రెండేళ్ల జగన్ పాలనపై సర్వేలో తేలిందిదేనా..?
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఆశించినట్లే జరుగుతోంది. మే చివరి నాటికి రెండేళ్ల పరిపాలన పూర్తయింది. దీనిపై జూన్ రెండో వారంలో అభిప్రాయ సేకరణ పేరిట అంతర్గతంగా చేయించుకున్న [more]
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఆశించినట్లే జరుగుతోంది. మే చివరి నాటికి రెండేళ్ల పరిపాలన పూర్తయింది. దీనిపై జూన్ రెండో వారంలో అభిప్రాయ సేకరణ పేరిట అంతర్గతంగా చేయించుకున్న [more]
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఆశించినట్లే జరుగుతోంది. మే చివరి నాటికి రెండేళ్ల పరిపాలన పూర్తయింది. దీనిపై జూన్ రెండో వారంలో అభిప్రాయ సేకరణ పేరిట అంతర్గతంగా చేయించుకున్న సర్వే ఒకటి నిర్వహించారు. ఆ ఫలితాలు పార్టీ నాయకత్వంలో జోష్ నింపుతున్నాయి. దాదాపు ప్రతిపక్షాలన్నీ ఏకమై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపైనా, వైసీపీ ప్రభుత్వంపైనా పోరాటం సాగిస్తున్నాయి. ప్రతి అంశంలోనూ ప్రభుత్వ వైఖరిని తప్పు పడుతూ రచ్చ చేస్తున్నాయి. మీడియా సంగతి చెప్పనే అక్కర్లేదు. రంధ్రాన్వేషణ చేస్తూ తప్పులను భూతద్దంలో వెతికి మరీ ప్రసారం చేస్తున్నాయి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా సంస్థలు. నిజానికి ప్రతిపక్షాల సమరం కంటే ఈ సంస్థల పోరాటమే ఎక్కవై పోయింది. ఈ నేపథ్యంలో వైసీపీ సర్వే ఆ పార్టీ క్యాడర్ కు చల్లని కబురు చెప్పింది. ప్రతిపక్షాల ప్రచారం ప్రభావం ప్రజలపై ఏమాత్రం పడటం లేదనేది సర్వే సారాంశం. పైపెచ్చు ప్రజలు గత ప్రభుత్వం కంటే సంతృప్తిగానే ఉన్నారనేది సర్వే తేల్చిన అంశంగా చెబుతున్నారు. అయితే దీనిని ప్రశాంత్ కిశోర్ టీమ్ నిర్వహించిందా? లేక వైసీపీ స్వయంగా తన మీడియా ద్వారా నిర్వహించిందా? అన్న వివరాలు తెలియరావడం లేదు.
వైసీపీకి జోష్…
రెండేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలు అనేకం వివాదాస్పదంగానే మిగిలాయి. పర్యవసానాలు ఆలోచించకుండా , ముందు వెనకలు చూడకుండా ముఖ్యమంత్రి ఆలోచనలు అమలులో పెట్టడానికి ప్రయత్నించి ప్రభుత్వం అనేకసార్లు భంగపాటుకు గురైంది. సంక్షేమ పథకాలు మినహాయిస్తే, తీసుకున్న నిర్ణయాలు చాలా వరకూ అమలు కూడా కాలేదు. ప్రాథమిక విద్య నుంచే ఇంగ్లిషు మీడియం, మూడు రాజధానులు, శాసనమండలి రద్దు వంటి విధానపరమైన అంశాల్లో ఇప్పటికే తలబొప్పి కట్టింది. న్యాయస్థానాలు అడుగడుగునా అడ్డు తగులుతున్నాయి. రాజ్యాంగ విరుద్దంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని ఆక్షేపిస్తున్నాయి. వీటికి పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం లభిస్తోంది. అయితే ప్రజలు వీటిని పట్టించుకోవడం లేదని జగన్ మోహన్ రెడ్డి పరిపాలన బాగుందంటూ కితాబునిస్తున్నారంటూ వైసీపీ సర్వే చెబుతోంది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు గాను నలభై అయిదు నియోజకవర్గాల్లో సర్వే సాగింది. ఇందులో ముప్ఫైఅయిదు గ్రామీణ ప్రాంత నియోజకవర్గాలు, పది పట్టణ ప్రాంత నియోజకవర్గాలు ఉన్నట్లు తెలిసింది.సర్వేలో తమ అభిప్రాయాలు వెల్లడించిన వారిలో 75శాతం మంది ప్రజలు పాలనపై సంతృప్తిని వ్యక్తం చేశారనేది వైసీపీ వర్గాల మాట.
టీడీపీకి షాక్…
రెండేళ్ల పాలన తర్వాత ప్రజల్లో 75 శాతం మంది ప్రభుత్వంపై విశ్వాసం ప్రకటించడమంటే చిన్న విషయం కాదు.అదే నిజమైతే ప్రధాన ప్రత్యర్థి అయిన తెలుగుదేశం ఆత్మావలోకనం చేసుకోవాల్సి ఉంటుంది. పరిపాలన మొదలైన తొలి నాటి నుంచే వైసీపీని టీడీపీ టార్గెట్ చేస్తూ వస్తోంది. అవినీతి, అప్పుల సంక్షోభం రెండూ అస్త్రాలుగా చేసుకుంటూ ఎడతెగని సమరం సాగిస్తోంది. దీని ప్రభావం ప్రజలపై పడలేదంటే టీడీపీ తన వ్యూహాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. తెలుగుదేశాన్ని మీడియాను కలగాపులగం చేసి వైసీపీ చేస్తున్న ప్రచారం వల్ల ప్రతిపక్షాల ఆరోపణలను ప్రజలు విశ్వసించడం లేదనిపిస్తోంది. ముఖ్యంగా ప్రతి చిన్న విషయానికి తెలుగుదేశం చేసే ఓవరాక్షన్ జగన్ కు అడ్వాంటేజ్ అవుతోంది. పరిపాలనలో కుదురుకోకుండానే నిరంతరం ఫిర్యాదులు, న్యాయపోరాటాలతో ప్రభుత్వాన్ని చికాకు పరచాలని తెలుగుదేశం ప్రయత్నించింది. 51 శాతం పైగా ప్రజల మద్దతు తో గెలిచిన జగన్ కు ఈ విపక్ష అత్యుత్సాహం కలిసి వచ్చింది. ప్రతిపక్షాల పోరాటంలోని హేతుబద్ధతపై ప్రశ్నలు మొదలయ్యాయి. ఒకవేళ వైసీపీ చెబుతున్న సర్వే విషయాలే నూటికి నూరుపాళ్లు పక్కాగా తేలితే మాత్రం ఇప్పట్లో విపక్షాల ఆశలు ఏపీలో నెరవేరవనే చెప్పవచ్చు.
ఎందుకలా… ?
అయితే సర్వేలో ప్రజలు వైసీపీకి కూడా షాకిచ్చే కొన్ని నిజాలు చెప్పినట్లు తెలుస్తోంది. రాష్ట్రం అధికంగా అప్పులు చేస్తున్న విషయం ప్రజలకు తెలుసు. అంతేకాకుండా అభివృద్ధి నిధులు తగినంత కేటాయించడం లేదనే విషయంపైనా మధ్యతరగతి కి మాత్రమే కాదు, పేద వర్గాలకూ అవగాహన ఏర్పడింది. అయితే గతంలో తెలుగుదేశం హయాంలోనూ అప్పులు చేశారు. అవి నాయకుల మామూళ్లుగా మారిపోయాయి. ఇప్పుడు చేస్తున్న అప్పులు సంక్షేమ పథకాల రూపంలో తమకు వస్తున్నాయనేది ప్రజలు అనుకుంటున్నారనేది సర్వే సారాంశం. ప్రజల అభిప్రాయాలను రికార్డు చేసుకుని వైసీపీ అధిష్టానానికి ఈ నివేదిక అందించారు. ఆస్తుల విలువలు పడిపోవడం, ఉద్యోగ కల్పనలో లోపాలు వంటివి ప్రజల్లో 25 శాతం మంది అసంతృప్తికి కారణమని తెలుస్తోంది. అయితే సర్వేను ఏ విధానంలో నిర్వహించారు? శాంపిల్ పరిమాణమెంత? నిర్వహించిన వారు నిపుణులైన సెఫాలజిస్టులా? లేక గ్రామ వాలంటీర్ల ఆధ్వర్యంలో నమూనాలు సేకరించారా? అన్న విషయాలు తెలియాల్సి ఉంది. వాటి మీదనే సర్వే సాధికారత ఆధారపడుతుంది.
-ఎడిటోరియల్ డెస్క్