సమయం కాదు సోదరా?
దేశం, రాష్ట్రాలు ఆరోగ్య అత్యయిక పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. దేశమంతా స్తంభించిపోయి ఇళ్లల్లోనే తెల్లారిపోతోంది. రాజకీయ పార్టీలు కొంతకాలం సంయమనం పాటించాయి. ఇప్పుడిప్పుడే వాటికి పని కావాలనిపిస్తోంది. ప్రజా [more]
దేశం, రాష్ట్రాలు ఆరోగ్య అత్యయిక పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. దేశమంతా స్తంభించిపోయి ఇళ్లల్లోనే తెల్లారిపోతోంది. రాజకీయ పార్టీలు కొంతకాలం సంయమనం పాటించాయి. ఇప్పుడిప్పుడే వాటికి పని కావాలనిపిస్తోంది. ప్రజా [more]
దేశం, రాష్ట్రాలు ఆరోగ్య అత్యయిక పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. దేశమంతా స్తంభించిపోయి ఇళ్లల్లోనే తెల్లారిపోతోంది. రాజకీయ పార్టీలు కొంతకాలం సంయమనం పాటించాయి. ఇప్పుడిప్పుడే వాటికి పని కావాలనిపిస్తోంది. ప్రజా సేవ , ఇతర కార్యక్రమాలతో సరిపోవడం లేదు. ఆహారధాన్యాలు, పేదలకు ఉచిత భోజనాల పంపిణీ వంటివి చేపట్టి బిజీగా ఉండొచ్చు. కానీ నాయకులకు , పార్టీలకు ఆ కార్యక్రమం పెద్దగా మజా ఇవ్వదు. ఖుషీ నింపదు. అందుకే ఇంతటి క్లిష్ట సమయంలోనూ తీవ్రస్థాయి ఆరోపణలతో బురద జల్లుకుంటున్నారు. మేమంతా ఇళ్లల్లో మగ్గుతుంటే బయట ఇదా మీరు చేసేది ? అంటూ ప్రజలు ముక్కున వేలేసుకునేలా ప్రవర్తిస్తున్నారు. తాజాగా భారతీయ జనతాపార్టీ, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అగ్రనాయకుల మధ్య చోటు చేసుకుంటున్న విమర్శలు ఇందుకు తార్కాణంగా నిలుస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి, భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసుకున్న విమర్శలు రాజకీయ రచ్చను పతాకస్థాయికి తీసుకెళ్లాయి. ఇరునేతల విభేదాలపై బీజేపీ కేంద్ర నాయకత్వం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది.
కేంద్రంతో సయోధ్య…
వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ తొలి నాటి నుంచి కేంద్ర బీజేపీ నాయకత్వానికి కొంతమేరకు సానుకూలంగానే ఉంటోంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా పార్లమెంటులో బీజేపీకి మద్దతుగానే వ్యవహరించింది. అయితే తెలుగుదేశం ప్రభుత్వానికి, బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏకు మధ్య అంతరం సృష్టించడంలో సక్సెస్ అయ్యింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అవిశ్వాసం అంశాన్ని తెరపైకి తెచ్చి టీడీపీని డిఫెన్స్ లోకి తోసేసింది. దాంతో కేంద్ర, రాష్ట్రాల మధ్య గ్యాప్ తో తెలుగుదేశం తొందరపాటు తనం ప్రదర్శించింది. రాజకీయంగా తీవ్రంగా నష్టపోయింది. ఈవిషయంలో వైసీపీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అదే సమయంలో బీజేపీతో అంతర్గతంగా సత్సంబంధాలను కొనసాగించింది. వైసీపీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో ఎన్డీఏ మళ్లీ పగ్గాలు చేపట్టింది. అప్పట్నుంచి కేంద్రంతో బంధాలను వైసీపీ మరింతగా బలపర్చుకునేందుకు ప్రయత్నించిందనే చెప్పాలి. కేంద్రం ప్రవేశపెట్టే అన్నిరకాల బిల్లులకు ఉభయసభల్లో సంపూర్ణంగా మద్దతు పలుకుతూ వచ్చింది. ఇందులో కొన్ని వివాదాస్పదమైన బిల్లులు సైతం ఉన్నాయి. రాష్ట్రంలో కొంత రాజకీయ నష్టం ఉంటుందనే అంచనా ఉన్నప్పటికీ కేంద్రంతో అనవసర వైరం తెచ్చుకోవడం ఇష్టం లేక వైసీపీ మౌనం వహించిన సందర్భాలున్నాయి.
రాష్ట్రంలో రావణకాష్ఠం..
కేంద్రంలో ఇంచుమించు మిత్రపక్షం స్థాయిలో సహకారం అందిస్తోంది వైసీపీ. అయినప్పటికీ రాష్ట్రంలో ఉప్పునిప్పుగా ఉంది. బీజేపీ, వైసీపీలు ప్రత్యర్థి పార్టీలుగా పోరు సలుపుతున్నాయి. కొన్ని విషయాల్లో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం కంటే అధికారపార్టీతో పోరాటంలో బీజేపీ యే ముందంజలో ఉంది. ఇసుక కొరత, రాజధానిపై పోరు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు మద్దతు వంటి విషయాల్లో ఎక్కడా ప్రధానప్రతిపక్షానికి తీసిపోలేదు. ఒకింత ముందు వరసలో నిలిచింది. బీజేపీపై పోరాటం విషయంలో వైసీపీ నాయకులు మొదట్లో కొంచెం ఆచితూచి వ్యవహరించేవారు. తెలుగు దేశం పార్టీ ని విడిచిపెట్టి బీజేపీలో చేరిన నాయకులపై మాత్రం విరుచుకుపడేవారు. బీజేపీని ఆ పార్టీలో కొత్తగా చేరిన నేతలను వేర్వేరుగా చూపించే ప్రయత్నం చేసేవారు. కానీ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు తెలుగుదేశంతో గత సంబంధాలు ఏమీ లేవు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పట్నుంచి పోరాటం సాగిస్తున్నారాయన. కొందరు కేంద్ర నాయకులు రాష్ట్రప్రభుత్వం పట్ల సానుకూలత ప్రదర్శించినప్పటికీ కన్నా నాయకత్వంలోని రాష్ట్రశాఖ మాత్రం అలుపెరుగని పోరు సలుపుతోంది. ఈ వైరుద్ధ్యంపై రాజకీయ వర్గాలు ఒకింత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుంటాయి. అయితే బీజేపీ ద్విముఖ వ్యూహంతో వెళుతుందేమోననే అనుమానాలున్నాయి. అటు కేంద్రంలో అవసరమైన సందర్భంలో సహకారం తీసుకోవడం, అదే సమయంలో రాష్ట్రంలో ప్రతిపక్షంగా బలపడటమనేది పార్టీ స్టాండ్ గా భావిస్తుండేవారు.
ముదురుపాకం…
తాజాగా కన్నా లక్ష్మీనారాయణ, విజయసాయి రెడ్డి లు చేసుకున్న పరస్పర విమర్శలు ఆయా కేంద్ర అగ్రనాయకత్వాలకు తలపోటును తెచ్చి పెట్టేవిధంగా మారాయి. కోవిడ్ టెస్టింగ్ కిట్ల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ అంకెల సహా కన్నా కొన్ని విమర్శలు చేశారు. ఛత్తీస్ గఢ్ కొనుగోలు చేసిన ధర కంటే ఏపీ లో దాదాపు రెట్టింపు ధరతో కొన్నారనేది బీజేపీ అభియోగం. ఛత్తీస్ గఢ్ టెండర్లు పిలిచి పకడ్బందీగా ఆయా కంపెనీల నుంచి కొనుగోలు చేసింది. అదే ఏపీలో నామినేషన్ పద్ధతిపై ఇప్పటికే విదేశాలనుంచి దిగుమతి చేసుకునే అనుమతులున్న కంపెనీల నుంచి కొనుగోలు చేశారు. దీంతో రేట్ల వ్యత్యాసంతో రాష్ట్రం నష్టపోయేందుకు ఆస్కారం ఏర్పడింది. దీనిపై ప్రభుత్వం పూర్తి స్థాయి వివరణ ఇస్తే సరిపోయేది. అంతేకాకుండా రేట్ల వ్యత్యాసంపై చర్యలు తీసుకునేందుకు ఇంకా అవకాశం ఉంది. ఆ సంగతిని పక్కనపెట్టి కన్నా లక్ష్మీనారాయణను విజయసాయిరెడ్డి వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంతో వివాదం బాగా ముదిరింది. బీజేపీ రాష్ట్ర శాఖ తాడోపేడో తేల్చుకోవాలని భావిస్తోంది. రాష్ట్రం విషమ పరిస్థితుల్లో ఉన్న స్థితిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలతోపాటు రాజకీయ సంబంధాలు కూడా సుహృద్భావంగా ఉంటే మంచిది. లేకపోతే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయి. ఈ సమయంలో కూడా విమర్శలు, ఆరోపణలు, వ్యక్తిగత విభేదాలకు చోటిస్తే ప్రజల్లో నేతలు పలచనైపోతారు.
-ఎడిటోరియల్ డెస్క్