుంది. ఆలస్యంగా పార్టీలో చేరినా వైసీపీ అభ్యర్థులతో సఖ్యతగానే ఎన్నికలను ఎదురుకోవడం ఆయనకు ప్లస్ అయ్యింది. అయితే, నెల్లూరు లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం పార్టీ ఈసారి బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపింది. గత ఎన్నికల్లో వైసీపీ గెలిచిన నెల్లూరు సిటీ, రూరల్, ఆత్మకూరు నియోజకవర్గాల్లోనూ ఈసారి గట్టి పోటీ ఎదుర్కుంది.
పోలింగ్ తర్వాత వైసీపీలో ధీమా
తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు పోటీ చేశారు. బీసీ సామాజకవర్గానికి చెందిన నేత కావడం ఆయనకు కలిసొచ్చింది. లోక్ సభ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ తరపున బలమైన అభ్యర్థులే పోటీ చేశారు. దీంతో ఆయన విజయంపై ధీమాగా ఉన్నారు. ఇద్దరు అభ్యర్థులూ ఆర్థికంగా బలంగా ఉన్నారు. నెల్లూరు పార్లమెంటు పరిధిలో డబ్బు ప్రభావం కూడా బాగానే ఉంది. అయితే, పోలింగ్ సరళి మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు కనిపించింది. జిల్లా మొత్తం వైఎస్సార్ కాంగ్రెస్ హవా వీచిందనే విశ్లేషణలు వస్తున్నాయి. జిల్లాలో మెజారిటీ అసెంబ్లీలు వైసీపీ గెలుచుకునే అవకాశం ఉంది. క్లీన్ స్వీప్ చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఒకవేళ ఈ అంచనాలే నిజమై వైసీపీ వేవ్ బలంగా ఉంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి భారీ మెజారిటీతోనే విజయం సాధించే అవకాశం ఉంది. ఒకవేళ వైసీపీకి అనుకూలంగా అంత వేవ్ ఏమీ లేకపోతే మాత్రం ఇద్దరిలో ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీతో గట్టెక్కవచ్చు.