మంత్రి పుల్లారావుకు చేదు మాత్ర తప్పేట్లు లేదే..?
రాజకీయాల్లో మాకు పదవులు ముఖ్యం కాదు.. ప్రజలే ముఖ్యం! తరచుగా నేతలు చెప్పే మాట ఇది! ఇప్పుడు ఇదే పరిణామం పౌరసరఫరాల మంత్రి, గుంటూరుకు చెందిన కమ్మసామాజిక వర్గానికి చెందిన నేత ప్రతిపాటి పుల్లారావు విషయంలో నిజం కాబోతోందనే టాక్ వినిపిస్తోంది. పుల్లారావు వ్యక్తిగతంగా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు వద్ద మంచి మార్కులే పొందినా.. కుటుంబ రాజకీయాలే ఆయనకు పదవీ గండాన్ని తెచ్చాయనే వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళ్తే.. ప్రతిపాటి పుల్లారావుకు టీడీపీలో సీనియర్‌గా మంచి గుర్తింపే ఉంది. జిల్లాలోనూ ఆయనకు తిరుగు లేదు.ఈ నేపథ్యంలో నే చంద్రబాబు 2014లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతోనే ప్రతిపాటిని తన బ్యాచ్‌లోకి తీసుకుని అత్యంత కీలకమైన వ్యవసాయ శాఖను అప్పగించారు.
సతీమణి సమాంతర రాజకీయాలు....
ఈ విషయంలో ప్రత్తిపాటి చాలా సంతోషించారు. వ్యవసాయ రుణమాఫీ వంటి పెద్ద విషయాన్ని చంద్రబాబు తనకు అప్పగించారని, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా తాను రైతులతో మమేకమై పని చేస్తానని పలు సభల్లో ఆయన చెప్పుకొన్నారు కూడా. అయితే, ప్రత్తిపాటి కుటుంబం మరోపక్క సమాంతరంగా రాజకీయాలు చేసుకుంటూ వచ్చింది. ముఖ్యంగా ఆయన సతీమణి, విద్యావంతురాలు కావడంతో నేరుగా బేరాలకు దిగారని, పురుగుమందులు, ఎరువుల కంపెనీలతో నేరుగా మాట్లాడి.. వ్యవహారాలు చక్కబెట్టారని అప్పట్లోనే పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పుమన్నాయి. అదేసమయంలో ఆయన కుటుంబ సభ్యులు కూడా తండ్రి పేరును అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున వ్యాపారాలు కూడా చేశారని ప్రముఖ పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి.
అంతా ఆవిడ మాటే....
ఇక, పోలీసు, రెవెన్యూ వ్యవహారాల్లోనూ ప్రత్తిపాటి సతీమణి జోక్యం చేసుకోవడం అప్పట్లో సంచలనంగా మారింది. ఆయా విషయాలపై చంద్రబాబుకు నిఘా నివేదికలు సహా స్థానిక నేతల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. దీంతో చూసి చూసి విసిగిపోయిన చంద్రబాబు ఏకంగా శాఖను మార్చేశారు. అయినా కూడా పౌరసరఫరాల శాఖను అప్పగించారు. దీనిలోనూ కుంటుంబ పాలన ఎక్కువైందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఇక, వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబు ప్రత్తిపాటికి ఉద్వాసన తప్ప చేయగలిగింది ఏమీ లేదని నిర్ణయించుకున్నట్టు అమరావతి వర్గాలు చెబుతున్నాయి.
గొట్టిపాటికి ఛాన్స్ దక్కేనా...
మరోపక్క, ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీ నేత గొట్టిపాటి రవికుమార్ టీడీపీ తీర్థం పుచ్చుకున్న నేపథ్యంలో ఆయనకు కేబినెట్లో అవకాశం ఇవ్వాలని బాబు యోచిస్తున్నట్టు తెలిసింది. గొట్టిపాటికి స్థానికంగా బలం పెరగడం, జిల్లాలో ఆయనకు బలమైన ఫాలోయింగ్‌తో పాటు గట్టి పట్టు ఉండడం, వచ్చే ఎన్నికల్లో తనకు లాభిస్తుందని చంద్రబాబు గట్టిగా విశ్వసిస్తుండడంతో ఆయనను కేబినెట్లో చేర్చుకోవడం దాదాపు ఖాయమై పోయిందనే టాక్ వినిపిస్తోంది. అదేసమయంలో గొట్టిపాటికి బాబు కుమారుడు, మంత్రి లోకేష్ మంచి అండదండగా నిలిచారు. మొన్నామధ్య.. గొట్టిపాటిపై అద్దంకి టీడీపీ నేత కరణం బలరామకృష్ణమూర్తి కుర్చీ ఎత్తిన నేపథ్యంలో స్పందించిన లోకేష్ .. గొట్టిపాటికి అనుకూలంగా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే గొట్టిపాటి ఎంట్రీ ఖాయమై పోయిందని అంటున్నారు. సో.. ప్రస్తుతం దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న బాబు తిరిగి ఏపీకి చేరుకున్న వెంటనే మార్పులు, చేర్పులు ఖాయమని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.