వైసీపీలో కీలక చర్చ…. వైవీ డమ్మీనేనా..?
వైవీ సుబ్బారెడ్డి. సాక్షాత్తూ.. జగన్ మాతృమూర్తి విజయమ్మ సోదరి భర్త. ఈ రకంగా చూసుకుంటే.. జగన్‌కు అత్యంత కీలకమైన బంధువు.. బాబాయి కూడా. అలాంటి వైవీ సుబ్బారెడ్డి [more]
వైవీ సుబ్బారెడ్డి. సాక్షాత్తూ.. జగన్ మాతృమూర్తి విజయమ్మ సోదరి భర్త. ఈ రకంగా చూసుకుంటే.. జగన్‌కు అత్యంత కీలకమైన బంధువు.. బాబాయి కూడా. అలాంటి వైవీ సుబ్బారెడ్డి [more]
వైవీ సుబ్బారెడ్డి. సాక్షాత్తూ.. జగన్ మాతృమూర్తి విజయమ్మ సోదరి భర్త. ఈ రకంగా చూసుకుంటే.. జగన్‌కు అత్యంత కీలకమైన బంధువు.. బాబాయి కూడా. అలాంటి వైవీ సుబ్బారెడ్డి ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి అబ్బాయ్ పెట్టిన వైసీపీని భుజానేసుకున్నారు. ఈ క్రమంలోనే పార్టీలో తోపు అని కూడా అనిపించుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా గత ఏడాది వరకు చక్రం తిప్పారు. తన కనుసన్నల్లో రెండు మూడు జిల్లాలు ఉండేలా కూడా ఆయన వ్యవహరించారు. జగన్ ను కలవాలంటే ఆయా జిల్లాల నాయకులు ముందు వైవీ సుబ్బారెడ్డి అనుమతి తీసుకునే రేంజ్ వరకు ఆయన ఎదిగారు. ఇంకా చెప్పాలంటే జగన్ జైలులో ఉన్నప్పుడు 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైవీ సుబ్బారెడ్డి వ్యూహాలు రచించి విజయమ్మ, షర్మిలతో ప్రచారం చేయించి పార్టీ గెలుపులో తన వంతుగా చక్రం తిప్పారు.
ప్రకాశం రాజకీయాల్లో….
2014లో ఒంగోలు ఎంపీగా వైవీ సుబ్బారెడ్డి విజయం సాధించారు. ఈ క్రమంలోనే పార్టీ ఓడింది. అయితే.. జిల్లాపై మా త్రం పట్టు సాధించారు. ఈ నేపథ్యంలోనే ఇదే జిల్లాకు చెందిన కీలక నాయకుడు ప్రస్తుతం మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డితో వైవీ సుబ్బారెడ్డి వివాదాలకు సై అనేవారు. అంతా నా ఇష్టం! అన్న రేంజ్లో రాజకీయాలు చేశారు. ప్రజాక్షేత్రంలో గెలిచిన వాళ్ల మాటే నెగ్గుతుంది. నేను గెలిచాను.. నువ్వు ఎమ్మెల్యేగా ఓడావు.. నా మాటే జిల్లా అంతటా నెగ్గాలన్నట్టుగా వైవీ సుబ్బారెడ్డి వ్యవహరించారన్న టాక్ అయితే అప్పట్లో ఉంది. ఇది అప్పట్లో పార్టీలోనూ ఇబ్బందికర పరిణామాలను సృష్టించింది. జగన్ పలుమార్లు ఇద్దరి మధ్య రాజీ కుదిర్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.ఈ క్రమంలోనే గత ఏడాది ఎన్నికలకు ముందు ఇక, వైవీ సుబ్బారెడ్డి ని ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పించేందుకు జగన్ వ్యూహం సిద్ధం చేసుకున్నారనే వార్తలు వచ్చాయి.
వెలిగొండ కోసం….
దీంతో తన పట్టు చెదిరిపోకుండా ఉండేందుకు వెలిగొండ ప్రాజెక్టు కోసం పాదయాత్ర చేశారు ఎంపీగా వైవీ. ఇది వర్కవుట్ అయిందో లేదో తెలియదు కానీ,.. వైవీ సుబ్బారెడ్డి కి మాత్రం గత ఏడాది ఎన్నికల్లో టికెట్ మాత్రం దక్కలేదు. ఇక, జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. బాలినేని ప్రాధాన్యం పెరిగిపోయి.. వైవీ సుబ్బారెడ్డి నిజంగానే ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. నిజానికి వైవీ సుబ్బారెడ్డి కి ఎప్పుడు అయితే ఎంపీ సీటు ఇవ్వలేదో అప్పుడే ఆయన ప్రాధాన్యం తగ్గిందనే చెప్పాలి. పార్టీ అధికారంలోకి వచ్చాక జగన్ వ్యూహాత్మకంగా వైవీని టీటీడీ బోర్డుకు చైర్మన్‌ను చేశారు. అప్పట్లోనూ వివాదాలు వచ్చాయి. వైవీ వ్యక్తిగతంగా ప్రార్థనలకు వెళ్తారని, అలాంటి వ్యక్తిని చైర్మన్ ను ఎలా చేస్తారని విమర్శలు వచ్చాయి. ఇదిలావుంటే.. టీటీడీ చైర్మన్‌గా ఉన్నప్పటికీ.. వైవీ సుబ్బారెడ్డి కి పూర్తి స్వేచ్ఛ లేకుండా పోయింది.
వివాదాలతోనే….?
దీనికి ప్రధాన కారణం.. హిందూ మనోభావాలతో ముడిపడి ఉన్న విషయం కావడమే! పైగా ఆయన ఆదిలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా వివాదాస్పదమయ్యాయి. టీటీడీలో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బందిని టీడీపీ ముద్రవేసి తొలగించారు. ఇక, జగన్ ఎంతో ప్రేమతో ఎస్వీబీసీ చైర్మన్‌గా నియమించిన నటుడు పృధ్వీతోనూ వైవీ సుబ్బారెడ్డి విభేదాలు పెంచుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనను పక్కకు పెట్టారు. ఇక, వైవీ సుబ్బారెడ్డి తాడేపల్లిలో ఆఫీస్ పెట్టుకున్నారు. తనకు నచ్చిన వారిని ఇక్కడ నియమించుకుని పనులు చేస్తున్నారు.
ప్రత్యక్ష రాజకీయాల నుంచి….
ప్రత్యక్ష రాజకీయాలనుంచి వైవీ సుబ్బారెడ్డి పక్కకు జరగడంతో జగన్ కూడా ప్రాధాన్యం తగ్గించారు. వైవీ సుబ్బారెడ్డి వచ్చాక వీఐపీ దర్శనాలు పెరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇక తాడేపల్లిలో ఆయనకు ఆఫీస్, అక్కడ ఉద్యోగాలు వాళ్ల జీతాలు భారీగా ఉండేలా చేసుకోవడం కూడా జగన్‌కు నచ్చలేదన్న టాక్ అయితే వచ్చింది. మరోపక్క, జిల్లాపై బాలినేని ప్రభావం పెరిగింది. ఏం చేయాలన్నా.. ఏది జరగాలన్నా బాలినేని కేంద్రంగానే జరుగుతున్నాయి. మొత్తంగా ఈ పరిణామాలను చూస్తే.. ఒకప్పుడు తోపు అనుకున్న వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు డమ్మీ అయ్యారనే వాదన వైసీపీలో బలంగానే వినిపిస్తుండడం గమనార్హం.